
బరితెగింపు
చైన్‌స్నాచర్ల విజృంభణతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఒకటి కాదు.. రెండు కాదు..
నగరంలోని నాలుగు {పాంతాల్లో చైన్‌స్నాచర్ల హల్‌చల్
గురువారం ఉదయం గంట వ్యవధిలో చేతివాటం
ఒకరి పనేనా లేదా ముఠానా..?
అప్రమత్తమైన పోలీస్ యంత్రాంగం
భయాందోళనలో మహిళలు
విజయవాడ సిటీ : చైన్‌స్నాచర్ల విజృంభణతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగు ప్రాంతాల్లో గురువారం ఉదయం జరిగిన గొలుసు దొంగతనాలు పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. గురునానక్ రోడ్డులోని గురుద్వార్ వద్ద, అశోక్ నగర్‌లోని వెంకటేశ్వరరావు వీధి, జ్యోతిమహల్ దగ్గరలో, మొగల్రాజపురంలోని శివాలయం వద్ద గురువారం ఉదయం 8.30 నుంచి 9.45 గంటల మధ్యలో ఈ దొంగ తనాలు జరిగాయి. ఈ ప్రాంతాలన్నీ నిత్యం జనసంచారంతో రద్దీగా లేదా ముఠాగా ఏర్పడి చేస్తున్నారా అనే అనుమానాలు పోలీసుల్లో వ్యక్తమవుతున్నాయి. గంటంపావు వ్యవధిలో రూ.5లక్షల విలువైన 20 కాసుల బంగారాన్ని కొట్టేసిన వారికోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.
పోలీసులకు సవాల్
నేరాలు తగ్గుముఖం పట్టాయంటూ ఊపిరిపీల్చుకుంటున్న పోలీసులకు దొంగలు విసిరిన ఈ సవాల్ ముచ్చెమటలు పట్టిస్తోంది. వెంటనే స్పందించిన పోలీసులు ప్రధాన రహదారులను దిగ్బంధించి, పొరుగు జిల్లా పోలీసులను అప్రమత్తం చేశారు. బాధితుల సమాచారం ఆధారంగా ప్రత్యేక బృందాలతో నిందితుల పట్టివేతపై దృష్టిసారించారు. పాత నేరస్తుల చిట్టా బయటకు తీయడంతో పాటు అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సీసీ టీవీ పుటేజ్‌లు పరిశీలిస్తున్నారు.
భయాందోళనలో మహిళలు
జన సంచారం ఉన్న సమయంలోనే గొలుసు చోరీలకు తెగబడటంతో నగర మహిళలు బెంబేలెత్తిపోతున్నారు. ఆకస్మిక పరిణామం నుంచి బాధితులు తేరుకుని కేకలు వేసేలోగానే ఆగంతకుడు కనుమరుగయ్యాడు. కొన్నిచోట్ల ఆగంతకుడ్ని పట్టుకునేందుకు చేసిన ప్రయత్నాలూ ఫలించలేదు.
ఒకరేనా..? ముఠానా?
గోదావరి పుష్కర విధుల కోసం కమిషనరేట్ నుంచి పెద్దసంఖ్యలో పోలీసులు బందోబస్తుకు వెళ్లారు. అలాగే, కొంతకాలంగా నగరంలో నేరాలు తగ్గడంతో పోలీసులు రిలాక్స్‌గా ఉన్నారు. ఇందులో భాగంగా ఉదయం 6 నుంచి 9 గంటల మధ్య కాలనీలు, ముఖ్య కూడళ్లలో నిఘా పెట్టడం మానేశారు. స్టేషన్ సిబ్బంది గస్తీ కూడా నామమాత్రంగానే ఉంది. సీసీఎస్ పోలీసులు చేపట్టిన చర్యలకు పొరుగు ప్రాంతాల నుంచి నేరస్తుల రాక తగ్గిందనేది వాస్తవం. అందుకే పోలీస్ కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు బదిలీ తర్వాత నిఘా, గస్తీకి స్వస్తి చెప్పారు. ఈ క్రమంలోనే ఒకేరోజు నాలుగు గొలుసు దొంగతనాలు జరగడం పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఇవన్నీ ఒక్కరే చేసినట్టు భావిస్తున్నా ఆయా ప్రాంతాల మధ్య ఉన్న వ్యత్యాసం, రాకపోకల సమయంలో రద్దీని దృష్టిలో పెట్టుకుని ముఠా పనిగా అనుమానిస్తున్నారు. పోలీసులను ఏమార్చే క్రమంలో భాగంగానే ఒకే తరహాలో నేరం చేసి ఉంటారని, జరిగిన నేరాలను బట్టి చూస్తే పొరుగు ప్రాంతాల నేరస్తుల ప్రమేయం ఉండొచ్చని అధికారులు అంటున్నారు.
డయల్ 100కు సమాచారం ఇవ్వండి
గొలుసు చోరీలకు పాల్పడిన ప్రాంతాల్లో నిందితుడ్ని పట్టుకునేందుకు కొందరు యువకులు ప్రయత్నించినట్టు మా దృష్టికి వచ్చింది. ఈ విధంగా నిందితులను గమనించిన వాళ్లు డయల్ 100కు సమాచారం ఇచ్చి పోలీసులకు సహకరించాలి. ఇప్పటికే అనుమానిత వ్యక్తులు, ప్రాంతాలపై నిఘా పెట్టాం. నిందితుల పట్టివేతకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాం.
- జి.రామకోటేశ్వరరావు,
అదనపు డీసీపీ(క్రైమ్స్)