పేదల కోసం భూసేకరణ

Land Acquisition For The Poor In Visakha District - Sakshi

800 నుంచి 1000 ఎకరాల స్థలం అవసరం 

ప్రైవేటు భూములపై  కలెక్టర్‌ ఆరా 

ఉగాది నాటికి పట్టాల పంపిణీకి తీవ్ర కసరత్తు 

మహారాణిపేట(విశాఖ దక్షిణ): ఉగాది పండగ నాటికి పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కోసం పెద్ద మొత్తంలో భూ సేకరణ చేయాలని జిల్లా యంత్రాంగం భావిస్తోంది. ఇళ్లు లేని పేదలందరికీ స్థలాలు అందివ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంకలి్పంచారు. ఈ విషయంపై అధికారులకు కచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఉగాది నాటికి జిల్లాలో మూడు లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలన్న లక్ష్యంతో రెవెన్యూ అధికారులు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వ భూమి లేకపోతే ప్రైవేటు భూములు సేకరించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. జిల్లా మొత్తం మీద 800 ఎకరాల నుంచి వెయ్యి ఎకరాల స్థలాన్ని సేకరించాలన్న ఆలోచనతో అధికార యంత్రాంగం ఉంది. సబ్‌ రిజి్రస్టార్‌ విలువ(ఎస్‌ఆర్‌) ప్రకారం మూడు రెట్ల అదనపు ధరతో జిరాయితీ భూములు కొనుగోలు చేయడానికి ప్రణాళికలు తయారు చేస్తున్నారు.

 నియోజకవర్గాల వారీగా భూ సేకరణ 
ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంత మేర స్థలం అవసరమన్న దానిపై యంత్రాంగం అంచనా వేస్తోంది. జిల్లాలో 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అర్బన్‌ పరిధిలో ఉండే నాలుగు మండలాలు మినహా.. మిగిలిన 11 మండలాల్లో వివరాలు సేకరిస్తున్నారు. అరకు, పాడేరు మండలాల్లో అక్కడ గిరిజనులకు ప్రాధాన్యం ఉంటుంది. మిగిలిన 9 మండలాల్లో అసలు ప్రభుత్వ స్థలాలు ఎంత మొత్తంలో ఉన్నాయి, ప్రైవేటు భూములు ఎంత మేర సేకరించాలి, ఎక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయి, ప్రభుత్వ స్థలాల పరిస్థితిపై సర్వే చేసి తనకు నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ వినయ్‌చంద్‌ ఇటీవల తహసీల్దార్లకు ఆదేశాలు ఇచ్చారు. గ్రామాల్లో శివారు కొండలు, గుట్టలు, పోరంబోకు స్థలాలు ఎంత మేర ఉన్నాయన్న దానిపై రెవెన్యూ అధికారులు సర్వే చేస్తున్నారు.

 3 లక్షల మందికి పట్టాల పంపిణీ  
ఉగాది నాటికి మూడు లక్షల మంది పేదలకు పట్టాలు ఇవ్వడానికి కసరత్తు చేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో అనువైన భూములను గుర్తించేందుకు తహసీల్దార్లు స్వీయ పర్యవేక్షణలో రెవెన్యూ బృందాలు రంగంలోకి దిగాయి. వీటిని ఆర్డీవోలు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో భూములు అందుబాటులో ఉన్నా.. అవి గ్రామాలకు శివారులోనూ, కొండలు, గెడ్డలు, గుట్టలకు అనుకుని ఉన్నాయి. ఇక అనకాపల్లి, నర్సీపట్నం, పాడేరు, విశాఖ రెవెన్యూ డివిజన్లలో పెద్ద సంఖ్యలో దరఖాస్తుదారులు ఉన్నారు. ఇళ్ల స్థలాలు కేటాయింపులో స్పందన కార్యక్రమంలో వచ్చే దరఖాస్తులకు ప్రాధాన్యమిస్తున్నారు. ఈ దరఖాస్తులను విచారణ చేసి తగు నిర్ణయం తీసుకుంటున్నారు. 

ల్యాండ్‌ పూలింగ్‌ కోసం.. 
ప్రభుత్వ, జిరాయితీ భూముల సేకరణ తర్వాత.. అవసరమైతే అసైన్డ్‌ భూములపై తీసుకుని వారికి ల్యాండ్‌ పూలింగ్‌ ద్వారా తిరిగి భూములు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. ఎకరానికి 900 చదరపు గజాల స్థలం ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. నగర పరిధిలోని మండలాల్లో అసైన్డ్‌ భూములు లభ్యతపై అన్వేషణ జరుగుతోంది. విశాఖ రెవెన్యూ డివిజన్‌ పరిధిలో విశాఖ రూరల్, ఆనందపురం, భీమిలి, పద్మనాభం, పెందుర్తి, సబ్బవరం మండలాల్లో ఏ మేర అసైన్డ్‌ భూములు ఉన్నయన్న దానిపై రెవెన్యూ అధికారులు ఆరా తీస్తున్నారు. 

భూసేకరణలో నిర్లక్ష్యం వద్దు 
పేద ప్రజలకు ఉపయోగ పడే స్థలాలను సేకరించాలని, ఎలాంటి నిర్లక్ష్యం వద్దని కలెక్టర్‌ వినయ్‌చంద్‌ ఇటీవల జరిగిన సమీక్షలో తహసీల్దార్లకు సూచించారు. భూములను ప్రైవేటు వ్యక్తుల నుంచి కొనుగోలు చేయడానికి సిద్ధం అని కూడా చెప్పినట్టు సమాచారం. ప్రభుత్వ ఆదేశాల మేరకు సిబ్బంది పని చేయాలని, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆశయ సాధన కోసం ఉగాది పట్టాల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా అమలు చేయాలన్నారు. సొంత ఇళ్లు కట్టుకోవడానికి ఎలాంటి స్థలం తీసుకుంటామో.. అదే పద్ధతిలో ప్రభుత్వం ఇచ్చే ఇళ్ల స్థలం ఉండాలని కలెక్టర్‌ అధికారులకు స్పష్టం చేశారు.     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top