మీ ఆధార్‌ బయోమెట్రిక్‌ లాక్‌ చేసుకోండి


నిడమర్రు :

ఆధార్‌ కార్డు తీసుకున్న ప్రతీ ఒక్కరూ, వారి వేలిముద్రలతో పాటు కంటి రెటీనల్‌ స్కాన్‌ డేటాను ప్రభుత్వానికి సమర్పించారు. ఆధార్‌ సంఖ్య కోసం ఈ విధంగా సమర్పించిన డేటాను టెక్నికల్‌ పరిభాషలో ‘బయోమెట్రిక్‌ డేటా’ అని పిలుస్తారు. ఇలా సేకరించిన మీ బయోమెట్రిక్‌ డేటాను ఆధార్‌ వెరిఫికేషన్‌ నిమిత్తం ఉపయోగిస్తారు. కొత్త సిమ్‌ కార్డు దరఖాస్తు చేసుకున్నప్పుడు గుర్తింపు కార్డు కింద ఆధార్‌ కార్డును కేవైసీ వెరిఫికేషన్‌ నిమిత్తం సంబంధిత టెలికం కంపెనీ, మీ వేలిముద్ర ఆధారంగా బయోమెట్రిక్‌ వివరాల పరిశీలనకు ఉపకరిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగులు ఈ–హాజర్‌ నిమిత్తం ఈ బయోమెట్రిక్‌ డేటా ద్వారానే నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మీ ఆధార్‌ డేటాను లాక్‌ చేసుకోవడం ద్వారా మరింత సురక్షితం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు తెలుసుకుందాం.



డేటా లాక్‌/అన్‌లాక్‌కు అవకాశం

ఇటీవల వెలుగులోకి వచ్చిన కొన్ని సంఘటనలతో ఎంతో సురక్షితమని భావిస్తున్న ఆధార్‌ బయోమెట్రిక్‌ ప్రమాణీకరణ విషయంలో అంత సెక్యూర్‌ కాదన్న వాదనలతోపాటు,  దుర్వినియోగమవుతున్నాయనే అనుమానాల నేపథ్యంలో బయోమెట్రిక్‌ ప్రమాణీకరణను మరింత సురక్షితం చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీనిలో భాగంగా మీ ఆధార్‌ బయోమెట్రిక్‌ డేటా సురక్షితంగా ఉంచుకునేందుకు లాక్‌/అన్‌లాక్‌ అవకాశం కల్పించింది.



లాక్‌ చేసుకోవడం మరింత సురక్షితం

భవిష్యత్‌లో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే యూఐడీఏఐ సర్వర్లలో లాక్‌ అయి ఉన్న మీ బయోమెట్రిక్‌ సమాచారాన్ని లాక్‌ చేసుకోవటం ఉత్తమం. ఇలా చేయడం ద్వారా మీ బయోమెట్రిక్‌ డేటాను వేరొకరు యాక్సిస్‌ చేసుకునే అవకాశం ఉండదు. మీకు అవసరమైనపుడు మాత్రమే ఆన్‌లాక్‌ చేసుకుని, అవసరం లేనప్పుడు లాక్‌ చేసుకోవచ్చు. దీనివల్ల మీ ఆధార్‌ బయోమెట్రిక్‌ డేటాను వినియోగించుకోవాలంటే తప్పనిసరిగా రిజిస్టర్‌ మొబైల్‌కు అందే ఓటీపీ ద్వారా మాత్రమే ముందుకు కదులుతుంది.



ఆధార్‌ డేటా లాక్‌ ఇలా..


  • ముందుగా మీ కంప్యూటర్లో ఆధార్‌ అధికారిక  వెబ్‌సైట్‌ uidai.gov.in లోకి లాగిన్‌ కావాలి. అక్కడ తెలుగు భాషను ఎంపిక చేసుకోవాలి.

  • కనిపించే ట్యాగుల్లో ఆధార్‌ సేవలు అని కనిపించే కాలంలో బయోమెట్రిక్‌ తాళం వేయుట/తీయుట అనే అంశం వద్ద క్లిక్‌ చేయాలి.

  • మీ 12 అంకెల ఆధార్‌ నంబర్‌ను ఎంటర్‌ చేయండి. ఆధార్‌ నంబర్‌ ఎంటర్‌ చేసిన కాలమ్‌ కింద మరో సెక్యూరిటీ కోడ్‌ కాలమ్‌ మీకు కనిపిస్తుంది. అక్కడపైన ఉంచిన సెక్యూరిటీ కోడ్‌ ఎంటర్‌ చేయండి. పేజీలో కింద కనిపించే జనరేట్‌ ఓటీపీపై క్లిక్‌ చేయండి.

  • ఇప్పుడు ఆధార్‌తో రిజిస్టర్‌ అయిన మీ మొబైల్‌ నెంబర్‌కు ఎస్‌ఎంఎస్‌ రూపంలో ఓటీపీ అందుతుంది. ఈ ఓటీపీ సంబంధిత కాలమ్‌లో ఎంటర్‌ చేసి వెరిఫై ఆప్షన్‌ క్లిక్‌ చేయండి.

  • ఇప్పుడు ఎనేబుల్‌ బయోమెట్రిక్‌ లాకింగ్‌ను చెక్‌ చేసుకోండి.

  • ఎనేబుల్‌ బయోమెట్రిక్‌ లాకింగ్‌ను చెక్‌ చేసిన తర్వాత ఎనేబుల్‌ అప్షన్‌పై క్లిక్‌ చేసినట్టయితే మీ ఆధార్‌ బయోమెట్రిక్‌ వివరాలు లాక్‌ అవుతాయి.

  • ఒకవేళ లాక్‌ను డిజేబుల్‌ చేయాలనుకుంటే ఎనేబుల్‌ బయోమెట్రిక్‌ లాకింగ్‌ను ఆన్‌చేసి డిజేబుల్‌పై క్లిక్‌ చేయండి. ఈ సూచనల ప్రకారం మీ ఆధార్‌ బయోమెట్రిక్‌ సమాచారాన్ని లాక్‌ లేదా అన్‌లాక్‌ చేసుకోవచ్చు.

  • యూజర్‌ తన ఆధార్‌ బయోమెట్రిక్‌ డేటాను లాక్‌ చేయటం ద్వారా ఆధార్‌ సంబంధిత లావాదేవీలు, అలానే రిక్వస్ట్‌లను ఓటీపీ ఆధారంగానే మేనేజ్‌ చేయగలుగుతారు. వీళ్లకు సంబంధించిన వేలి ముద్ర/ఐరీస్‌ స్కాన్‌లు లాక్‌ అవుతాయి.
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top