టీచర్ల సర్దుబాటుకు గ్రీన్‌సిగ్నల్‌

Green signal for teachers adjustment - Sakshi

ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్లు పెరగడంతో సర్కారు నిర్ణయం

విధివిధానాలు విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ

పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశం

ఈనెల 22కల్లా ప్రక్రియ మొత్తం పూర్తికావాలి

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు పెరిగిన నేపథ్యంలో ఆయా స్కూళ్లకు తగినట్లుగా టీచర్లను సర్దుబాటు చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. ఇందుకు అవసరమైన విధివిధానాలను ఆ శాఖ కమిషనర్‌ అధికారులకు పంపించారు. ఎస్‌జీటీల్లో ఆయా సబ్జెక్టులు బోధించే వారుంటే అలాంటి వారిని గుర్తించి అవసరమైన పాఠశాలలకు డిప్యుటేషన్‌పై వెళ్లి పనిచేయటానికి వారి ఆసక్తిని తెలుసుకోవాలన్నారు. ఈ సర్దుబాటు కూడా పారదర్శకంగా చేపట్టాలని సూచించారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని ఈ నెల 22కల్లా పూర్తిచేయాలని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. ఏ పాఠశాలలో ఎంతమంది పిల్లలున్నారు.. అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులు, మిగులు టీచర్ల వివరాలను నోటీసు బోర్డులో ప్రదర్శించాలని స్పష్టంచేశారు.

విద్యాశాఖ విడుదల చేసిన షెడ్యూల్‌..
- 14న ఏ పాఠశాలలో టీచర్ల అవసరం ఉందో గుర్తించి ఆ పాఠశాలల్లో ఉన్న పిల్లల సంఖ్య.. అవసరమైన టీచర్ల వివరాలను ప్రదర్శించాలి.
- 16, 17 తేదీల్లో పని సర్దుబాటుపై ఆయా పాఠశాలలకు వెళ్లే ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్‌ నిర్వహించాలి.
- 19న పని సర్దుబాటు కింద వెళ్లే టీచర్ల పూర్తి వివరాలతో కూడిన నివేదికను రూపొందించాలి.
- 22న మండల విద్యాశాఖ, డివిజనల్‌ విద్యాశాఖ అధికారులు మిగులు ఉపాధ్యాయులను ఏయే పాఠశాలలకు సర్దుబాటు చేయనున్నారో ప్రతిపాదనల రూపంలో జిల్లా విద్యాశాఖకు అందజేయాలి.
- 2019 ఆగస్టు 1 నాటి ‘యూడైస్‌’ గణాంకాలను పరిగణనలోకి తీసుకోవాలి.
- ఎస్జీటీలు, సబ్జెక్టు టీచర్లు ఏ మేరకు అవసరమో గుర్తించాలి.
- విద్యార్థులు, టీచర్లు ఎంతమంది ఉన్నారు? మిగులు టీచర్లు ఎంతమంది ఉన్నారో గుర్తించాలి.
- విద్యార్థుల సంఖ్య ఆధారంగా టీచర్లు అవసరమైన స్కూళ్లను అవరోహణ క్రమంలో ఎంపిక చేయాలి.
- మిగులు టీచర్లను అవసరమైన స్కూళ్లకు కేటాయించాలి.
- ఎన్‌రోల్‌మెంటుకు అనుగుణంగా విద్యార్థులు ఎక్కువగా ఉన్న స్కూళ్ల నుంచి టీచర్లను కదపరాదు.
- స్కూల్‌ అసిస్టెంట్లు అందుబాటులో లేనిచోట సబ్జెక్టు చెప్పగలిగే ఎస్జీటీలను నియమించాలి.
- సబ్జెక్టు టీచర్లు అవసరమైన చోట హైస్కూళ్లకు ప్రాధాన్యతనిస్తూ స్కూల్‌ అసిస్టెంట్లను, ప్రాథమికోన్నత పాఠశాలలకు సబ్జెక్టు చెప్పగలిగే ఎస్జీటీలను నియమించాలి.
- జూనియర్‌ టీచర్లను మిగులుగా గుర్తించి వారిని సర్దుబాటు చేయాలి. సీనియర్లు సుముఖత చూపిస్తే వారిని కూడా ఆయా స్కూళ్లకు సర్దుబాటు కింద పంపించొచ్చు.
- కౌన్సెలింగ్‌ విధానాన్ని అనుసరించి సీనియార్టీ ఆధారంగా సర్దుబాటు చేయాలి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top