‘చేనేత’ భూమి రిజిస్ట్రేషన్ రద్దు | handloom' land the registration to cancel | Sakshi
Sakshi News home page

‘చేనేత’ భూమి రిజిస్ట్రేషన్ రద్దు

Feb 17 2016 12:19 AM | Updated on Aug 10 2018 9:42 PM

‘చేనేత’ భూమి   రిజిస్ట్రేషన్ రద్దు - Sakshi

‘చేనేత’ భూమి రిజిస్ట్రేషన్ రద్దు

టీడీపీ నేతలు ముఠాగా ఏర్పడి ఏలూరులోని చేనేత సహకార సంఘానికి చెందిన సుమారు 4వేల గజాల స్థలాన్ని ......

పాలకవర్గం అమ్మేసిన స్థలాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు
ఇది ‘సాక్షి’ క్రెడిట్ : ఏడీ ధనుంజయరావు

   
 సాక్షి ప్రతినిధి, ఏలూరు :టీడీపీ నేతలు ముఠాగా ఏర్పడి ఏలూరులోని చేనేత సహకార సంఘానికి చెందిన సుమారు 4వేల గజాల స్థలాన్ని అతితక్కువ ధరకు కొనుగోలు చేసిన వ్యవహారం బెడిసికొట్టింది. ఆ స్థలం రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తూ అధికారులు మంగళవారం నిర్ణయం తీసుకున్నారు. ఈ భూమికి సంబంధించి జనవరిలో తాము చేసిన రిజిస్ట్రేషన్ చెల్లదంటూ ఇచ్చిన ఉత్తర్వుల కాపీని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు మంగళవారం చేనేత జౌళి శాఖ ఏడీ బి.ధనుంజయరావుకు పంపారు. పూర్వాపరాల్లోకి వెళితే.. ఏలూరు వీవర్స్ కాలనీలో సుమారు 4వేల గజాల చేనేత సహకార సొసైటీ స్థలాన్ని భాగాలుగా చేసి తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రెడ్డి అప్పలనాయుడు, పార్టీ నగర శాఖ అధికార ప్రతినిధి పూజారి నిరంజన్‌కుమార్‌తోపాటు అదే పార్టీకి చెందిన  రెడ్డి వెంకటరమణ, నడిపూడి ఈశ్వరరావు, లంకా తిరుపతి, ఆరంగి మురళీకృష్ణ, రాజనాల రామచంద్రరావు, గద్దె రుష్యేంద్ర నాగవర దుర్గాప్రసాద్ కొనుగోలు చేశారు. గజం రూ.8వేల చొప్పున మొత్తం స్థలాన్ని రూ.3.06 కోట్లకు కొనుగోలు చేసినట్టు రిజిస్ట్రేషన్ రికార్డుల్లో పేర్కొన్నారు. ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం రూ.8 కోట్లకు పైగా విలువ చేసే ఆ స్థలాన్ని అతి తక్కువ ధరకు, నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేసిన వ్యవహారాన్ని ‘భూమంత్రకాళి’ శీర్షికన ఈనెల 10న ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. రంగంలోకి దిగిన చేనేత, జౌళిశాఖ అధికారులు వెంటనే జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్‌కు సమాచారం అందించారు. సోమవారం జరిగిన ‘మీ కోసం’ కార్యక్రమంలో ఈ విషయమై కలెక్టర్ సీరియస్ అయ్యారు. వెంటనే స్థలాన్ని వెనక్కి తీసుకునేలా చర్యలు తీసుకోవాలని జిల్లా రిజిస్ట్రార్‌ను ఆదేశించారు. ఈ నేపథ్యంలో మంగళవారం రిజిస్ట్రేషన్ అధికారులు ఆ స్థల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రద్దు దస్తావేజులను చేనేత జౌళి శాఖ అధికారులకు పంపారు.

 
ఇది ‘సాక్షి’ క్రెడిట్
చేనేత, ఔళి శాఖ అనుమతి లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా జరిగిన స్థలాల రిజిస్ట్రేషన్లు చట్టవ్యతిరేకమని చేనేత, జౌళి శాఖ జిల్లా ఏడీ బి.ధనుంజరావు అన్నారు. మంగళవారం సాయంత్రం  రిజిస్ట్రేషన్ అధికారులు రద్దు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వుల కాపీలతో ఆయన వీవర్స్ కాలనీలోని స్థలం వద్దకు చేరుకుని మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ సహకార సంఘాల చట్టం 1964 సెక్షన్-9ఏ ప్రకారం ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ‘సాక్షి’ వల్లే ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చిందని, ‘సాక్షి’ వరుస కథనాలతోనే తాము నైతికంగా పోరాటం చేయగలిగామని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఈ స్థల రిజిస్ట్రేషన్ రద్దు క్రెడిట్ పూర్తిగా ‘సాక్షి’కే చెందుతుందని ఆయన వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement