పనిలో బాల్యం | government try to Vindication of child labour system | Sakshi
Sakshi News home page

పనిలో బాల్యం

Jan 28 2014 4:19 AM | Updated on Sep 2 2017 3:04 AM

14 ఏళ్లలోపు వయస్సున్న పిల్లలను ఏరకమైన పనిలో పెట్టకూడదు. వారు ఖచ్చితంగా బడిలో ఉండాలని కేంద్రం సమగ్ర విద్యా పథకాన్ని ప్రకటించింది.

సాక్షి, కడప:  14 ఏళ్లలోపు వయస్సున్న పిల్లలను ఏరకమైన పనిలో పెట్టకూడదు. వారు ఖచ్చితంగా బడిలో ఉండాలని  కేంద్రం సమగ్ర విద్యా పథకాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా బాల కార్మికులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం విస్తృత కార్యక్రమాలను చేపట్టింది. పలు కీలక శాఖల సమన్వయంతో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రయత్నిస్తోంది. ఇందులో  కార్మిక, రాజీవ్ విద్యామిషన్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇంత కసరత్తు జరుగుతున్నా కొందరు అధికారుల నిర్లక్ష్యంతో అనేక  చోట్ల బాలకార్మికులు దర్శనమిస్తూనే ఉన్నారు.

 టోల్ ఫ్రీ నెంబర్‌కు సమాచారం లేదు
 బాలకార్మికులు ఎక్కడ కనపడినా 1098కు వెంటనే తెలియజేయాలని ప్రభుత్వం సూచించింది. ఈ నెంబరుకు ఫిర్యాదు చేస్తే వెంటనే కార్మిక,రాజీవ్ విద్యామిషన్, సాంఘిక సంక్షేమ శాఖ,రెవిన్యూ, పోలీసు శాఖలు బాలకార్మికులు ఉన్న ప్రదేశానికి చేరుకుని వారిని విముక్తి చేయాలి. వారితో పని చేయించుకుంటున్న యాజమాన్యంపై కేసు నమోదు చేయాలి. వెంటనే వారికి పునరావాసం కల్పించాలి.

రాజీవ్ విద్యామిషన్ ఆధ్వర్యంలో పిల్లలను స్కూల్‌లో చేర్పించాలి. సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్ వసతి కల్పించాలి. చిన్న పిల్లలైతే ఐసీడీఎస్ పునరావసం కల్పించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ప్రణాళిక పక్కగా ఉన్నా  క్షేత్ర స్థాయిలో ఆ దిశగా కసరత్తు జరగడంలేదు.  1098కు దాదాపుగా ఎటువంటి సమాచారం ందడం లేదని తెలుస్తోంది.

 నామమాత్రపు దాడులు :
 కార్మిక శాఖ అధికారులు ఆకస్మిక దాడులు జరిపి బాలకార్మికులను గుర్తించి వెంటనే పునరావాసం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలి.  జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది కేవలం 94 కేసులు మాత్రమే నమోదు కావడం గమనార్హం. చెత్త పేపర్లు ఏరుకుంటూ అనేక మంది పిల్లలు నిత్యం కనిపిస్తునే ఉంటారు. హోటళ్లు, మెకానిక్ షాపులు, భవన నిర్మాణాలలో అనేక మంది బాలకార్మికులు పనిచేస్తున్నా రాజీవ్ విద్యామిషన్, కార్మిక శాఖ అధికారులకు కనపడకపోవడం గమనార్హం.

 మూతపడిన బాలకార్మిక పాఠశాలలు
 బాలకార్మికులకు చదువు సంధ్యలు నేర్పించడానికి బాలకార్మిక పాఠశాలలు నడిచేవి. స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో వీటిని నడుపుతుండేవారు. గత ఏడాది జనవరిలో జిల్లాలో 30కి పైగా బాలకార్మిక పాఠశాలలకు అనుమతి ఇచ్చారు. అయితే బడ్జెట్ లేని కారణంగా గత జులైలో వీటిని మూసేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement