వీరఘట్టం మండలంలో శనివారం సాయంత్రం నుంచి రాత్రి 8 గంటల వరకు భారీ వర్షం కురిసింది. అత్యధికంగా 7 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. వీరఘట్టం, నడిమికెల్ల, కంబర, విక్రమపురం, నడుకూరు, చిట్టిపుడివలస, చిదిమి, పాలమెట్ట, కొట్టుగుమ్మడ పంచాయతీల్లో కుండపోత వర్షం కురిసింది.
వీరఘట్టంలో భారీ వర్షం
Sep 16 2013 4:55 AM | Updated on Sep 2 2018 4:46 PM
వీరఘట్టం, న్యూస్‌లైన్: వీరఘట్టం మండలంలో శనివారం సాయంత్రం నుంచి రాత్రి 8 గంటల వరకు భారీ వర్షం కురిసింది. అత్యధికంగా 7 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. వీరఘట్టం, నడిమికెల్ల, కంబర, విక్రమపురం, నడుకూరు, చిట్టిపుడివలస, చిదిమి, పాలమెట్ట, కొట్టుగుమ్మడ పంచాయతీల్లో కుండపోత వర్షం కురిసింది. కంబర గ్రామంలో తంపర గెడ్డ పొంగిపొర్లుతోంది. ఈ గెడ్డకు పోటెత్తడంతో సుమారు 50 ఎకరాల వరి నీట మునిగింది.
వీరఘట్టం స్వామి థియేటర్ వెనుక ఉన్న పోతులగెడ్డ ఉప్పొంగడంతో ఈ ప్రాంతంలో సుమారు 80 ఎకరాలు వరిపంట జలమయమైంది. కిమ్మి రహదారిలో ఉన్న పిల్లకాలువలు పొంగడంతో ఇక్కడి 40 ఎకరాలు నీట మునిగాయి. మండల వ్యాప్తంగా వాగులు, వంకలు, గెడ్డలకు జలకళ ఉట్టిపడింది. ఒట్టిగెడ్డ, వెంకమ్మచెరువు, రాజచెరువు, నాయుడుకోనేరు, విశాగ్రామి చెరువులు పూర్తిగా నీటితో నిండిపోవడంతో జలకళ ఏర్పడింది. ఈ సమీపంలో ఉన్న సుమారు 30 ఎకరాల పంట పొలాలన్ని నీటమునిగాయి. భారీ వర్షం కారణండా జెడ్పీ హైస్కూల్ మైదానం వర్షపునీటితో నిండిపోయింది.
లక్ష విలువైన చేపలు గల్లంతు
భారీ వర్షానికి మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వేసవిని తలపించే విధంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లబడి శనివారం సాయంత్రం రికార్డు స్థాయిలో కురిసిన భారీ వర్షానికి వెంకమ్మ చెరువుకు వర్షపు నీరు చేరింది. దిగువ ప్రాంతంలోని చప్టా గుండా నీరు ప్రవహించడంతో మత్స్యకారులు చేపల కోసం ఏర్పాటు చేసిన వల పాడైంది. దీంతో చెరువులో ఉన్న విలువైన మత్స్య సంపద కొట్టుకుపోయిందని మత్స్యకారులు చెప్పారు. వ్యాపారుల వద్ద అప్పులు చేసి చెరువులో చేప పిల్లలు పెంచుతున్నామని, అక్టోబరులో దసరాకు వేట చేసేందుకు సిద్ధం చేస్తుండగా భారీ వర్షం కారణంగా రూ.లక్ష విలువ కలిగిన చేపలు గల్లంతవడంతో తీవ్రంగా నష్టపోయామని మోసూరు జగన్నాథం, మోసూరు చిన్నారావు తదితరులు వాపోయారు. అధికారులు నష్టాన్ని అంచనా వేసి ఆదుకోవాలని వారు కోరారు.
Advertisement
Advertisement