రాజమండ్రిలో భవనం కుప్పకూలిన సంఘటనలో బాధితులకు ప్రభుత్వం న్యాయం చేయాలని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు డిమాండ్ చేశారు. కూలిన భవనం స్థానే కొత్తది నిర్మించడంతో పాటు మృతులు ఆంజనేయులు, జస్వంత్ కుటుంబాల కు రూ.10 లక్షల వంతున పరిహారం చెల్లించాలన్నారు
సాక్షి, రాజమండ్రి : రాజమండ్రిలో భవనం కుప్పకూలిన సంఘటనలో బాధితులకు ప్రభుత్వం న్యాయం చేయాలని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు డిమాండ్ చేశారు. కూలిన భవనం స్థానే కొత్తది నిర్మించడంతో పాటు మృతులు ఆంజనేయులు, జస్వంత్ కుటుంబాల కు రూ.10 లక్షల వంతున పరిహారం చెల్లించాలన్నారు. ఇదంతా బిల్డర్ నుం చే వసూలు చేయాలని డిమాండ్ చేశా రు. బాధితులు కేవలం వ్యాపారంపై ఆధారపడి జీవిస్తున్నారని, యజమాని మరణించడంతో ఆ కుటుంబం వీధిపాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఓ పసివాడు బలైపోయాడన్నారు. అవసరమైతే బాధితులకు మెరుగైన వైద్య సేవలు భవానీ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. విజయమ్మ దీక్షలో పాల్గొనేందుకు శుక్రవారం గుంటూరు వెళుతూ, ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల పరిస్థితిని తెలుసుకున్నారు. గురువారం ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించి, మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను కోరారు. సంఘటనపై ప్రభుత్వం పూర్తి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఇష్టారాజ్యంగా ప్రణాళికా విభాగం
నగరంలో భవన నిర్మాణాల విషయంలో నగరపాలక సంస్థ ప్రణాళికా విభాగం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని ఆదిరెడ్డి ఆరోపించారు. కౌన్సిల్ లేకపోవడంతో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటున్నారని విమర్శించారు. సంగటనపై విచారణకు విజిలెన్స్ కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు తాను చర్యలు చేపడతానని, బాధితుల పక్షాన పోరాడతానని స్పష్టం చేశారు. మరిన్ని ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా సహాయక చర్యలు చేపట్టిన పోలీసు, ఫైర్ సిబ్బందిని ఆయన అభినందించారు