చంపేశారు!

Farmer Pesticide Drinking Suicide - Sakshi

గిరిజన రైతుపై అధికార పార్టీ నేతల జులుం 

ఆన్‌లైన్‌లో భూ యజమాని పేరు మార్పు 

ఆందోళన చెందిన రైతు కేశవనాయక్‌ 

న్యాయం చేయాలని వేడుకోలు 

పట్టించుకోని రెవెన్యూ అధికారులు 

భూమి దక్కదని తెలిసి బలవన్మరణం 

‘‘భూమి ఉంది... భయం లేదు... కూతుళ్లకు పెళ్లిళ్లు ఘనంగా చేయాలని రోజూ అనేవాడివి.. ఇప్పుడు    కదలకుండా పడి ఉన్నావు... మాకు దిక్కెవరయ్యా’’ 
మార్చురీ వద్ద ఇద్దరు కూతుళ్లు త్రివేణి, భారతిని పట్టుకుని కేశవనాయక్‌  భార్య శాంతమ్మ విలపించిన తీరు అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించింది.

ధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ నేతలు రెచ్చిపోయారు. ఓ గిరిజన రైతు ఆరేళ్లుగా సాగుచేసుకుంటున్న పొలాన్ని కాజేసేందుకు ప్రణాళిక రచించారు. ఆన్‌లైన్‌లో వేరొకరి పేరు కూడా ఎక్కించారు. న్యాయం చేయాలని బాధిత రైతు కాళ్లావేళ్లాపడినా...అధికారులు   కనికరం చూపలేదు. ఆందోళన చెందిన ఆ గిరిజనుడు 
పురుగుల మందు తాగి ప్రాణం తీసుకోగా.. అతనిపైనే ఆధారపడిన ఇద్దరు కూతుళ్లు, భార్య దిక్కులేని వారయ్యారు
.  

ఆత్మకూరు : తమ భూమిని అధికార పార్టీకి చెందిన వ్యక్తి పేరుపై ఆన్‌లైన్‌లో నమోదు చేయడంతో మనస్తాపానికి గురైన ఆత్మకూరు మండలం వేపచెర్లతండాకు చెందిన రైతు కేశవనాయక్‌ (45) ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. 
ఇంతకీ ఏం జరిగిందంటే... 
వేపచెర్ల తండాకు చెందిన కేశవనాయక్, శాంతమ్మ దంపతులు కూలీలు. వీరికి ఇంటర్, పదో తరగతి చదువుతున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 2012లో   కాంగ్రెస్‌ ప్రభుత్వం భూ పంపిణీ కింద 507–2 సర్వే నంబర్‌లో 3.21 ఎకరాల పొలాన్ని శాంతమ్మ పేరు మీద పంపిణీ చేసింది. అప్పటి నుంచి ఆ పొలంలో పంట సాగుచేసుకుంటున్నారు. ఆత్మకూరు సిండికేట్‌ బ్యాంకులో రూ.70 వేల పంట రుణం పొందారు. ఇదిలా ఉండగా నెల రోజుల కిందట శాంతమ్మ పేరిట ఉన్న 3.21 ఎకరాల భూమిని అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన కృష్ణానాయక్‌ పేరిట ఆన్‌లైన్‌లో నమోదు చేశారు.

ఈ విషయం తెలుసుకున్న కేశవనాయక్‌ రెవెన్యూ అధికారులను సంప్రదించి, తన గోడు వెల్లబోసుకున్నాడు. కానీ న్యాయం జరగలేదు. మరోవైపు పంట రుణం రెన్యూవల్‌ సమయం దగ్గరపడింది. రెన్యూవల్‌ చేయాలంటే బ్యాంకు అధికారులు రికార్డులు పరిశీలిస్తారు. అప్పుడు వేరే పేరు కనిపిస్తే ఇబ్బంది అవుతుందని ఆందోళనకు గురైన రైతు కేశవనాయక్‌ ఆదివారం ఇంటి దగ్గరే పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.  
చక్రం తిప్పిన మారెక్క 
శాంతమ్మ భూమిని కృష్ణానాయక్‌ పేరిట మార్పు చేయించడంలో ఎంపీపీ మారెక్క హస్తం ఉన్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తమ పార్టీకి చెందిన కృష్ణా నాయక్‌ పేరుమీద మార్చాలని ఎంపీపీ రెవెన్యూ అధికారులపై తీవ్రంగా ఒత్తిడి తెత్తినట్లు తెలుస్తోంది. 
పోలీసుల జోక్యంతో అంత్యక్రియలు 
ఆదివలారం సాయంత్రం పొలంలోనే అంత్యక్రియలు చేయటానికి సిద్ధమవగా కృష్ణానాయక్‌ బంధువులు అడ్డుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకోవడంతో కేశవనాయక్‌ అంత్యక్రియలు సజావుగా జరిగాయి. వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ బాలపోతన్న, మాజీ సర్పంచు యల్లప్ప తదితరులు రైతు కుటుంబాన్ని పరామర్శించి, ధైర్యం చెప్పారు.  
నోటీసులు ఇచ్చాం: 
తహసీల్దార్‌ నారాయణ 
సర్వే నంబర్‌507–2లోని 3.21 ఎకరాల భూమికి సంబంధించి ఆర్డీఓ ఉత్తర్వులు ప్రకారమే నోటీసులు ఇచ్చామని తహసీల్దార్‌ నారాయణ చెప్పారు. సాగులో కృష్ణానాయక్‌ ఉండటం వల్ల వారికే ఆన్‌లైన్‌ చేశామన్నారు. ఈ భూమిని రద్దు చేసినది తాను కాదని, గతంలో పనిచేసిన తహసీల్దార్‌ నాగరాజు అని స్పష్టం చేశారు. 

తహసీల్దార్‌ను సస్పెండ్‌ చేయాలి  
అనంతపురం న్యూసిటీ: రైతు కేశవనాయక్‌ (45) మృతికి కారణమైన ఆత్మకూరు తహసీల్దార్‌ నారాయణను తక్షణం సస్పెండ్‌ చేయాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఆదివారం సర్వజనాస్పత్రిలోని మార్చురీలో కేశవనాయక్‌ మృతదేహాన్ని ఆయన సందర్శించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. రైతు కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోస్టుమార్టం చేయవద్దని కేశవనాయక్‌ కుటుంబీకులు, వైఎస్సార్‌ సీపీ నేతలు మార్చురీలో ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ వెంకటరావ్, ఆర్డీఓ మలోల మార్చురీ వద్దకు చేరుకుని న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో శాంతించారు. అనంతరం ప్రకాశ్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు.

తమ భూమి పోతే ఇద్దరు ఆడపిల్లల పెళ్లి చేయలేనని, తనకు ఆత్మహత్యే శరణ్యమని రైతు కేశవనాయక్‌  మొరపెట్టుకున్నా తహసీల్దార్‌ కనికరం చూపలేదన్నారు. రైతు మృతికి కారణమైన తహసీల్దార్‌పై చర్యలు తీసుకుని, బాధితులకు భూమిని అప్పగించేలా చర్యలు తీసుకోకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top