అన్నదాత గుండె పగిలింది

Farmers Died Due to Cyclone Phethai Shock - Sakshi

పొలంలోనే ప్రాణాలు వదిలిన ఇద్దరు..

పంట గురించి కలత చెంది నిద్రలోనే తుదిశ్వాస విడిచిన మరొకరు..

శ్రీకాకుళం, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో విషాద ఘటనలు

మెళియాపుట్టి/తెనాలి రూరల్‌/పెదవేగి రూరల్‌ : అన్నదాత గుండె పగిలింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట కళ్లెదుటే తుపాను ప్రభావంతో పాడవుతోందనే ఆవేదన అతని మనసును తొలిచేసింది. ఇంటికి చేరాల్సిన పంట నీటి మునిగితే అన్న ఆలోచనే తీవ్ర ఒత్తిడికి గురిచేసింది. పంట గింజలను కాపాడుకునే ప్రయత్నం చేశాడు. అంతలోనే ఉన్న ఫళంగా పొలంలోనే కుప్పకూలిపోయి మరణించాడు. పెథాయ్‌ రూపంలో వచ్చిన తుపాను శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలంలోని ఆ కుటుంబానికి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇదే తరహాలో గుంటూరు జిల్లా తెనాలి పట్టణానికి చెందిన ఓ రైతు కూడా ప్రాణాలు కోల్పోగా.. పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగిలో మరో రైతు తీవ్ర మనస్తాపానికి గురై నిద్రలోనే గుండెపోటుతో మరణించాడు. వివరాల్లోకి వెళ్తే..

శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం కొసమాల గ్రామానికి చెందిన రైతు గొట్టిపల్లి చిన్నయ్య (69)కి నాలుగెకరాలు పొలంలో వరిసాగు చేశాడు. కోతలు పూర్తవడంతో కుప్పలు వేశాడు. అయితే పెథాయ్‌ తుపానుతో సోమ, మంగళవారాల్లో కురిసిన వర్షానికి పొలంలో నీరు చేరింది. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన చిన్నయ్య వరికుప్పల చుట్టూ చేరిన నీటిని మళ్లించేందుకు మంగళవారం పొలానికి వెళ్లాడు. అధికంగా నీరుచేరి ఉండడంతో నీటిని మళ్లించే ప్రయత్నం చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలి అక్కడికక్కడే చనిపోయాడు. స్థానికులు ఇది గమనించి వెళ్లి చూసేలోపే చిన్నయ్య ప్రాణాలు కోల్పోయాడు. కాగా, మృతినికి భార్య శాంతమ్మ, ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. పంటను కాపానుకోవడానికి వెళ్లిన ఇంటిపెద్ద శవమై రావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు.

నీటమునిగిన పంటను చూసి..
ఇక గుంటూరు జిల్లా తెనాలి ఐతీనగర్‌కు చెందిన రైతు కనపర్తి సుందరరావు (58) కూడా ఇదే తరహాలో ప్రాణాలు కోల్పోయాడు. కౌలుకు తీసుకున్న ఐదెకరాల్లో వేసిన వరిపంట కోతకు వచ్చింది. రెండ్రోజుల్లో కోతకు సిద్ధమవుతున్న తరుణంలో పెథాయ్‌ సుందరరావు గుండెల్లో తుపాను రేపింది. పంటను తీవ్రంగా దెబ్బతీసింది. చేనును చూసుకునేందుకు మంగళవారం వెళ్లిన అతను వాలిపోయిన పంటను చూసి తీవ్ర ఆందోళనకు గురై ఒక్కసారిగా అక్కడే కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన తోటి రైతులు అతని కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చి ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మరో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణం విడిచాడు. మృతునికి భార్యా, ఇద్దరు కుమారులు.

కొట్టుకుపోయిన పంట గురించి కలత చెంది..
మరో ఘటనలో.. ఆరుగాలం పడ్డ కష్టం తుపానుకు కొట్టుకుపోవడంతో పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి గ్రామానికి చెందిన రైతు రాజులపాటి మల్లిఖార్జునరావు (39) కూడా రోజంతా తీవ్రంగా కలత చెంది చివరికి రాత్రి నిద్రలోనే గుండెపోటుతో తుదిశ్వాస విడిచాడు. ఈయన ఐదెకరాల్లో మొక్కజొన్న వేశాడు. ఇప్పటివరకు రూ.రెండుల లక్షల వరకు పెట్టుబడి పెట్టాడు. పైరు ఏపుగా పెరిగింది. మంచి దిగుబడితో కష్టాలు తీరుతాయనుకుంటున్న సమయంలో పెథాయ్‌ తుపాను విరుచుకుపడడంతో పంట మొత్తం పాడైంది. దీంతో సాగుకు చేసిన అప్పులు తీర్చేదెలా అంటూ  సోమవారం ఉదయం నుంచి మల్లికార్జునరావు తీవ్రంగా మథనపడుతున్నాడని అతని భార్య శివదుర్గ తెలిపింది. మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో నిద్రలోనే గుండెనొప్పి వచ్చిందని.. ఏలూరు ఆశ్రం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారని కన్నీటిపర్యంతమైంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top