రాష్ట్రాన్ని విభజించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించడంపై జిల్లా వ్యాప్తంగా నిరసన జ్వాలలు వెల్లువెత్తాయి.
రాష్ట్రాన్ని విభజించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించడంపై జిల్లా వ్యాప్తంగా నిరసన జ్వాలలు వెల్లువెత్తాయి. గురువారం రాత్రి కేబినెట్ నిర్ణయం వెలువడిన వెంటనే మొదలైన ఆగ్రహ జ్వాలలు శుక్రవారం తీవ్రరూపం దాల్చాయి. జిల్లా వ్యాప్తంగా ప్రజలు మరోమారు రోడ్డెక్కారు. ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలతో కదం తొక్కారు. జాతీయ రహదారులను దిగ్బంధించారు. కాంగ్రెస్ పార్టీ, కేంద్ర మంత్రులు సీమాంధ్రుల మనోభావాలను గుర్తించకపోవడంపై తీవ్రంగా మండిపడ్డారు. ప్యాకేజీల కోసం కక్కుర్తిపడే సీమాంధ్ర మంత్రులు, ఎంపీలకు సమాధి కట్టడం తథ్యమని శాపాలు పెట్టారు.
తిరుపతి, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ తిరుపతిలో ఏపీఎన్జీవో జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఆర్టీసీ కార్మికులు విధులు బహిష్కరించి ఒకటో డిపో గ్యారేజీ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. బాలాజీ లింక్ బస్టాండ్‌లో తిరుమలకు వెళ్లే బస్సులను గంటసేపు అడ్డుకున్నారు. పోలీ సులు రంగప్రవేశంచేసి పరిస్థితిని చక్కదిద్దారు. ఎస్వీయూ టీచింగ్, నాన్‌టీచింగ్ సిబ్బంది, విద్యార్థులు యూనివర్సిటీ ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద జాతీయ ర హదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు.
టీఎన్‌ఎస్‌ఎఫ్ కార్యకర్తలు పద్మావతి మహిళా వర్సిటీ, పద్మావతి మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలను మూయించి నిరసన ర్యాలీ చేపట్టారు. మాజీ ఎమ్యెల్యే చదలవాడ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు వాహనాలలో పర్యటించి నగరంలోని దుకాణాలను మూసివేయించారు. మదనపల్లెలో మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు నిమ్మనపల్లె రోడ్డు కూడలిలో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఎన్జీవోలు ర్యాలీ నిర్వహించి వైఎస్‌ఆర్‌సీపీ నాయకులతో కలసి బంద్‌లో పాల్గొన్నారు. పుంగనూరులో టీడీపీ కార్యకర్తలు మోటార్‌బైక్ ర్యాలీ నిర్వహించారు.
పీలేరులో ఆర్టీసీ కార్మికులు విధులు బహిష్కరించి భారీ ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. క్రాస్‌రోడ్డు కూడలిలో జాతీయ రహదారిపై మానవహారం ఏర్పాటు చేసి, రాస్తారోకో చేపట్టారు. పలమనేరులో టీడీపీ కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించి ధర్నా,రాస్తారోకో చేశారు. ఎన్జీవో నాయకులు ప్రదర్శన నిర్వహించి ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయించారు. శ్రీకాళహస్తిలో టీడీపీ కార్యకర్తలు స్కూటర్ ర్యాలీ, ఎన్జీవోలు నిరసన ప్రదర్శన, ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు. బి కొత్తకోటలో విద్యార్థులు నిరసన ప్రదర్శన నిర్వహించి ధర్నా చేశారు.
చిన్నగొట్టిగల్లు,భాకరాపేటలో విద్యార్థులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. కుప్పంలో టీడీపీ కార్యకర్తలు ర్యాలీగా వచ్చి దుకాణాలను మూసివేయించారు. కుప్పం జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యవాదులు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలతో కలసి బంద్‌ను పర్యవేక్షించారు.చిత్తూరులో ఎన్జీవోలు,ఉపాధ్యాయులు గాంధీ బొమ్మ సర్కిల్‌లో రోడ్డుపై పడుకొని నిరసన తెలిపారు. టీడీపీ కార్యకర్తలు జనతా బజారు వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఆర్టీసీ కార్మికులు విధులు బహిష్కరించి డిపో ఎదుట ధర్నా చేశారు.