బోనస్‌ పేరుతో బురిడీ

Fisheries farmers want YS Jagan to solve their another problem - Sakshi

నష్టపోతున్న చేపల రైతులు

105 కిలోల చేపలకు 100 కిలోల ధరనే చెల్లిస్తున్న వ్యాపారులు

సాలీనా రూ.500 కోట్ల వరకు నష్టపోతున్న వైనం 

సీఎం దృష్టికి తీసుకువెళతానన్న మంత్రి మోపిదేవి

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చేపల రైతుల పాలిట ‘బోనస్‌’ విధానం వారి ఆదాయంపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. చేపల అమ్మకాల సమయంలో రైతులు ఏటా దాదాపు రూ.500 కోట్ల వరకు నష్టపోతున్నారు. రైతుల నుంచి చేపలను కొనుగోలు చేసే సమయంలో వ్యాపారులు 5 శాతం బోనస్‌ విధానాన్ని అనుసరిస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆక్వా రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టిన వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఈ సమస్యను కూడా పరిష్కరించి తమను ఆదుకోవాలని చేపల రైతులు కోరుతున్నారు. ఈ ‘బోనస్‌’ దందాను మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణారావు దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి గత నెలలో  రైతులతో సమావేశం నిర్వహించి వివరాలు తెలుసుకున్నారు. విషయాన్ని సీఎంకు వివరించి, మరోసారి రైతులు, వ్యాపారులతో సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి చెప్పారు. 

ఐదు శాతం బోనస్‌ అంటే: 
 రైతు నుంచి చేపలు కొనుగోలు చేసిన సమయంలో ఎన్ని కిలోలు కొంటే ఆ మొత్తానికి ధర చెల్లించాలి. కానీ బోనస్‌ పేరుతో అదనంగా మరో అయిదు కిలోలు తీసుకుంటున్నారు. ఉదాహరణకు 100 కిలోలు కొంటూ 105 కిలోల చేపలను తీసుకుని, 100 కిలోలకే ధర చెల్లిస్తున్నారు. ఈ విధానం 30 ఏళ్లుగా కొనసాగుతోందని అదనంగా తీసుకుంటున్న అయిదు కిలోల విలువను ఇతర రాష్ట్రాల్లోని బ్రోకర్లు, కమిషన్‌ ఏజెంట్లకు ఖర్చు చేస్తున్నామని చెబుతున్నారు. అలా చేయకపోతే అక్కడి మార్కెట్లలో ధర రానీయకుండా చేస్తారని అంటున్నారు. ఈ దందాతో రైతులు ఏటా దాదాపు రూ.500 కోట్లు నష్టపోతున్నారు. అధికారులు దీనికి సంబంధించి పూర్తి వివరాలతో నివేదిక రూపొందించే పనిలో ఉన్నారు. 

రైతులు ఎంత నష్టపోతున్నారంటే:
► ఏటా 16 లక్షల టన్నుల చేపల దిగుబడి అవుతోంది. 
► వ్యాపారులు కొనుగోలు సమయంలో అయిదు శాతం అదనంగా తూకం వేసుకుని దానికి ధర చెల్లించట్లేదు. ఇలా మొత్తం 80 వేల టన్నులు నష్టపోతున్నారు. 
► చెరువులు వద్ద చేపల ధర కిలో రూ.60 నుంచి రూ.100లోపు ఉంటుంది. కనిష్టంగా రూ. 60గా అంచనా వేసినా.. బోనస్‌ దందాతో రూ.480 కోట్ల మేర ఆదాయం కోల్పోతున్నారు. 

వాస్తవాలు తెలుసుకుని త్వరలో మరో సమావేశం: మోపిదేవి 
‘బోనస్‌’పై వాస్తవాలు తెలుసుకుంటాం. రాష్ట్ర దిగుబడిలో 90 శాతం చేపలు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంది. వ్యాపారులు, రైతులు ఇరు వర్గాలకు ప్రయోజనాలు కాపాడేలా వారితో త్వరలో మరో సమావేశం నిర్వహిస్తాం.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top