ఇది మానవ హక్కుల ఉల్లంఘనే

ఇది మానవ హక్కుల ఉల్లంఘనే


శేషాచలం ఎన్‌కౌంటర్‌పై ఎన్‌హెచ్‌ఆర్సీ సీరియస్

కేసును సుమోటోగా విచారణ చేపట్టిన కమిషన్

ఏపీ సీఎస్, డీజీపీలకు నోటీసులు జారీ

సమాధానమిచ్చేందుకు రెండువారాల గడువు


 

హైదరాబాద్: శేషాచలం అటవీప్రాంతంలో మంగళవారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్ ఉదంతాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్‌హెచ్‌ఆర్సీ) తీవ్రంగా పరిగణించింది. మీడియా కథనాల ఆధారంగా కేసును సుమోటోగా విచారణ చేపట్టిన కమిషన్ ఇది మానవహక్కుల ఉల్లంఘన కిందికే వస్తుందని వ్యాఖ్యానించింది. ఈ ఎన్‌కౌంటర్ అంశాన్ని ఎన్‌హెచ్‌ఆర్సీ కేరళలోని తిరువనంతపురం పర్యటనలో ఉన్న సభ్యుడు జస్టిస్ డి.మురుగేశన్ దృష్టికి తీసుకువెళ్లింది. ఆయన ప్రాథమిక పరిశీలన ప్రకారం ఎన్‌కౌంటర్ ఉదంతంలో తీవ్రమైన మానవహక్కుల ఉల్లంఘనలున్నట్టుగా వెలుగులోకి వచ్చినట్టు స్పష్టం చేసింది. మీడియా కథనాల ప్రకారం రాళ్లు, కత్తులు, గొడ్డళ్లతో దాడికి యత్నించిన కూలీలపై పోలీసులు, అటవీశాఖ అధికారులు కాల్పులు జరిపినట్లు తెలుస్తోందని, ప్రాణ రక్షణ పేరుతో చేపట్టిన చర్యలో 20 మంది కూలీలు ప్రాణాలు కోల్పోవడం న్యాయసమ్మతం కాదని వ్యాఖ్యానించింది. ఈ చర్యలకు సంజాయిషీతోపాటు సమగ్ర నివేదిక కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా జవాబివ్వాలని ఆదేశించింది. ఈ నెల 23న హైదరాబాద్‌లో జరగనున్న ఎన్‌హెచ్‌ఆర్సీ క్యాంప్ సిట్టింగ్‌లో ఈ ఎన్‌కౌంటర్‌పై విచారణ చేపట్టనున్నట్టు కమిషన్ పేర్కొంది.



నాలుగు నెలల్లో రెండోసారి...



ఎర్రచందనం కూలీలపై రాష్ట్రంలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనను ఎన్‌హెచ్‌ఆర్సీ తీవ్రంగా పరిగణించడం గడిచిన నాలుగు నెలల్లో ఇది రెండోసారి. గతేడాది డిసెంబర్‌లో అటవీశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన కమిషన్ రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు నోటీసులు జారీ చేసింది. తమిళనాడులోని ధర్మపురి, వేలూరు, కృష్ణగిరి జిల్లాలకు చెందిన నిరుపేదల్ని స్మగ్లర్లు శేషాచలం అడవుల్లోని ఎర్రచందనం చెట్లు నరికే కూలీలుగా తీసుకొస్తున్నారు. ఇలా వచ్చిన కొందరిపై అటవీ శాఖ అధికారులుగా పేర్కొంటున్న వ్యక్తులు విచక్షణారహితంగా కొట్టిన వీడియోతోసహా వచ్చిన ఫిర్యాదును ఎన్‌హెచ్‌ఆర్సీ గతేడాది డిసెంబర్‌లో పరిగణనలోకి తీసుకుంది. తాము చేస్తున్నది చట్టవిరుద్ధమని తెలియని నిరుపేదల విషయంలో అటవీశాఖ అధికారుల తీరును కమిషన్ సభ్యుడు జస్టిస్ డి.మురుగేశన్ తప్పుపట్టారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top