ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఆకర్షించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు,
సాక్షి ప్రతినిధి, గుంటూరు :ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఆకర్షించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు వారాంతాల్లో అనేక శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. మీ శ్రేయస్సే మాకు ముఖ్యమనే రీతిలో ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయేవరకు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మస్తాన్‌వలి పట్టణంలో ఉంటే వారంలో నాలుగైదు రోజులు భూమిపూజలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొంటున్నారు. ఐదారు రోజుల్లో ఎమ్మెల్యే ఎన్ని శంకుస్థాపనలు చేస్తారో అంత కంటే ఎక్కువగా ఒక్కరోజులోనే అధిక పనులకు మంత్రి కన్నా లక్ష్మీనారాయణ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. నవంబరు నెలలో ఒక్క రోజునే 25 వరకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి రికార్డు సృష్టించారు.
అప్పుడే అదే రికార్డు. ఆ రికార్డును ఆయనే అధిగమించి శనివారం నగరంలో 44 పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. 26, 27, 29 డివిజన్లలోసుమారు 5 కోట్ల 47 లక్షల రూపాయల విలువైన సీసీ రోడ్లు, డ్రైన్లు, కల్వర్టుల పనులకు భూమిపూజ చేశారు.కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం.. శనివారం నాటి కార్యక్రమాల్లో ప్రజలను ఉద్దేశించి మంత్రి కన్నా ప్రసంగించారు. ప్రజలవద్దకే తాను వచ్చి సమస్యలను తెలుసుకుంటున్నానని, నిరంతరం ప్రజలతో ఉండి సమస్యలను పరిష్కరిస్తున్నట్లు వెల్లడించారు. తాను ఎన్నికైన తర్వాత అనేక సమస్యలను పరిష్కరించినట్లు చెప్పారు. కార్యక్రమంలో మంత్రితోపాటు కార్పోరేషన్ ఎస్‌ఈ ఆదిశేషు, ఈఈ రామనాయక్, డీఈ రాయల్‌బాబు, ఏఈ కళ్యాణరావు, గృహనిర్మాణశాఖ డీఈ భాస్కర్, ఎలక్ట్రికల్ ఏడీఈ జె.హరిబాబు, పలువురు స్థానిక నేతలు పాల్గొన్నారు.