అసెంబ్లీ ఐదు రోజులే... | Five days of assembly | Sakshi
Sakshi News home page

అసెంబ్లీ ఐదు రోజులే...

Nov 25 2015 8:15 PM | Updated on Sep 4 2018 5:07 PM

అసెంబ్లీ శీతాకాల సమావేశాలను కేవలం ఐదు రోజులతో ముగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయించారు.

అసెంబ్లీ శీతాకాల సమావేశాలను కేవలం ఐదు రోజులతో ముగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయించారు. వచ్చే నెల 17వ తేదీ నుంచి 22వ తేదీ వరకు అసెంబ్లీ శీతాకాల సమావేశాలను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. రైతుల ఆత్మహత్యలతో పాటు నూతన రాజధాని నిర్మాణం, రాజధానిలో భూ దందా, ఇసుక తవ్వకాల్లో అక్రమాలు, కారు చౌకగా కావాల్సిన వారికి భూముల కేటాయింపు, కరవు, ఇటీవల భారీ వర్షాలు తదితర ప్రధానమైన అంశాలు చర్చించాల్సి ఉన్నప్పటికీ అసెంబ్లీ సమావేశాలను కేవలం ఐదు రోజులకే పరిమితం చేయడం పట్ల అధికార వర్గాలే విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.  

వివిధ ప్రజా సమస్యలపై చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టినా.. గత వర్షాకాల సమావేశాలను సైతం తూతూ మంత్రంగా పూర్తి చేసిన సర్కార్ మరో సారి.. సమావేశాలను నామ మాత్రంగా నిర్వహించాలని భావిస్తోంది.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 83 రోజుల తరువాత హైదరాబాద్‌లోని సచివాలయానికి రానున్నారు. సెప్టెంబర్ 5వ తేదీన సచివాలయంలో ఎల్ బ్లాక్‌లో మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఆ తరువాత ఇప్పటి వరకు సచివాలయంలోని ఎల్ బ్లాక్‌లో గల సీఎం కార్యాలయానికి చంద్రబాబు నాయుడు రాలేదు. ఈ నెల 27వ తేదీ రాత్రికి హైదరాబాద్ రానున్న చంద్రబాబు నాయుడు.. 28 ఉదయం సచివాలయంలో అన్ని శాఖల ప్రధాన కార్యదర్శులతో పాటు.. ముఖ్య కార్యదర్శులతో సమీక్ష నిర్వహించనున్నారు.

 ఇలా ఉండగా వచ్చే నెల 1వ తేదీన మంత్రివర్గ సమావేశాన్ని విజయవాడలో నిర్వహించాలని నిర్ణయించారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు హైదరాబాద్‌లో జరుగున్న నేపథ్యంలో వచ్చే నెల 18వ తేదీన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశాన్ని కూడా హైదరాబాద్‌లోనే నిర్వహించాలని అధికారులు పేర్కొంటున్నారు. అయితే తొలుత విజయవాడలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. దీనిపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సీఎం కార్యాలయ వర్గాలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement