ఆదర్శం మరుగు | Sakshi
Sakshi News home page

ఆదర్శం మరుగు

Published Sat, Jul 25 2015 3:03 AM

ఆదర్శం మరుగు

ఇది కౌతాళం ఎంపీపీ లక్ష్మి ఇల్లు. ప్రజాప్రతినిధిగా సమాజంలో అత్యున్నత గౌరవం పొందుతున్న ఈమె ఇంట్లో మరుగుదొడ్డి లేదంటే నమ్మలేని నిజం.వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంపై ప్రజలను చైతన్యవంతం చేయాల్సిన నాయకులే ఆరుబయటకు వెళ్తుంటే.. మార్పు ఎలా సాధ్యం. ఆత్మకూరుమండల పరిషత్ అధ్యక్షురాలు సౌజన్య.. కర్నూలు మండలంలోని దిన్నెదేవరపాడు సర్పంచ్ నాగన్న.. కురుకుంద ఎంపీటీసీ సభ్యురాలుశిరీష.. కౌతాళం ఎంపీటీసీ-2 సభ్యురాలు నర్సమ్మ.. ఇలా చెప్పుకుంటూ పోతే మరుగుదొడ్డి లేని నేతల జాబితా చాంతాడు.
 
- మరుగుదొడ్డీ లేని ప్రజాప్రతినిధులు
- జిల్లాలో 6వేల మంది ఇళ్లలో ఇదే పరిస్థితి
- అవగాహన కల్పించడంలో అధికారులు విఫలం
- నీరుగారుతున్న లక్ష్యం
కర్నూలు సిటీ:
గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం మెరుగుపర్చేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు.. కనీసం నాయకుల్లోనూ మార్పు తీసుకురాలేని పరిస్థితి. ఆర్థిక స్థోమత ఉండి కొందరు.. లేక మరికొందరు ఇప్పటికీ బహిర్భూమికి ఆరుబయటకే వెళ్తున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన నేతల తీరు నవ్వులపాలు చేస్తోంది. స్వచ్ఛ భారత్ పేరిట కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేపడుతున్నా.. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి నిర్మించాలనే లక్ష్యం ఎంచుకున్నా.. క్షేత్ర స్థాయిలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పెద్దకడబూరు మండలంలో 15 మంది సర్పంచ్‌లు ఉండగా 7గురు, 16 మంది ఎంపీటీసీల్లో 5గురు మాత్రమే మరుగుదొడ్లు నిర్మించుకోవడం చూస్తే ప్రచారం ఏస్థాయిలో సాగుతుందో అర్థమవుతోంది.

జిల్లా వ్యాప్తంగా ప్రజాప్రతినిధుల ఇళ్ల పరిస్థితే ఇలా ఉంటే.. సామాన్యుల మాట సరేసరి. పల్లెల్లో ప్రజాప్రతినిధులు శివారులోని వాగులు, ముళ్లకంపల చాటులో కాలకృత్యాలు తీర్చుకోవడం ఇప్పటికీ సర్వసాధారణమే. పురుషుల మాట అటుంచితే.. మహిళలూ ఆరుబయటకే వెళ్లాల్సిన పరిస్థితి చూస్తే హైటెక్ అభివృద్ధి ఎక్కడనే విషయం ఇట్టే అర్థమవుతోంది. సెల్‌ఫోన్ విషయంలో చూపే శ్రద్ధ మరుగుదొడ్డి నిర్మించుకునే విషయంలో కనపర్చకపోవడం వారిలోని చైతన్యానికి నిదర్శనం.
 
ప్రోత్సాహకం పెంచినా..
గ్రామీణ ప్రాంతాల్లో నిర్మల భారత్ అభియాన్ కింద వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకుంటే ప్రభుత్వం గతంలో రూ.12వేలు చొప్పున మంజూరు చేసింది. గత ఏడాది కేంద్ర ప్రభుత్వం పల్లెల్లో సంపూర్ణ పారిశుద్ధ్యం అమలు దిశగా చేపట్టిన స్వచ్ఛ భారత్‌లో భాగంగా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ ప్రోత్సాహకాన్ని రూ.15వేలకు పెంచింది. అయితే ఏడాది కావస్తున్నా ప్రభుత్వం అనుకున్న స్థాయిలో నిర్మాణాలు లేకపోవడం గమనార్హం.
 
నాయకా..
రాష్ట్ర ప్రభుత్వం మొదట గ్రామ పంచాయతీల్లోని ప్రజాప్రతినిధులందరి ఇళ్లకు వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించాలని నిర్ణయించింది. ఆ మేరకు పంచాయతీ అధికారులతో సర్వే చేయించగా.. జిల్లాలోని 6,698 మంది ప్రజాప్రతినిధులకు వ్యక్తిగత మరుగుదొడ్లు లేనట్లు గుర్తించారు. ఇందులో ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులు 412.. గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు 462, వార్డు సభ్యులు 5514 మంది, 310 పంచాయతీ కార్యాలయాల్లో మగురుదొడ్లు లేనట్లు వెల్లడైంది. వీరందరికీ జూన్ లోపు వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించాలని ఉన్నతాధికారులు లక్ష్యంగా ఎంచుకున్నా.. నేటికీ 10 శాతం మించకపోవడం స్వచ్ఛ భారత్‌పై అధికారుల చిత్తశుద్ధికి అద్దం పడుతోంది.

Advertisement
 
Advertisement
 
Advertisement