బాబు సర్కార్ పెట్రోల్, డీజల్ ధరలు పెంచి వినియోగదారులపై పెనుభారం మోపింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విలువ ఆధారిత పన్ను(వ్యాట్) మోత మోగించింది.
నెల్లూరు(రెవెన్యూ): బాబు సర్కార్ పెట్రోల్, డీజల్ ధరలు పెంచి వినియోగదారులపై పెనుభారం మోపింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విలువ ఆధారిత పన్ను(వ్యాట్) మోత మోగించింది. పెట్రోల్‌పై రూ 4.04, డీజల్‌పై రూ 4.01 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జిల్లా వినియోగదారులపై నెలకు రూ.16 కోట్ల భారం పడుతుంది. అలాగే సంవత్సరానికి రూ.192 కోట్ల భారం పడుతుంది. పెట్రోల్, డీజల్ ధరలు పెరగడంతో నిత్యావసరాల ధరలు పెరిగే అవకాశం ఉంది. డీజల్ ధరలు పెరగడంతో ఆర్టీసీ చార్జీలు పెరిగే అవకాశం ఉంది. ఈ పెంపు వల్ల జిల్లాలో ప్రత్యక్షంగా 30 లక్షల మంది ప్రజలపై భారం పడనుంది. జిల్లాలో ప్రతినిత్యం 3 లక్షల లీటర్ల పెట్రోల్, 10 లక్షల లీటర్ల డీజల్ వినియోగిస్తారు. రాష్ట్రంలో ధరల పెరుగుదల వల్ల రెవెన్యూ మొత్తం తమిళనాడు తదితర పక్క రాష్ట్రాలకు వెళ్లే అవకాశం ఉందని పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ నాయకులంటున్నారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరల వల్ల వచ్చే ఇబ్బందులపై ప్రెస్‌నోట్ విడుదల చేస్తామని నాయకులు తెలిపారు.
రైతులపైనా భారం..
జిల్లాలో రాబోయే మూడు నెలలు వరికోతలు అధికంగా ఉంటాయి. జిల్లాలో 5 లక్షల ఎకరాలకుపైగా వరిపంట సాగు చేస్తున్నారు. 80 శాతం మంది రైతులు యంత్రాల సహాయంతో కోతలు సాగిస్తారు. డీజల్ ధరలు పెరగడంతో కోత ధరలు పెరిగే అవకాశం ఉంది.