అసలు నష్టమెంత? | Huge Loss caused by rains defies official estimate | Sakshi
Sakshi News home page

అసలు నష్టమెంత?

Oct 29 2013 6:02 AM | Updated on Sep 2 2018 4:46 PM

వారం రోజులుగా పంటలన్నీ నీళ్లలోనే ఉన్నాయి. నెల రోజుల్లో చేతికొచ్చే తరుణంలో పంటలన్నీ నీటిపాలయ్యాయి. నష్టం గురించి ఏమని చెప్పగలం..

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:  వారం రోజులుగా పంటలన్నీ నీళ్లలోనే ఉన్నాయి. నెల రోజుల్లో చేతికొచ్చే తరుణంలో పంటలన్నీ నీటిపాలయ్యాయి. నష్టం గురించి ఏమని చెప్పగలం.. బ్యాంకుల నుంచి రైతులు రూ.742 కోట్ల రుణాలు తీసుకున్నారు. పరిహారం ఇచ్చే బదులు ఆ రుణాలు మాఫీ చేస్తే మంచిది.. వ్యవసాయాధికారుల సమాధానం.
 .. దీన్ని బట్టి చూస్తే జిల్లాలో పంట నష్టం కనీసం రూ.742 కోట్లు ఉన్నట్లు భావించాల్సి వస్తోంది. అయితే జిల్లా అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం రూ.265 కోట్లేనట!.. నష్టాలపై సర్వే మొదలు పెట్టకుండానే ఈ విధంగా అంచనా వేయడం గమనార్హం. అసలు రైతులకు జరిగిన నష్టమెంత? దాన్ని ఏ ప్రాతిపదికన గణించాలన్నది ప్రస్తుతం వ్యవసాయాధికారులను తర్జనభర్జనలకు గురిచేస్తోంది. రెండు రోజుల క్రితం వ్యవసాయశాఖ కమిషనర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన్నుంచి ఇదే ప్రశ్న ఎదురు కాగా అధికారులు సూటిగా చెప్పలేకపోయారు. వారం రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. పంటపొలాలు చెరువులను తలపిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఎంత నష్టమని చెప్పగలమని అధికారులు సమాధానం ఇచ్చారు. అయితే ప్రాథమిక అంచనాలు సోమవారం తయారు చేశారు. జిల్లా వ్యాప్తంగా వరి పంట 2.60 లక్షల ఎకరాల్లో నీట మునిగిందని తేల్చారు. నష్టం 260 కోట్లు ఉంటుదని అంచనా వేశారు. ఉద్యాన పంటలు 4500 ఎకరాల్లో దెబ్బతిన్నాయని, రూ. 5 కోట్ల మేర నష్టం జరిగి ఉంటుందని నిర్థారణకు వచ్చారు.
 పంటంతా నీటిలోనే..
 జిల్లాలో సుమారు నాలుగు లక్షల ఎకరాల్లో వరి పంట వేశారు. నెల రోజుల్లో చేతికి రావాల్సిన ఈ పంటంతా గత వారం రోజు లుగా నీటిలోనే ఉంది. నీరంతా  బయటకు వెళ్లడానికి మరో మూడు రోజులైనా పడుతుంది. ఈ లెక్కన పది రోజులు నీటిలో నానిన పంట  దక్కే అవకాశం లేదన్నమాటే. పంటలు బాగా పండితే ఎకరాకు 30 బస్తాల వరకు దిగుబడి వస్తుంది. బస్తా వరి ధాన్యం కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసినా వెయ్యి రూపాయలు. అధికారుల చెప్పిన దెబ్బతిన్న పంట విస్తీర్ణం 2.60 లక్షల ఎకరాలకే లెక్క వేస్తే  రూ. 800 కోట్లు అవుతుంది.
 దిగుబడిని దృష్టిలో ఉంచుకొని అంచనా వేయాలి
 పంట సాగుకు పెట్టిన పెట్టుబడులు, దిగుబడులను దృష్టిలో ఉంచుకొని నష్టం అంచనాలు తయారు చేయాల్సిన అవసరం ఉంది.  పొలాల్లోనే ఉన్న పంట నష్టాన్ని ఎలా లెక్కించాలనే మీమాంస అధికారులు వ్యక్తం చేయడం సరికాదని రైతులు అంటున్నారు. మరో 30 రోజుల్లో చేతికి రావాల్సిన పంట నీటిపాలైన విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. అందువల్ల ఎకరాకు సగటు దిగుబడి ఆధారంగా నష్టం అంచనా వేయాలని కోరుతున్నారు.
 బ్యాంకు రుణాలతో సమానంగా నష్టం
 జిల్లాలో రైతులు వివిధ బ్యాంకుల నుంచి సుమారు రూ. 742 కోట్ల పంట రుణాలు తీసుకున్నట్లు అధికారుల వద్ద సమాచారం ఉంది. పంట నష్టం కూడా దాదాపు అదే స్థాయిలో ఉన్నందున రుణాలను వెంటనే మాఫీ చేయాలని.. ఇంతకంటే తామేమీ చెప్పలేమని మండల వ్యవసాయశాఖ అధికారులు జిల్లా వ్యవసాయశాఖ ఉన్నతాధికారులకు తేల్చి చెప్పినట్లు సమాచారం. ఇదే కాకుండా చాలా మంది రైతులు ప్రైవేట్‌గా అప్పులు తీసుకున్నారు. ఇవన్నీ గుర్తించి అన్ని రకాల అప్పులు రద్దు చేయకుంటే పరిస్థితి మరో విధంగా ఉండే అవకాశం ఉంది.
 భూముల్లో మేటలు  
 జిల్లాలోని మేజర్, మైనర్ ఇరిగేషన్ చెరువులు, కాలువలు, వంశధార, నాగావళి కాలువలకు 821 చోట్ల గండ్లు పడ్డాయి. ఇంకా పలు రోడ్లు కొట్టుకుపోయాయి. వీటిని సరిచేయడానికి చాలా సమయం పడుతుంది.
   వేలాది ఎకరాల్లో మట్టి మేటలు వేసింది. దాన్ని తొలగించుకునేందుకు రైతులకు కనీసం మూడు నెలలు పట్టే అవకాశం ఉంది. ఇటువంటి వాస్తవిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని రైతులకు పరిహారం ఇవ్వాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement