చుట్టుపుచూపుగా అత్తవారింటికి వచ్చిన వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణించాడు. కోరుకొండ మండలంలోని బూరుగుపూడి
లారీ ఢీకొని వ్యక్తి మృతి
Oct 1 2013 2:19 AM | Updated on Sep 1 2017 11:12 PM
దోసకాయలపల్లి (మధురపూడి), న్యూస్‌లైన్ : చుట్టుపుచూపుగా అత్తవారింటికి వచ్చిన వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణించాడు. కోరుకొండ మండలంలోని బూరుగుపూడి గేట్-దోసకాయలపల్లి రోడ్డులో సోమవారం ఊక లారీ ఢీకొన్న సంఘటనలో ప్రత్తిపాడు మండలం ధర్మవరానికి చెందిన రాపా శ్రీను (30) చనిపోయాడు. కోరుకొండ ఎస్సై బి.వెంకటేశ్వరరావు కథనం ప్రకారం.. శ్రీను తన భార్యాబిడ్డలతో ఆదివారం దోసకాయలపల్లిలోని అత్తవారింటికి వచ్చాడు. సోమవారం మధ్యాహ్నం ఓ శుభకార్యంలో పాల్గొని, భార్యాబిడ్డలతో సొంత ఊరికి వెళ్లాల్సి ఉంది. ఇలాఉండగా సోమవారం ఉదయం ఓ యువకుడితో కలిసి మోటార్ బైక్‌పై శ్రీను కోరుకొండ వచ్చాడు. తిరిగి దోసకాయలపల్లికి వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. బైక్‌పై ఉన్న యువకుడు ప్రాణాపాయం నుంచి బయటపడగా, శ్రీను పైనుంచి లారీ వెనుక చక్రాలు దూసుకెళ్లడంతో అక్కడికక్కడే చనిపోయాడు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కూలీ పని చేసే శ్రీను చుట్టుపుచూపుగా వచ్చి.. తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో దోసకాయలపల్లిలోని అత్తవారిల్లు విషాదంలో మునిగిపోయింది. కోరుకొండ ఎస్సై బి.వెంకటేశ్వరరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement


