పురాతన నాణెం ఇంటిలో ఉంటే శుభాలు కలుగుతాయి... పిడుగులు పడకుండా రక్షణ కలుగుతుంది.. వంటి మాటలు నమ్మి రెండు సార్లు మోసపోయిన ఓ వ్యక్తి మూడోసారి ఆ ముఠాను పోలీసులకు పట్టించి తన కక్ష తీర్చుకున్నాడు.
బొబ్బిలి: పురాతన నాణెం ఇంటిలో ఉంటే శుభాలు కలుగుతాయి... పిడుగులు పడకుండా రక్షణ కలుగుతుంది.. వంటి మాటలు నమ్మి రెండు సార్లు మోసపోయిన ఓ వ్యక్తి మూడోసారి ఆ ముఠాను పోలీసులకు పట్టించి తన కక్ష తీర్చుకున్నాడు. విజయనగరం పట్టణంలోని పెదతాడివాడకు చెందిన శ్రీరాం అనే వ్యక్తి ప్రస్తుతం బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలోని మల్లమ్మపేట గ్రామంలో బంధువుల ఇంటి వద్ద ఉంటున్నాడు. పురాతన నాణేలను అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు అమ్మవచ్చని రెండుసార్లు కొనుగోలు చేసి ముఠాల చేతిలో ఈయన గతంలో నష్టపోయాడు. బొబ్బిలిలో ఉన్న శ్రీరాంను వెతుక్కొని ఒడిశాకు చెందిన ఒకరు, జిల్లాలో ఆరుగురితో కూడి కొత్త ముఠా పురాతన నాణేన్ని అమ్మడానికి రెండు రోజుల కిందట వచ్చింది.
అప్పటికే రెండుసార్లు మోసపోవడంతో వీరి భాగోతాన్ని బయటపెట్టాలని పోలీసులకు సమాచారం అందించాడు. ఆ ముఠా శ్రీరాంతో బొబ్బిలి పట్టణ శివారున రాణిగారితోటలో బేరసారాలు జరుగుతుండగా ఎస్‌ఐ నాయుడు తన సిబ్బందితో వెళ్లి గురువారం రాత్రి పట్టుకున్నారు. ఆ ముఠాకు చెందిన ఏడుగుర్ని అరెస్టు చేసి వారినుంచి రూ. 2150 నగదు తో పాటు ఓ కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాకు ఒడిశా రాష్ట్రం రాయగడకు చెందిన పి.బాల రాజు నాయకత్వం వహించాడు. బాలరాజుకు అదే రాష్ట్రం నారాయణపట్నానికి చెందిన కొంత మందితో పరిచయాలు ఏర్పడినప్పుడు శ్రీరామపట్టాభిషేకం చిత్రం, ఈస్టు ఇండి యా కంపెనీ, టు అణ అని ముద్రించి ఉన్న 1818లో తయారైన పురాతన నాణేన్ని ఇచ్చారు.
దీనిని విక్రయించడానికి రాష్ట్రంలో వీటితో సంబంధమున్న కొంత మందిని చేరదీశాడు. సాలూరు మండలం రేగులవలసకు చెందిన బి.రామకృష్ణ, గంగన్నదొరవలస గ్రామానికి చెందిన ఐ.సాంబమూర్తి, గుమ్మలక్ష్మీపురానికి చెందిన కలప వెంకటరావు, బొబ్బిలి మెహర్‌కాలనీకి చెందిన బి సూరపునాయుడు, రావువారివీధికి చెందిన ఏగిరెడ్డి చిట్టినాయుడు, పార్వతీపురం పట్టణం సౌందర్యనగర్ కాలనీకి చెందిన జగతి సీతారామస్వామినాయుడుల ద్వారా ఆ నాణేన్ని విక్రయించాలని నిర్ణయించుకున్నారు. సీతారామస్వామినాయుడుకు చెందిన కారులో వీరంతా బొబ్బిలి వచ్చి అప్పటికే గతంలో రెండు సార్లు నాణేలను కొనుగోలు చేసిన శ్రీరాంను కలిశారు.
ఈ నాణేన్ని పది లక్షల రూపాయలకు అమ్మడానికి సిద్ధమవుతుండగా పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. పోలీసులకు సమాచారం అందించిన శ్రీరాం గతంలో విజయనగానికి చెందిన శ్రీను, సింహాచలం, శంకరరావు అనే వ్యక్తుల వద్ద నుంచి ఇటువంటి నాణేన్ని రెండేళ్ల కిందట కొని మోసపోయాడు. దీంతో మూడో సారి పోలీసులకు సమాచారం అందించాడు. ఎస్‌ఐతో పాటు ఐడీ పార్టీకి చెందిన రమణ, మురళిలు దాడి చేసిన వారిలో ఉన్నారు.