సిద్ధమవుతున్న సచివాలయాలు

Government Preparing Village Secretariat Buildings In Nellore - Sakshi

ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు

సాక్షి, కావలి (నెల్లూరు): నియోజకవర్గంలోని నిరుద్యోగులు ఈ నెల 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు గ్రామ/ వార్డు సచివాలయాల ఉద్యోగాల కోసం రాసిన పరీక్షా ఫలితాలను గురువారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విడుదల చేశారు. నియోజకవర్గంలోని కావలిటౌన్, కావలిరూరల్, బోగోలు, అల్లూరు, దగదర్తి మండలాల్లో 84 సచివాలయాలు మంజూరయ్యాయి. కాగా మండలాల్లోని గ్రామ సచివాలయాల్లో 14 రకాల ఉద్యోగులు, కావలి పట్టణంలోని వార్డు సచివాలయాల్లో 10 రకాల ఉద్యోగులు సచివాలయాల్లో నియమించనున్నారు. గ్రామ సచివాలయాల్లో 882 ఉద్యోగాలు, పట్టణంలోని వార్డు సచివాలయాల్లో 270 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. నియోజకవర్గంలోని సచివాలయాల్లో 1,152 మంది నిరుద్యోగులకు పరీక్షలలో సాధించిన ప్రతిభ ఆధారంగా ఉద్యోగులుగా నియమితులు కానున్నారు.  కాగా అందుబాటులో ఉన్న ప్రభుత్వ భవనాలలో సచివాలయాలను ఏర్పాటే చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. వీటిలో కొన్ని మరమ్మతులు, రంగులు, విద్యుద్దీకరణ వంటి మరమ్మతులు చేయాల్సి ఉంది. ప్రభుత్వ భవనాలు అందుబాటులో లేని చోట ప్రైవేటు భవనాలను అద్దెకు తీసుకోనున్నారు. 

పట్టణంలో ఏర్పాటు కానున్న 27వార్డు సచివాలయాలు
పట్టణంలో 27 వార్డు సచివాలయాలు ఆవిర్భవించనున్నాయి. కాగా ఏడు సచివాలయాలకు ప్రభుత్వ భవనాలు అందుబాటులో ఉండగా, మిగిలిన 20 సచివాలయాలకు భవనాలను అద్దెకు తీసుకోనున్నారు. 1వ వార్డు పరిధిలో ఉన్న మద్దురుపాడులో పంచాయతీ ఆఫీస్‌ను సచివాలయ భవనంగా తీర్చిదిద్దనున్నారు. 2వ వార్డు పరిధిలోని గాయత్రీనగర్‌లో ప్రైవేటు భవనంలో సచివాలయాన్ని ఏర్పాటు చేస్తారు. 3,4 వార్డులకు కలిసి ఇస్లాంపేటలో అద్దె భవనంలో ఏర్పాటు చేయనున్నారు. 5వ వార్డు సచివాలయాన్ని ప్రైవేటు భవనంలో పాతూరు కృష్ణుడి గుడి ఎదురుగా ఏర్పాటు చేస్తారు. వెంగాయగారిపాళెంలో 6వ వార్డుకు చెందిన సచివాలయాన్ని అద్దె భవనంలో ప్రారంభింస్తారు. 7,9వ వార్డులకు సంబంధించిన సచివాలయాన్ని రాజీవ్‌గనర్‌లో ఉన్న ప్రభుత్వ సీఆర్పీ భవనంలో ప్రారంభింస్తారు.

మేదరు బజారులో 8వ వార్డు సచివాలయాన్ని ప్రైవేటు భవనంలో, హరిజనవాడలో 10వ వార్డు , అంబేడ్కర్‌ నగర్‌లో 11వ వార్డు, అరుంధతీయవాడలో 12వ వార్డు సచివాలయ భవనాలను అద్దె ప్రాతిపదికపై తీసుకొని ప్రారంభించడానికి చర్యలు తీసుకొంటున్నారు. రామ్మూర్తిపేటలోని తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట 13వ వార్డు సచివాలయాన్ని ప్రైవేటు భవనంలో ప్రారంభిస్తారు. ముసునూరులోని పంచాయతీ కార్యాలయంలో 14,15వ వార్డులకు చెందిన సచివాలయాలకు శ్రీకారం చుట్టనున్నారు.బాలకృష్ణారెడ్డి నగర్‌ 16వ వార్డుకు చెందిన సచివాలయాన్ని ప్రైవేటు భవనంలో, బుడంగుంట పంచాయతీ కార్యాలయంలో 17వ వార్డు, వెంగళరావునగర్‌లోని పొట్టి శ్రీరాములు బిల్డింగ్‌ స్కూలో 18, 23వ వార్డులకు చెందిన సచివాలయాలను ఏర్పాటు చేస్తారు.

అలాగే 19,22వ వార్డులకు చెందిన సచివాలయాన్ని ఇందిరానగర్‌ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ భవనంలో, కచ్చేరిమిట్టలోని ప్రైవేటు భవనంలో 20,27వ వార్డుల సచివాలయం, శాంతినగర్‌లో 21, 24వ వార్డుల సచివాలయాన్ని ప్రైవేటు భవనంలో ప్రారంభిస్తారు. 25,26వ వార్డులకు చెందిన సచివాలయాన్ని వెంగళరావునగర్‌ వంద అడుగుల రోడ్డులో, 28,30వ వార్డుల సచివాలయాన్ని రాజావీధిలో, 29,31వ వార్డుల సచివాలయాన్ని జనతాపేట నార్త్‌లో, 32,33 వార్డుల సచివాలయాన్ని వీఆర్‌సీ ట్రాన్స్‌పోర్ట్‌ భవనం, 34,37 వార్డుల సచివాలయాన్ని సంకులవారి తోటలో, 35,36వ వార్డుల సచివాలయాన్ని వైకుంఠపురం మొదటి లైన్‌లో, 38,39వ వార్డుల సచివాలయాన్ని నార్త్‌ యానాదిపాళెం చేవూరివారి తోటలో, 40వ వార్డు సచివాలయాన్ని జెండాచెట్టు వీధిలో ప్రైవేటు భవనాలలో ఏర్పాటు చేయనున్నారు.

దగదర్తి మండలానికి 12 సచివాలయాలు..
దగదర్తి మండలంలో 12 సచివాలయాలు ఏర్పాటు అవుతున్నాయి. కె.కె.గుంట, దుండిగం, తురిమెర్ల, కాట్రాయపాడు, మనుబోలుపాడు తదితర వాటిలో గ్రామ పంచాయతీ భవనాలు లేనందున, అద్దె ప్రాతిపదికపై సచివాలయాల కోసం భవనాలు తీసుకోనున్నారు. అల్లూరు మండలంలో 12 సచివాలయాలలో సింగపేట, నార్త్‌ మోపూరులలో మాత్రం ప్రభుత్వ భవనాలు అందుబాటులో లేవని అధికారులు నివేదికలు తయారు చేశారు. అలాగే మండల కేంద్రమైన అల్లూరులో నాలుగు సచివాలయాలు ఏర్పాటు చేస్తారు. బోగోలు మండలంలో 16 సచివాలయాలలో ఒక్క విశ్వనాథరావుపేట పంచాయతీ రామస్వామిపాళెంలో మాత్రం అద్దె భవనం తీసుకోవాల్సి వస్తుంది.  అన్నీ చోట్ల పంచాయతీ, సామాజిక వనరుల భవనాలు అందుబాటులో ఉన్నాయి. కావలి మండలానికి 17 సచివాలయాలు మంజూరు కాగా, వాటిలో ఆముదాలదిన్నె, చలంచర్ల, చెంచుగానిపాలెం,చెన్నాయపాలెం, కొత్పల్లి, సిరిపురం,తుమ్మలపెంట–2 గ్రామాలలో సచివాలయాలకు భవనాలు లేవు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top