
బాధితుడు శివ, పిల్లలు హోంగార్డును తీసుకువెళ్తున్న ఏఎస్‌ఐ
విశాఖపట్నం, నర్సీపట్నం: మద్యం మత్తులో హోంగార్డు ఓ వ్యక్తిపై చేయిచేసుకున్నాడు. అకారణంగా చేయి చేసుకోవడాన్ని చూసిన స్థానికులు ఆగ్రహంతో హోంగార్డును నిలదీశారు. జనసమర్ధంగా ఉండే ఆర్టీసీ కూడలిలో ఈ సంఘటన చోటు చేసుకోవడంతో సుమారు గంట పాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నక్కపల్లి మండలం డొంకాడ గ్రామానికి చెందిన సకిరెడ్డి శివ, ఇద్దరు పిల్లలతో కలిసి ద్విచక్రవాహనంపై శుభకార్యం నిమిత్తం గొలుగొండ మండలం జోగంపేట వెళ్లి తిరిగి వస్తుండగా పట్టణంలోని ఆర్టీసీ కూడలి వద్దకు వచ్చేసరికి విధి నిర్వహణలో ఉన్న హోంగార్డు వంతల బేష్ వారిని ఆపేందుకు ప్రయత్నించాడు. మద్యం మత్తులో ఉండడంతో కిందపడిపోయాడు వెంటనే లేచి ద్విచక్రవాహనంపై ఉన్న శివపై చేయి చేసుకున్నాడు.
అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ త్రిబుల్స్ డ్రైవింగ్ చేస్తున్నారని శివపై ఆన్‌లైన్లో కేసు నమోదు చేశాడు. ఇంతటితో ఆగకుండా హోంగార్డు ... శివను విచక్షణరహితంగా కొట్టాడు. హోంగార్డును తీరును చూసి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతనిని నిలదీశారు. విధి నిర్వహణలో మద్యం సేవించడమే కాకుండా అకారణంగా చేయి చేసుకోవడం ఏమిటిని నిలదీశారు. ట్రాఫిక్, మొబైల్ పోలీసులు సర్టిచెప్పే ప్రయత్నం చేశారు. హోంగార్డుపై చర్యలు తీసుకోవాలని బాధితులకు అండగా నిలిచిన స్థానికులు, వాహనదారులు డిమాండ్ చేశారు. దీంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. కూడలికి అటు ఇటు వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విషయంలో తెలుసుకున్న సీఐ సింహాద్రినాయుడు సంఘటన స్థలానికి చేరుకుని స్థానికులకు సర్దిచెప్పి, వివాదానికి కారణమైన హోంగార్డును పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లారు. జరిగిన సంఘటనపై బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకున్నారు.
హోంగార్డు సస్పెన్షన్‌కు సిఫారసు
విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించి సకిరెడ్డి శివపై చేయి చేసుకున్న హోంగార్డును సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీకి నివేదించినట్టు ఏఎస్పీ ఆఫీజ్ హారీఫ్ తెలిపారు. సబ్ డివిజన్ పరిధిలోని ఎస్‌ఐ, సిబ్బంది ఇటువంటి సంఘటనలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. తమ సిబ్బంది ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరించి ఇబ్బంది కలిగించినట్టయితే నేరుగా తనకు ఫిర్యాదు చేయవచ్చన్నారు.