వైఎస్సార్‌సీపీలో చేరిన తోట త్రిమూర్తులు

Former MLA Thota Trimurthulu Joins In YSRCP - Sakshi

జిల్లా అభివృద్ధి కోసమే వైఎస్సార్‌సీపీలో చేరుతున్నా

ఏపీ అభివృద్ధి వైఎస్‌ జగన్‌తోనే సాధ్యం

పవన్‌  కల్యాణ్ కాపుల తరఫున మాట్లాడటం లేదు

 సీఎం జగన్‌ సమక్షంలో పార్టీలో చేరిన తోట

సాక్షి, తూర్పు గోదావరి:  టీడీపీ సీనియర్‌ నాయకులు, రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆదివారం పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు భారీగా అనుచరులు, కార్యకర్తలు ముఖ్య నాయకులు పార్టీలో చేరారు. రెండు రోజుల క్రితమే టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తోట త్రిమూర్తులు మాట్లాడుతూ.. నియోజకవర్గ, జిల్లా అభివృద్ధి కోసమే తాను వైఎస్సార్‌సీపీలో చేరానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సమర్థవంతమైన నేతను ప్రజలు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారని అభిప్రాయపడ్డారు. ఏపీ అభివృద్ధి వైఎస్‌ జగన్‌తోనే సాధ్యమని, ఆ నమ్మకంతోనే పార్టీలో చేరుతున్నానని స్పష్టం చేశారు. పార్టీలోని సీనియర్లతో కలిసి జిల్లా అభివృద్ధికి సహకరిస్తానని పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ కాపుల తరుపున మాట్లాడలేదని, ఆయన అభిప్రాయం మాత్రమే అని అన్నారు.


గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన అనంతరం.. టీడీపీని నమ్ముకుంటే తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదని గట్టిగా నమ్ముతున్న ఆ పార్టీ నాయకులు ఒక్కొక్కరుగా ‘చంద్రబాబుకో దండం’ అంటూ గుడ్‌బై చెప్పేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా తోట త్రిమూర్తులు, తన అనుచరులతో కలిసి టీడీపీకి రాజీనామా చేయడం, వైఎస్సార్‌సీపీలో చేరడం జిల్లాలో టీడీపీని ఓ కుదుపు కుదిపింది. చంద్రబాబు నాయుడి వ్యవహార శైలి కారణంగా టీడీపీకి నానాటికీ ప్రజాదరణ తగ్గిపోతున్న నేపథ్యంలో.. ఆ పార్టీకి ఒక్కొక్కరుగా నాయకులు గుడ్‌బై చెప్పేస్తున్నారు.

పవన్‌ వ్యాఖ్యలపై మాట్లాడటం అనవసరం
సందర్భంగా ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. తోట త్రిమూర్తులు వైఎస్సార్‌సీపీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. ‘అన్ని సామాజిక వర్గాలకు సీఎం జగన్‌ న్యాయం చేస్తున్నారు, కాబట్టే అన్ని వర్గాల నాయకులు వైఎస్సార్‌సీపీలో చేరుతున్నారు. ఎల్లో మీడియాకు తప్ప అన్ని వర్గాల ప్రజలకు జగన్‌ పాలన ఎంతో బాగా నచ్చింది. వంద రోజుల్లో  సీఎం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారు. అన్ని వ్యవస్థలను దోచుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. పవన్ కల్యాణ్ నిలకడలేని వ్యక్తి. అవగాహన లేని వ్యక్తి. ఆయన వ్యాఖ్యలపై మాట్లాడటం అనవసరం’ అని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా స్వాగతిస్తామని మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ అన్నారు. త్రిమూర్తులు పార్టీలో చేరడం సంతోషంగా ఉందని, ఆయనతో కలిసి జిల్లా అభివృద్ధి కోసం పని చేస్తామని పేర్కొన్నారు. 

టీడీపీ వ్యాపార సంస్థ: ఆమంచి కృష్ణ మోహన్ 
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వైస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు భయపడుతున్నారన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు తప్పు. తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి. కాపులే కాదు అన్ని సామాజిక వర్గాలు వైస్సార్‌సీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. సామాజిక న్యాయం జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యం. సిగ్గులేకుండా చంద్రబాబు తన పార్టీ వాళ్ళను బీజేపీలోకి పంపుతున్నారు. చంద్రబాబు వెనుక ఉన్న వాళ్లు ఉత్తుత్తి నాయకులే. మేము దేనికి ఆశపడి పార్టీలో చేరలేదు. టీడీపీ అనేది అక్రమ వ్యాపార సంస్థ.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top