వంద గజాలకు లక్ష చిక్కులు | Sakshi
Sakshi News home page

వంద గజాలకు లక్ష చిక్కులు

Published Fri, Aug 14 2015 11:31 PM

వంద గజాలకు లక్ష చిక్కులు - Sakshi

అభ్యంతరాలు పరిధే ఎక్కువ
లబ్ధిదారుల సంఖ్యను కుదించే రూల్స్
కొండలపై నిర్మాణాలకే క్రమబద్ధీకరణ ఛాన్స్
పదివేలకు మించని అర్హులు
 

 విశాఖపట్నం సిటీ : వంద చదరపు గజాల విస్తీర్ణంలో అభ్యంతరాలు లేని ప్రభుత్వ స్థలాల్లో నివాసముంటున్న వారి గృహ నిర్మాణాలను క్రమబద్ధీకరిస్తాం.

 -ఇటీవల నగరంలో సీఎం చంద్రబాబు చేసిన ప్రకటన ఇది..
 ఈ ప్రకటన ప్రభుత్వ స్థల ఆక్రమితదారుల్లో ఆనందాన్ని నింపింది. వాస్తవ పరిస్థితి పరిశీలిస్తే అర్హుల జాబితా అంతగా లేదని భోగట్టా. ఎక్కువ మంది లబ్ధిపొందే అవకాశం లేదని అర్ధమవుతోంది. రెండు నెలల కిందట రహస్య సర్వే ద్వారా లబ్ధిదారుల సంఖ్య తక్కువగా ఉన్నదని నిర్ధారించుకున్నాకే సర్కారు ఈ ప్రకటన చేసినట్లు తెలిసింది. కొండలపై నివాసముంటున్న కొద్దిమందే లబ్ధిపొందనున్నారని సర్వేలో తేటతెల్లమైంది. పదివేలకు మించి ఇళ్ల నిర్మాణాలు క్రమబద్ధీకరణ జరగదని భావిస్తున్నారు.

మహా నగర పాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం, రెవెన్యూ వర్గాలు జూన్ 25 నుంచి ఈనెల 5 వరకూ సర్వే చేశారు. 100 గజాల లోపు అభ్యంతరం లేని గృహాలను నిశితంగా పరిశీలించారు. వివరాలు బయటకు పొక్కకుండా పకడ్బందీగా సర్వే చేశారుగెడ్డ పోరంబోకు, చెరువులు, కాల్వలు, పోరంబోకు స్థలాలు, స్మశానాలు,వక్ఫ్ స్థలాలు, దేవాదాయ ధర్మాదాయ శాఖ, సీఆర్‌జెడ్, , హౌస్‌కమిటీ భూములన్నీ అభ్యంతరకరమైనవేనని వీరు నివేదించారు. ఈ భూముల్లో నిర్మాణాలకు ప్రభుత్వం ప్రకటించిన క్రమబద్ధీకరణ  వర్తించదని గుర్తించారు. కొండవాలు ప్రాంతాలు, గయాళ్లు భూముల్లో నిర్మాణాలను మాత్రమే వర్తించనుంది. నగర వ్యాప్తంగా 10 వేల ఇళ్లపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. 20 వేల ఇళ్లకు క్రమబద్ధీకరణ అర్హత ఉన్నట్టు గుర్తించారు.

నగరంలో కొండవాలు ప్రాంతాలన్నీ సింహాచలం దేవాదాయ భూ పరిధిలోనే ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో నిర్మించుకున్న ఇళ్లకు క్రమబద్ధీకరణ కుదరదని రెవెన్యూ, పట్టణప్రణాళిక అధికారిక వర్గాలు చెబుతున్నాయి. హనుమంతవాక జంక్షన్ నుంచి సింహాద్రిపురం, దుర్గా నగర్, వెంకోజీపాలెం, సీతమ్మధార, బ్యాంకు కాలనీ, నార్త్ ఎక్స్‌టెన్షన్, గణేష్‌నగర్, కస్తూరినగర్, సింగాలమ్మ కాలనీ, సత్యసాయి నగర్, వరాహగిరి కాలనీ, బర్మాక్యాంపు లోని కొన్ని భాగాలు, మాధవధార ప్రాంతంలోని మరి కొన్ని ప్రాంతాలున్నాయి. ఇవన్నీ అభ్యంతరాలు వ్యక్తమయ్యే ప్రదేశాలేనని తేల్చారు.

గాజువాక, పెందుర్తి ప్రాంతంలోని కొండవాలు ప్రాంతాల్లోనూ అభ్యంతరాలు వ్యక్తమయ్యే గృహాలే ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. ఆ ఇళ్లన్నీ ఎన్ని సంవత్సరాలు క్రితం నిర్మాణమైంది...పన్ను ఎప్పటి నుంచి చెల్లిస్తున్నదీ వంటి లెక్కలేసి లబ్ధిదారుల సంఖ్యను భారీగా తగ్గించనున్నారని తెలిసింది. కైలాసపురం, కప్పరాడ, బర్మాక్యాంపు, మురళీనగర్, మాధవధార, తాటిచెట్లపాలెం, ఆశవానిపాలెం వంటి ప్రాంతాల్లో నిర్మించుకున్న ఇళ్ల వారికి ఈ స్కీం వర్తించవచ్చని అధికారిక వర్గాలు భావిస్తున్నాయి. మార్గదర్శకాలు విడుదలైతే లబ్దిదారులు సంఖ్య పెరిగే అవకాశాలున్నాయని తెలిసింది. ముఖ్యమంత్రి స్వాతంత్య్రవేదికపై దీనికి సంబంధించి స్పష్టీకరణ చేస్తారని లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement