జాలి లేని దేవుడు | God does not pity | Sakshi
Sakshi News home page

జాలి లేని దేవుడు

Dec 10 2014 2:34 AM | Updated on Aug 29 2018 8:24 PM

జాలి లేని దేవుడు - Sakshi

జాలి లేని దేవుడు

నిరుపేదలే అయినా వారి మధ్య ప్రేమానురాగాలకు కొదువ లేదు. పెళ్లైనప్పటి నుంచి..

నిరుపేదలే అయినా వారి మధ్య ప్రేమానురాగాలకు కొదువ లేదు. పెళ్లైనప్పటి నుంచి  ఆ దంపతులు ఒకరికి మరొకరు తోడై నిలిచారు. వీరి వైవాహిక జీవితంలో నలుగురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు పుట్టారు. పొద్దు పొడిచినప్పటి నుంచి పొద్దు గూకే వరకు ఆ ఇంటి పెద్ద దిక్కు కష్టపడే వాడు. భర్తకు తోడుగా ఆమె కూడా కూలీ పనులకు వెళ్లేది. అయితే ఏడాది కిందట  భర్త అనారోగ్యంతో మరణించాడు. ఒకవైపు భర్త వియోగం..మరోవైపు పిల్లల  భవిష్యత్తు ఆమెను కుంగదీశాయి. ఆరోగ్యం క్షీణించింది. అప్పటి నుంచి మంచానికే పరిమితమైంది. అమ్మనైనా బతికించుకుందామనుకున్న ఆ బిడ్డల  మొరను దేవుడు ఆలకించినట్టు లేడు. వారి నుంచి అమ్మనూ దూరం చేశాడు.
 
ఆస్పరి: ఆస్పరిలోని ఇందిరానగర్‌కాలనీకి చెందిన చిన్నరామన్న(52), నీలమ్మ(48) దంపతులు. కూలినాలీ చేసుకుని తమ ఆరుగరు బిడ్డలతో జీవితాన్ని కొనసాగించేవారు. ఏడాది కిందట అనారోగ్యంతో చిన్నరామన్న మరణించగా, తాజాగా సోమవారం నీలమ్మ కూడా అనారోగ్యంతో కన్నుచూసింది. దీంతో వారి పిల్లలు రేణుక, తాయమ్మ, నాగమణి, శైలజతో పాటు పరశురాముడు, మహేశ్ దిక్కులేని వారయ్యారు.

తల్లిని బతికించుకునేందుకు...

 పెద్ద దిక్కు లేని నీలమ్మ తమ బిడ్డలకు బడికి పంపేం దుకు కూడా ఆర్థికపరమైన ఇబ్బందులతో పంపేది కాదు. ఇప్పుడిప్పుడే చేతికంది వస్తున్న ఇద్దరు కొడుకులను తన వెంట కూలి పనులకు పిల్చుకెళ్లేది. అంతలోనే ఆమె కూడా అనారోగ్యంతో మంచం పట్టింది. దీనికి తోడు ఏడు పదులు నిండిన పెద్దనాన్న పెద్దరామన్న పోషణ భారం కూడా వారిపైనే పడింది. తల్లికి వైద్యం చేయించేందుకు మరో మార్గం లేక ఆమె ఇద్దరు బిడ్డలను పగలంతా కష్టించి తెచ్చిన అరకొర డబ్బులతోనే వైద్యం చేయించేవారు. దీని కోసం వారు రోజుకు ఒకపూట మాత్రమే భోజనం చేసేవారు. అయినా వారి ప్రయత్నం ఫలించలేదు. దేవుడు చిన్నచూపు చూశాడు. తమ తల్లి కష్టపడకపోయినా చాలు కళ్లముందుంటే చాలనుకున్న ఆ పిల్లల మొరను దేవుడు ఆలకించినట్టు లేడు. సోమవారం రాత్రి ఆమె కూడా భర్త చెంతకే వెళ్లిపోయింది. తమ తల్లి మృతదేహం వద్ద ఆ పిల్లలు కన్నీరుమున్నీరయ్యారు. ‘దేవుడా ఎంత పని చేశావ్.. మాపై ఎందుకింత పగబట్టావ్.. ఏ పాపం ఎరుగని మాపైనా నీ పగ..? మా నాన్నాను తీసుకెళ్లింది చాలక ఇప్పుడు మా అమ్మనూ తీసుకెళ్తే మేం అనాథలుగా బతకాలా?’అంటూ నీలమ్మ బిడ్డలు పొగిలి పొగిలి ఏడ్వడం అక్కడికి వచ్చిన వారి కళ్లు ద్రవించేలా చేసింది.

 ప్రభుత్వమే ఆదుకోవాలి

నీలమ్మ, చిన్నరామన్న మరణంతో అనాథలైన వారి ఆరుగురు పిల్లలను ప్రభుత్వమే అన్ని విధాలుగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. కాగా విషయం తెలిసిన వెంటనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ దొరబాబు మంగళవారం గ్రామానికి చేరుకుని నీలమ్మ అంత్యక్రియల కోసం ఆ కుటుంబానికి తనవంతు సాయంగా ఆర్థిక సహయం అందించారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement