వరద బాధితులకు తక్షణ సహాయం

Immediate assistance to flood victims - Sakshi

నిత్యావసర వస్తువుల పంపిణీ విషయంలో ఆలస్యం చేయొద్దు

తాగునీటికి ఇబ్బంది లేకుండా చూడండి

అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోండి

గోదావరి వరద పరిస్థితిపై జరిగిన సమీక్షలో మంత్రులు,అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశం

సాక్షి, అమరావతి: గోదావరి వరద ముంపు బాధితులకు ఉదారంగా సహాయం అందించాలని, నిత్యావసర వస్తువుల పంపిణీ విషయంలో ఆలస్యం చేయవద్దని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉభయ గోదావరి జిల్లాల్లో పరిస్థితులపై సోమవారం తాడేపల్లిలోని తన నివాసంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, హోం, విపత్తుల శాఖ మంత్రి సుచరిత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం తదితర అధికారులతో సీఎం సమీక్షించారు. గతంలో ధవళేశ్వరం వద్ద 2, 3 ప్రమాద స్థాయి హెచ్చరికలు దాటినప్పుడే దేవీపట్నం మండలంలోని గ్రామాలు ముంపునకు గురయ్యేవని, ఇప్పుడు ఒకటో ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరకముందే ముంపునకు గురయ్యాయని అధికారులు వివరించారు. దీనికి కారణాలేంటో అధ్యయనం చేసి తగు చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు.

గడచిన 56 రోజుల్లోనే 500 టీఎంసీల జలాలు గోదావరి నది ద్వారా సముద్రంలోకి కలిసిపోయినట్టుగా అంచనా వేశామని అధికారులు తెలిపారు. వచ్చే 2 రోజులపాటు మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి కొనసాగే అవకాశాలున్నాయని, మేడిగడ్డ వద్ద ప్రాణహిత నుంచి 4 లక్షల క్యూసెక్కుల నీరు అదనంగా వస్తుండడం వల్ల ఈ పరిస్థితి ఉంటుందని పేర్కొన్నారు. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో వచ్చే వారం రోజుల పాటు వర్ష సూచన లేదని, 3 రోజుల్లో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొంటాయని వివరించారు. వరద బాధిత ప్రాంతాల్లో సంబంధిత మంత్రులు పర్యటించాలని సీఎం పునరుద్ఘాటించారు. సకాలంలో సహాయక చర్యలు అందేలా చర్యలు తీసుకోవాలని, తాగు నీటికి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలని, అంటు వ్యాధులు ప్రబలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, పశు వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేయాలని సూచించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top