స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ఎంపికలో జాప్యం కొనసాగుతూనే ఉంది...
- ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కొనసాగుతున్న జాప్యం!
- ‘బాస్’ దృష్టంతా ‘ఓటుకు నోటు’పైనే!
- నేరుగా ప్రకటించినా ఆశ్చర్యం లేదంటున్న నేతలు
సాక్షి, విజయవాడ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ఎంపికలో జాప్యం కొనసాగుతూనే ఉంది. ఎమ్మెల్సీ సీట్లు ఆశిస్తున్న నేతలంతా హైదరాబాద్‌లో మకాం వేసి తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. జిల్లాలో రెండు సీట్లకు ఎన్నికలు జరగనుండగా ముగ్గురు మధ్య ప్రధాన పోటీ నెలకొంది. దీంతో ఎవరికి ఇవ్వాలనే అంశంపై తర్జనభర్జన జరుగుతోంది.
‘బాస్’ దృష్టంతా ఓటుకు నోటుపైనే..
ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సీబీఐ నోటీసులు ఇస్తుందని ప్రచారం జరగడంతో ముఖ్యమంత్రి సహా ముఖ్య నేతలంతా ఆ వ్యవహారంలో తలమునకలయ్యారని హైదరాబాద్‌లో మకాం వేసిన పార్టీ నేతలు చెబుతున్నారు. తెలంగాణలో జరుగుతున్న పరిణామాలపై చంద్రబాబు ఇతర నేతలతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నారని, దీనివల్లే ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై అంతగా ఆసక్తి చూపడం లేదని సమాచారం. శనివారం కర్నూలు, విశాఖపట్నం జిల్లా నేతలతో మాత్రం కొద్దిసేపు మాట్లాడారని తెలిసింది.
నామినేషన్లకు ఇంకా మూడు రోజులు వ్యవధి ఉండటంతో ఈ విషయాన్ని పక్కనపెట్టి ఓటుకు నోటు వ్యవహారంపైనే సీఎం బిజిబిజీగా ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే కృష్ణాజిల్లాకు చెందిన నేతల్ని ఇప్పటివరకు పిలిచి మాట్లాడలేద ని సమాచారం. అయితే, జిల్లాపై ఆయనకు పూర్తి అవగాహన ఉండటంతో నేరుగా అభ్యర్థులను ప్రకటించినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని పార్టీ నేతలు చెబుతున్నారు. చివరి నిమిషం వరకు ఆశావహులందరి పేర్లు పరిశీలించి, సీటు ఇవ్వలేని వారితోనూ మాట్లాడిన తరువాత జాబితా ప్రకటించడం ఆనవాయితీ అని, అదేవిధంగా ఈసారీ చేస్తారని ఆ పార్టీ నేతలు పలువురు చెబుతున్నారు.