ప్రధాన సమస్యలపై దృష్టి సారించండి | Focus on the issues | Sakshi
Sakshi News home page

ప్రధాన సమస్యలపై దృష్టి సారించండి

Jun 24 2014 2:23 AM | Updated on Sep 2 2017 9:16 AM

జిల్లా అధికారులు తమశాఖకు సంబంధించి ఐదు ముఖ్య సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఎం.రఘునందనరావు సూచించారు.

  • సమగ్ర నివేదికలు తయారు చేయండి
  •  జిల్లా అధికారులతో కలెక్టర్ రఘునందన్‌రావు
  • కలెక్టరేట్ (మచిలీపట్నం) : జిల్లా అధికారులు తమశాఖకు సంబంధించి ఐదు ముఖ్య సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఎం.రఘునందనరావు సూచించారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన అనంతరం కలెక్టర్ కొద్దిసేపు అధికారులతో మాట్లాడారు.

    ఆయా శాఖలకు సంబంధించి జిల్లా అధికారులు మూడు, నాలుగు నెలలుగా పరిష్కారమవని సమస్యలు, అపరిష్కృతంగా ఉన్న ప్రధాన సమస్యల్లో ఐదింటిని గుర్తించి జూలై 15వ తేదీలోగా పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయా శాఖల అధికారులు ఐదు ముఖ్యాంశాలపై సమగ్ర నివేదిక తయారు చేసి మంగళవారం మచిలీపట్నంలో ఉండే జిల్లా అధికారులు తన వద్దకు తీసుకురావాలని కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు.

    అధికారులు ఎక్కువ సమయం సమస్యల పరిష్కారానికి వెచ్చించాలన్నారు. ఈ సమస్యలను ముందుగానే నిర్ణయించిన కాలంలో పరిష్కరిస్తేనే ఆ శాఖ పనితీరు తెలుస్తుందన్నారు. సాంఘిక సంక్షేమశాఖకు సంబంధించిన వసతి గృహాల్లో విద్యార్థులు అందరికీ నూరుశాతం యూనిఫాం పంపిణీ చేశారా, లేదా అన్న విషయాన్ని డీడీ మధుసూదనరావు తెలుసుకోవాలని సూచించారు. రాబోయే 30 రోజుల్లో 70 శాతం వసతి గృహాలను తనిఖీ చేయాలన్నారు.

    అంగన్‌వాడీ కేంద్రాల్లో నూరుశాతం పిల్లలకు గ్యాస్ ద్వారానే వంట చేసి ఆహార పదార్థాలను అందించాలన్నారు. రాబోయే రోజుల్లో మంత్రులు, ఆయాశాఖల ఉన్నతాధికారులు జిల్లాకు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇందుకోసం సంబంధితశాఖల అధికారులు తమ శాఖకు సంబంధించి ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి, ఎన్ని పరిష్కారమయ్యాయి, ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయి, ప్రభుత్వ స్థాయిలో ఉన్న సమస్యలు ఏవో తెలిసేలా సమగ్ర నివేదిక తయారు చేసి సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.

    ఉన్నతాధికారులు వచ్చినప్పుడు సమస్యలపై నివేదిక అడిగితే తరువాత కనుక్కుని చెబుతామనే సమాధానం రాకూడదని స్పష్టంచేశారు. సమస్యల పరిష్కారానికి నివేదికలు రూపొందించడమే కాకుండా వాటిని చిత్తశుద్ధితో పరిష్కరించేలా జిల్లా అధికారులు కృషిచేయాలన్నారు.

    జాయింట్ కలెక్టర్ జె.మురళి, ఏజేసీ చెన్నకేశవరావు, డీఆర్వో ఎ.ప్రభావతి, జెడ్పీ సీఈవో డి.సుదర్శనం, సాంఘిక సంక్షేమశాఖ డీడీ డి.మధుసూదనరావు, డీసీవో రమేష్‌బాబు, హౌసింగ్ పీడీ సీహెచ్.ప్రతాపరావు, డీఎంఅండ్‌హెచ్‌వో సరసిజాక్షి, వ్యవసాయశాఖ జేడీ వి.నరసింహులు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎన్.వి.వి.సత్యనారాయణ, బీసీ కార్పొరేషన్ ఈడీ పుష్పలత, రాజీవ్ విద్యామిషన్ ఇన్‌చార్జ్ పీవో డి.పుష్పమణి, డీఈవో  డి.దేవానందరెడ్డి తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement