ఇసుక తరలిస్తే ఖబడ్దార్‌ 

Kurnool SP  Warned Sand Migration Rules Violated  - Sakshi

సాక్షి, కర్నూలు: ప్రభుత్వం తాత్కాలికంగా ఇసుక తరలింపును నిలిపివేసిందని, ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప హెచ్చరించారు. బుధవారం ఆయన వెల్దుర్తి ,  కృష్ణగిరి పోలీస్‌స్టేషన్‌లను తనిఖీ చేశారు. న్యాయం కోసం స్టేషన్‌కు వచ్చే వారి పట్ల మర్యాదగా వ్యవహరించి ప్రజల మన్ననలు పొందాలని ఎస్‌ఐలు పులిశేఖర్, విజయభాస్కర్‌లకు సూచించారు. అనంతరం ఎస్పీ విలేకరులతో మాట్లాడారు. అసాంఘిక చర్యలు అరికట్టేందుకు తన ఆధ్వర్యంలో క్రైం పార్టీని ఏర్పాటు చేశామన్నారు.

ఎక్కడైనా ఎలాంటి ఘటన జరిగినా ప్రజలు తమకు సమాచారం ఇస్తే, క్రైం పార్టీ ఆధ్వర్యంలో వెంటనే చర్యలకు దిగుతామన్నారు. వెల్దుర్తి హైవేలో గత నెల జరిగిన బస్సు ప్రమాదంలో 17 మంది మృతిచెందడం బాధాకరమని, బాధితులకు నష్టపరిహారం అందేలా జిల్లా కలెక్టర్‌ ద్వారా నివేదికలు ప్రభుత్వానికి పంపామన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా ప్రయాణికులకు, వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఐదేళ్లు ఒకేచోట పనిచేసిన పోలీసులను బదిలీ చేసే ప్రక్రియ ప్రారంభించామన్నారు.

భార్య, భర్తలిద్దరూ ఉద్యోగులైతే మెడికల్‌ గ్రౌండ్‌ కింద వారికి మరో అవకాశమివ్వనున్నామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు పూర్తిస్థాయిలో సిద్ధమైనట్లు ఎస్పీ తెలిపారు. బాధితులమైన తమపైనే కేసు బనాయించారని గత నెల 23న చిన్నటేకూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం బాధితుడు మంగంపల్లె హరిచంద్రుడు ఎస్పీకి ఫిర్యాదు చేయగా, వివరాలు తెలుసుకుని న్యాయం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం స్థానిక పోలీస్‌ క్వార్టర్స్‌ను పరిశీలించారు. మరమ్మతులు, నిర్మాణాలకు ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. ఆయన వెంట డోన్‌ రూరల్‌ సీఐ శ్రీనివాస్‌ ఉన్నారు.     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top