ఆంగ్ల మాధ్యమంపై విచారణ ఫిబ్రవరి 4కి వాయిదా

An inquiry into the English medium adjourned to February 4 - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ జితేంద్రకుమార్‌ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్‌ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ జరిపింది. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ కౌంటర్‌ దాఖలు చేసేందుకు 10 రోజులు గడువు కావాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ (ఏఎస్‌జీ) బి.కృష్ణమోహన్‌ స్పందిస్తూ.. విద్యా హక్కు చట్టం ప్రకారం 8వ తరగతి వరకు మాతృ భాషలోనే విద్యాబోధన జరగాలన్నది కేంద్ర ప్రభుత్వ విధానమన్నారు.

ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. ఆంగ్ల మాధ్యమంలోనే చదవాలని విద్యార్థులను బలవంతం చేయలేమని, ఇందుకు సుప్రీంకోర్టు తీర్పు సైతం అంగీకరించడం లేదని వ్యాఖ్యానించింది. ఆంగ్ల మాధ్యమంలో పాఠ్య పుస్తకాల ముద్రణ తదితర విషయాల్లో ముందుకెళితే సంబంధిత అధికారులే అందుకు బాధ్యత వహించాల్సి ఉంటుందని ఇప్పటికే ఓసారి చెప్పామని, ఇప్పుడు మళ్లీ అదే విషయాన్ని పునరుద్ఘాటిస్తున్నామని ధర్మానసం తెలిపింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశిస్తూ విచారణను ఫిబ్రవరి 4వ తేదీకి వాయిదా వేసింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top