విశాఖ ప్రమాదం: నలుగురు సభ్యులతో కమిటీ

Four Member Committee To Investigate Parawada Fire Accident - Sakshi

సాక్షి, విశాఖపట్నం: పరవాడ ఫార్మాసిటీలో రోజుల వ్యవధిలోనే మరో ప్రమాదం జరగడాన్ని జిల్లా యంత్రాంగం తీవ్రంగా పరిగణిస్తోంది. కోస్టల్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంపై కలెక్టర్ వినయ్ చంద్ నలుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు. ప్రమాదంపై విచారణ జరిపి‌ నివేదిక ఇవ్వాలని కమిటీ సభ్యులని ఆదేశించారు. డై మిథైల్ సల్ఫాక్సైడ్ వల్ల భారీ మంటలు ఏర్పడ్డాయని, ప్రమాదంపై పూర్తి విచారణ జరుపుతున్నామని కలెక్టర్ వినయ్ చంద్ అన్నారు. వరుస ప్రమాదాల‌ నేపధ్యంలో మరోసారి జిల్లా స్ధాయిలో సమీక్ష నిర్వహించి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. 

పరవాడ ఘటనపై విశాఖ ఆర్డీఓ, విచారణ కమిటీ సభ్యుడు కిషోర్‌ మాట్లాడుతూ.. పరవాడ సాల్వేషన్ కంపెనీలో‌ జరిగిన ప్రమాదంపై విచారణ చేస్తున్నాం. వాల్వ్ దగ్గర శాంపిల్ కలెక్షన్ చేస్తున్న సమయంలో ఏర్పడిన విద్యుత్ స్పార్క్ వల్ల ప్రమాదం జరిగిందని ప్రాధమిక అంచనా. ఈ ఫార్మా కంపెనీలో కనీస విద్యార్హత, అనుభవం లేకుండా కేవలం‌ పదవ తరగతి చదివిన వారిని‌ కెమిస్ట్ గా పనిచేయడాన్ని గుర్తించాం. ప్రమాదం తర్వాత ఉండాల్సిన రక్షణ పరికరాలు కూడా లేకుండా ఉన్నాయి. తమ ఉద్యోగులకి  కంపెనీలు శిక్షణ ఇవ్వాల్సి ఉంది. డై మిధైల్ సల్ఫ్ఆక్సైడ్ లాంటి ప్రమాదకరమైన రసాయనాలను వాడే చోట కనీస అవగాహన లేని వారిని నియమించుకున్నారు. ప్రమాదంపై ఎలా స్పందించాలో ప్రజలని రక్షించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో అవగాహన కల్పించాల్సి ఉంది. ప్రమాద ఘటనలో ఒకరు మరణించారు. మంటలను పూర్తిగా అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ప్రమాద స్థలంలో రక్షణ పరికరాలు అందుబాటులో లేకపోవడం, రక్షణ పరికరాలు ఉపయోగించడంలో కూడా అవగాహన లేకపోవడాన్ని‌ గుర్తించాం. ఈ తరహా ప్రమాదాలు ఇకపై జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని విచారణ కమిటీ సభ్యుడు కిషోర్‌ తెలిపారు. 

కాగా.. ఫార్మా సిటీలో సోమవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక కార్మికుడు చనిపోయినట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాంకీ సాల్వెంట్‌ ఫాక్టరీలో రాత్రి 10.30 ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించగా.. కార్మికుడు  శ్రీనివాసరావు  అగ్నికి ఆహుతయ్యాడు. గాయాలపాలైన మరో కార్మికుడు మల్లేష్‌ను గాజువాకలోని ఆస్పుపత్రి తరలించారు. ప్రమాద సమయంలో అక్కడ మొత్తం ఆరుగురు కార్మికులు ఉన్నారు. మిగతా కార్మికులు సురక్షితంగా ఉన్నట్టు జిల్లా అధికారులు తెలిపారు. ఉదయానికల్లా మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయని వెల్లడించారు. చదవండి: విశాఖ ఫార్మా సిటీలో అగ్ని ప్రమాదం

విశాఖ ప్రమాదంపై హోంమంత్రి దిగ్భ్రాంతి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top