వైఎస్‌ శకం..విద్యకు నవయుగం

Education Is Most Prior  In YSR Government - Sakshi

సాక్షి,గుంటూరు :  ‘ప్రతి విద్యార్థి భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలి. అక్షరజ్ఞానంతో అభివృద్ధి పథంలో పయనించాలి. సమాజంలో చదువుల విప్లవం రావాలి. కార్పొరేట్‌ స్థాయి విద్య కార్మికుడి బిడ్డకు కూడా అందాలి. ప్రతిభ ముందు పేదరికం తలవంచాలి. ఇంటికో ఇంజినీర్‌ తయారవ్వాలి.. ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటాలి’.. ఇది దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆకాంక్ష.

అందుకు అనుగుణంగానే ఆయన పని చేశారు. ఈ క్రమంలోనే మొదటి సారి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో క్రోసూరుకు ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలను మంజూరు చేశారు. అంతటితో ఆగకుండా మరో అడుగు ముందుకేసి మోడల్‌ స్కూల్‌ నిర్మాణానికి సంకల్పించారు. ఎందరో విద్యా కుసుమాల ఉజ్వల భవిష్యత్తుకు శ్రీకారం చుట్టారు. ఇచ్చిన మాట ప్రకారం దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ 2009లో మండల కేంద్రంలో ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల, మోడల్‌స్కూల్, కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాల ఏర్పాటు చేశారు.

ఇప్పటికీ 9 బ్యాచ్‌ల విద్యార్థులు పాలిటెక్నిక్‌ కోర్సు పూర్తి చేసుకున్నారు. అప్పట్లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కూడా విద్యార్థులకు అందింది. అదే విధంగా పేద విద్యార్థులకు ఇంగ్లిషు మీడియంలో బోధన అందించి ప్రైవేట్‌ స్కూళ్లకు దీటుగా చదువులు అందించాలన్న కాంక్షతో 2009 లో నిధులు కేటాయించగా 2013 లో భవనాలు పూర్తిచేసుకుని పాఠశాల ప్రారంభమైంది. ప్రవేశ పరీక్షల ద్వారా ఆరవ తరగతి నుంచి ఇంటర్‌మీడియట్‌ వరకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారు.

తరగతికి 80 మంది విద్యార్థులు చొప్పున ప్రతిఏటా 650 మంది విద్యార్థులు చదువులు కొనసాగిస్తున్నారు. బాలికల హాస్టల్, కస్తూర్బాగాంధీ పాఠశాల ద్వారా ఎంతో పేద బాలికలకు చదువుకోగల్గుతున్నారు. అయితే మొత్తం అభివృద్ధిని నేనే చేశానని చెప్పుకునే టీడీపీ నాయకులు ఈ ఐదేళ్ల కాలంలో ఒక్క కొత్త విద్యాసంస్థను నెలకొల్పకపోగా,  రేషనలైజేషన్‌లో పేరుతో ఎస్సీ బాలికల సంక్షేమ వసతి గృహాన్ని మూసివేశారు.

మాలాంటి పేద విద్యార్థులకు వరం
నేను మోడల్‌ స్కూల్‌లో ఏడో తరగతి నుంచి చదువుతున్నా. ప్రస్తుతం ఇంటర్‌ రెండో సంవత్సరం. స్థానికంగా కాలేజీ ఉండటం మాలాంటి ఆడపిల్లలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రైవేట్‌ కాలేజీలో వేల రూపాయల ఫీజులు చెల్లించలేం. ఈ ఏడాది నీట్‌ కోచింగ్‌ కూడా ఇస్తున్నారు.           
– వీ వాణి, సీనియర్‌ ఇంటర్, ఎంపీసీ 

నాణ్యమైన విద్య..
మోడల్‌ స్కూల్‌ ఏర్పాటు చేసినప్పటి నుంచి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుంది. ఎందరో పేద విద్యార్థులు కార్పొరేట్‌ స్థాయి చదువులకు దగ్గరయ్యారు. విద్యార్థుల మెరిట్‌ కోసం నిరంతం కృషి చేస్తున్నాం.
– ఝాన్సీవాణి, మోడల్‌స్కూల్‌ ప్రిన్స్‌పాల్‌  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top