
జూన్‌లో భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక
తాను రెండో విడత దీక్షను విరమించడానికి పెద్దల సూచనలే కారణమని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తెలిపారు.
కాపు ఉద్యమ నేత ముద్రగడ వెల్లడి
పొన్నూరు/అవనిగడ్డ: తాను రెండో విడత దీక్షను విరమించడానికి పెద్దల సూచనలే కారణమని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తెలిపారు. గుంటూరు జిల్లా పొన్నూరులో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. జూన్ నెలలో 13 జిల్లాల నాయకులతో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికను తెలియజేస్తామని ఆయన ప్రకటించారు. తాము ఏ పార్టీకి, ఏ కులానికి వ్యతిరేకం కాదన్నారు.
రిజర్వేషన్ పొందేవరకు నిద్రపోవద్దు : రిజర్వేషన్ ఫలాలు అందేవరకూ కాపులెవరూ నిద్రపోవద్దని ముద్రగడ పద్మనాభం పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలోని ఎస్‌వీఎల్ క్రాంతి జూనియర్ కళాశాలలో అవనిగడ్డ కాపు యువ సంఘం ఆధ్వర్యంలో సోమవారం ముద్రగడతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. తమ పోరాటంలో మిగిలిన కులాలను కలుపుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.