పింఛన్‌ వేదన..!

Handicapped People Waiting For Pensions - Sakshi

ఎదురుచూస్తున్నా మంజూరుకాని పింఛన్‌

ఆవేదనలో 60 వేల మంది లబ్ధిదారులు

జిల్లాలో పాత పింఛన్లు: 2,84,044 లక్షలు

కొత్తగా మంజూరైనవి: 18,850

చిత్రంలోని దివ్యాంగుని పేరు సిరిపురపు సన్యాసిరావు. విజయనగరం మున్సిపాలిటీలోని ఎనిమిదో వార్డులో నివసిస్తున్నాడు. గతంలో కలాసీగా పనిచేసేవాడు. కొన్నేళ్ల కిందట జరిగి ప్రమాదంలో కాళ్లు దెబ్బతిన్నాయి. వంకరగా మారాయి. 2015లో 67 శాతం వైకల్యం ఉన్న వైద్యులు సైతం ధ్రువీకరణ పత్రం ఇచ్చారు. అప్పటి నుంచి పింఛన్‌ కోసం దరఖాస్తు చేస్తూనే ఉన్నా మంజూరు కాలేదు. మున్సిపల్‌ అధికారులు, పాలకులకు గోడు వినిపించినా కనికరించలేదంటూ వాపోతున్నాడు.  

విజయనగరం, బొబ్బిలి: జిల్లాలో పింఛన్ల మంజూరు ప్రహసనంగా మారింది. లబ్ధిదారులకు ఎదురుచూపే మిగులుతోంది. మొన్నటివరకు పనిచేసిన జన్మభూమి కమిటీలు, టీడీపీ నాయకులను ప్రసన్నం చేసుకునేవారికి అర్హతలను పక్కనపెట్టి పింఛన్లు మంజూరు చేశారు. అర్హులైన 60 వేల మంది పింఛన్ల దరఖాస్తులు పెండింగ్‌లో పెట్టేశారు. దీంతో వారంతా ఆవేదన చెందుతున్నారు. కనిపించేవారందరికీ తమ గోడువినిపిస్తున్నారు. పేదలకు అందజేయాల్సిన పింఛన్లను టీడీపీ నాయకులు సంపన్నులకే కట్టబెడుతున్నారంటూ గగ్గోలు పెడుతున్నారు. మాకు దిక్కెవరంటూ గ్రీవెన్స్‌సెల్‌లలో అధికారుల వద్ద మొత్తుకుంటున్నారు. ప్రస్తుతం జిల్లాలో పింఛన్ల సంఖ్య 3 లక్షలు దాటినా ఇందులో అనర్హులు అధికమంది ఉన్నట్టు సమాచారం.

ఆధార్‌ కార్డుల్లో వయస్సు తగ్గించి చివరి విడతలో ఓట్ల కోసం పింఛన్లు మంజూరు చేశారన్న వాదన వినిపిస్తోంది. అందువల్లే అర్హులకు పింఛన్లు మంజూరుకాలేదని పలువురు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 34 మండలాలు, ఐదు మున్సిపాలిటీల్లో పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారు దాదాపు 60వేల మంది వరకూ ఉన్నారంటే అధికార ప్రభుత్వం ఎంత మేరకు సుపరిపాలనను అందిస్తుందో అర్ధం చేసుకోవచ్చు. జిల్లాలోని 920 పంచాయతీల్లో మేజర్‌ పంచాయితీలు, పెద్ద గ్రామాలు, చిన్న గ్రామాలు ఉన్నాయి. వీటిలో సగటున ఒక్కో గ్రామానికి 50 మంది చొప్పున అర్హులకు పింఛన్లు అందడం లేదని గణాంకాలు చెబుతున్నారు. కేవలం పంచాయతీల్లోనే 46 వేల మంది అర్హులు పింఛన్లకు ఎదురు చూస్తుండగా మున్సిపాలిటీల్లో మరో 14వేల మందిది అదే పరిస్థితి.

‘కలెక్టరేట్‌లో ఈ నెల 4వ తేదీ సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్‌లో 390 దరఖాస్తులు వచ్చాయి. అందులో పింఛన్లు మంజూరు చేయాలంటూ విన్నవించిన దరఖాస్తుల సంఖ్య 140. వీటిని చూసి అధికారులే ఆశ్చర్యపోయారు. అర్హతలు ఉన్నా పింఛన్లు మంజూరుకాకపోవడంపై ఆలోచనలోపడ్డారు.’

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top