తుంగ.. ఉప్పొంగ 

Heavy Inflow In Tungabhadra River Project Anantapur - Sakshi

రెండుసార్లు నిండిన తుంగభద్ర జలాశయం

నేటికీ 16,987 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో 

ఈసారి హెచ్చెల్సీకి రికార్డుస్థాయిలో నీళ్లు

ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే ఆయకట్టు పండగే 

సాక్షి, అనంతపురం, కర్నూలు : తుంగభద్ర ఉప్పొంగుతోంది. ‘అనంత’కు సాగునీటి బెంగ తీరనుంది. తంగభద్ర ఏటా ఒకసారి నిండడమే గగనం. అలాంటిది ఈ ఏడాది రెండుసార్లు వరద నీటితో పొంగి    పొర్లింది. ఫలితంగా రెండు నెలలుగా తుంగభద్ర జలాశయం నుంచి నీరు దిగువకు వెళ్తోంది. తుంగా జలాలు హెచ్చెల్సీ ద్వారా వడివడిగా జిల్లాకు చేరుతున్నాయి. ఈ తరుణంలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే సాగునీటి సలహా మండలి సమావేశంలో (ఐఏబీ) తీసుకున్న నిర్ణయం మేరకు అన్ని ప్రాంతాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు అవకాశం కనిపిస్తోంది.

వరుణుడు కరుణించడంతో ‘అనంత’లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఇక జిల్లాకు వరప్రదాయినిగా ఉన్న తుంగభద్ర, శ్రీశైలం జలాశయాలు కూడా నిండుకుండను తలపిస్తున్నాయి. రెండింటికీ ఇంకా ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. తుంగభద్ర జలాశయంలో 100.855 టీఎంసీలు నిల్వ ఉండగా.. ప్రస్తుతం 17,275 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. దీంతో 16,987 క్యూసెక్కుల నీటిని ఔట్‌ఫ్లో రూపంలో దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం జలాశయంలో కూడా 215.33 టీఎంసీల నీరు నిల్వ ఉండగా.. 1.70 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతోంది.  1.89 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలేస్తున్నారు. దీంతో ఈ సారి జిల్లా ఆయకట్టుకు ఎలాంటి ఇబ్బంది కలిగే పరిస్థితి లేదు.  

ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తేనే... 
ఈసారి సాగునీటికి ఢోకా లేకపోయినా.. ప్రణాళికలు లేకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కాలువలపై పటిష్టమైన పర్యవేక్షణ లేకపోవడంతో తరుచూ గండ్లు పడుతుండగా.. నీటి ప్రవాహానికి అంతరాయం కలుగుతోంది. దీంతో ప్రాధాన్యత ప్రకారం సాగునీరు దేనికి ముందు ఇవ్వాలనే విషయమై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. సాగునీటి సలహా మండలి సమావేశంలో సెప్టెంబర్‌ 1 నుంచి హెచ్‌ఎల్‌ఎంసీ, గుంతకల్లు బ్రాంచ్‌కెనాల్‌కు, అక్టోబర్‌ 1 నుంచి మిడ్‌పెన్నార్‌ సౌత్, నార్త్‌ కెనాల్‌కు, అక్టోబర్‌ 15 నుంచి తాడిపత్రి బ్రాంచ్‌కెనాల్‌కు సాగునీరు ఇవ్వాలి. ఇవేకాకుండా నవంబర్‌ 2 నుంచి చాగళ్లుకు విడుదల చేసి నీటితో నింపాలి. డిసెంబర్‌ 1 నుంచి పీఏబీఆర్‌ కుడికాలువ కింద 49 చెరువులకు విడుదల చేయాలి. తర్వాత ఈ ఏడాది ఎట్టి పరిస్థితిలోనూ మైలవరం కోటా కావాలని వైఎస్సార్‌ కడప జిల్లా ప్రజాప్రతినిధులు పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో అధికారుల ప్రణాళికలు చాలా కీలకం కానున్నాయి.  

నీటిని దిగువకు తీసుకెళ్లడంలో విఫలం 
హంద్రీనీవా, హెచ్చెల్సీలకు జలాశయాల నుంచి చెప్పుకోదగ్గ స్థాయిలో నీళ్లు వస్తున్నాయి. వరదనీరు దిగువకు వెళుతుండడంతో ఎక్కడా అభ్యంతరాలు కూడా లేవు. అయితే కాలువలు పటిష్టంగా లేకపోవడంతో నీరు తీసుకోవడానికి అధికారులుకే వెనుకంజ వేస్తున్నారు. తుంగభద్ర జలాశయం నుంచి జిల్లా సరిహద్దులోకి వస్తున్న నీరు 1,628 క్యూసెక్కులుగా నమోదవుతోంది. అయితే పీఏబీఆర్‌కు 175 క్యూసెక్కులు, ఎంపీఆర్‌కు 532 క్యూసెక్కుల నీరు మాత్రమే వచ్చి చేరుతోంది. ఫలితంగా రెండు జలాశయాల్లో కలిపి రెండున్నర టీఎంసీల నీళ్లు లేవు. 1000 క్యూసెక్కుల నీరు తీసుకోవాలని ఎంతగా ప్రయత్నిస్తున్నప్పటికీ హెచ్చెల్సీ అధికారులకు సాధ్యపడడం లేదు. మూడు రోజుల నుంచి జిల్లాలో వర్షాలు కురుస్తున్నా.. ఎగువన నీటి వాడకం తగ్గకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో అధికారుల వైఫల్యం కూడా స్పష్టంగా కనిపిస్తోంది.  

అనుకున్న స్థాయిలో చేరని నీరు 
తొలుత జీడిపల్లి జలాశయం నుంచి కృష్ణా జలాలను పీఏబీఆర్‌కు 5 టీఎంసీలు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. అయితే చెరువులకు నీటిని నింపడానికి ప్రాధాన్యత ఇస్తుండడంతో చివర్లో వదలాలనే భావనలో ఉన్నారు. దీంతో పీఏబీఆర్, ఎంపీఆర్‌ జలాశయాలకు అనుకున్న స్థాయిలో నీళ్లు చేరలేదు. ఇప్పటికైన హెచ్చెల్సీ అధికారులు దృష్టి సారిస్తే మిడ్‌పెన్నార్‌ సౌత్, నార్త్‌ కెనాళ్లు, తాడిపత్రి బ్రాంచ్‌ కెనాల్‌కు అనుకున్న ప్రకారం సాగునీటిని విడుదల చేయవచ్చనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

చదవండి : కరువు నేలకు జలాభిషేకం    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top