రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ మంగళవారం టీడీపీ శ్రేణులు ఏలూరులోని
కావూరి కార్యాలయ ముట్టడికి యత్నం
Feb 12 2014 2:54 AM | Updated on Aug 15 2018 7:45 PM
ఏలూరు, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ మంగళవారం టీడీపీ శ్రేణులు ఏలూరులోని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఏలూరు డీఎస్పీ ఎం.సత్తిబాబు ఆధ్వర్యంలో పోలీసులు నాయకులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీంతో టీడీపీ ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ బడేటి కోట రామారావు(బుజ్జి), రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాగంటి బాబు, జిల్లా కార్యాలయ కార్యదర్శి పాలి ప్రసాద్‌లను పోలీసులు అదుపులోనికి తీసుకుని స్టేషన్‌కు తరలించేందుకు జీపు ఎక్కించారు. అయితే కార్యకర్తలు జీపుగా అడ్డుగా రోడ్డుపై బైఠాయించడంతో అరెస్టు చేసిన నాయకులను వదిలివేశారు. అనంతరం బడేటి బుజ్జి, మాగంటి బాబు మాట్లాడుతూ సీమాంధ్రుల మనోభావాలను గుర్తించకుండా కేంద్ర ప్రభుత్వం విభజన విషయంలో దూకుడుగా వ్యవహరించడం దారుణమన్నారు. ఎన్నుకున్న ప్రజలకు అండగా నిలవాల్సిన కావూరి సాంబశివరావు ప్యాకేజీలకు అమ్ముడుపోయి ప్రజలను నట్టేట ముంచుతున్నారని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొల్లేపల్లి రాజు, ఈడ్పుగంటి నరసింహరావు, భీమవరపు సురేష్‌కుమార్, శేషపు వెంకటేశ్వరరావు, చోడే వెంకటరత్నం, ఎ.మధు పాల్గొన్నారు.
Advertisement
Advertisement