మాటకు కట్టుబడి

Education Department Will Conducting Badi Nadu Nedu Programme On November !4th - Sakshi

సాక్షి, నిడమర్రు(పశ్చిమ గోదావరి) : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సౌకర్యాల కల్పనపై రాష్ట్ర సర్కారు దృష్టి సారించింది. సీఎంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పట్టింది. ఆయన ఎన్నికల ముందు చెప్పిన మాటకు కట్టుబడి సర్కారు బడుల్లో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించే దిశగా ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో ‘ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి’ పాఠశాలలను తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. దీనిలో భాగంగా మన బడి ‘నాడు–నేడు’ అనే వినూత్న కార్యక్రమానికి విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. కార్యక్రమాన్ని బాలల దినోత్సవం సందర్భంగా నవంబర్‌ 14న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభిస్తారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ప్రకటించారు. ఈ మన బడి ‘నాడు–నేడు’  కార్యక్రమం అమలుకు రాష్ట్ర బడ్జెట్‌లో రూ.1,500 కోట్లు ప్రభుత్వం ఇప్పటికే కేటాయించింది. 

తొలిదశలో 1058 పాఠశాలలకు మహర్దశ
మన బడి ‘నాడు–నేడు’ కార్యక్రమం ప్రధాన లక్ష్యం ప్రభుత్వ పాఠశాలలు ప్రస్తుతం ఎలా ఉన్నాయి, నాలుగేళ్ల తర్వాత ఎలా ఉండబోతున్నాయి  అన్న విషయాన్ని ఫొటోలతో సహా ప్రజల ముందు ప్రభుత్వం ఉంచడమే. జిల్లాలో  తొలిదశలో  48 మండలాల్లో 680 ప్రాథమిక, 181 ప్రాథమికోన్నత, 197 ఉన్నత పాఠశాలలు కలుపుకొని మొత్తం1058 పాఠశాలలను విద్యాశాధికారులు ఎంపిక చేశారు. ప్రతి మండలం, గ్రామం కవర్‌ అయ్యేలా ఈ పాఠశాలల ఎంపిక జరిగింది. ఈ 1058 పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించే కార్యనిర్వహణ బాధ్యతలను గిరిజన సంక్షేమశాఖ, సాంఘిక సంక్షేమశాఖ, సర్వశిక్ష అభియాన్‌ ఇంజినీరింగ్‌ అధికారులకు ప్రభుత్వం కేటాయించింది. ఆయా శాఖలు తొలిదశలో ఎంపిక చేసిన పాఠశాలల్లో ప్రతిపాదించిన సౌకర్యాలు, నిర్మాణ పనులు, వచ్చే ఏడాది మార్చిలోపు పారదర్శకంగా పూర్తి చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. 

తొమ్మిది అంశాలపై దృష్టి..
మన బడి నాడు– నేడు కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో 9 రకాల మౌలిక వసతులను అధికారులు పరిగణనలోకి తీసుకోనున్నారు. మరుగుదొడ్ల నిర్మాణం, విద్యుత్‌ సౌకర్యం, తాగునీటి వసతి, పెయింటింగ్, మేజర్, మైనర్‌ మరమ్మతులు చేపట్టడం, బ్లాక్‌ బోర్డు ఏర్పాటు, అదనపు తరగతి గదుల నిర్మాణం, పాఠశాలల చుట్టూ పక్కా ప్రహరీల నిర్మాణంపై దృష్టి పెట్టాలని  ఇంజినీరింగ్‌ అధికారులకు సూచించింది. ఇప్పటికే ఈ కార్యక్రమంలో భాగంగా ఎంపిక చేసిన పాఠశాలల ప్రస్తుత  మౌలిక వసతులపై విద్యాశాఖా«ధికారుల స్కూల్‌ ఇన్ఫర్మేషన్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం యాప్‌లో ఫొటోల రూపంలో నిక్షిప్తం చేశారు. 

పేరెంట్‌ కమిటీ సమక్షంలో నిర్ణయం
మన బడి నాడు–నేడు కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఉంగుటూరు నియోజకవర్గంలో 4 మండలాల్లో 81 పాఠశాలలను ఈ కార్యక్రమం కింద ఎంపిక చేశాం. ఆయా పాఠశాలల్లో అవసరమైన మౌలిక వసతులపై పేరెంట్‌ కమిటీ, గ్రామ పెద్దల సమక్షంలో సమీక్షించి ప్రదిపాదించాలని సూచించాం. పనులు వారి సమక్షంలోనే పారదర్శకంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.       – పుప్పాల శ్రీనివాసరావు, ఎమ్మెల్యే, ఉంగుటూరు

ప్రతి మండలం, గ్రామం భాగస్వామ్యం
జిల్లాలోని ప్రతి మండలం, గ్రామాన్ని ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసేలా పాఠశాలలను పరిగణనలోకి తీసుకున్నాం. ఇప్పటికే ఎంపిక చేసిన పాఠశాలల వారీగా సమస్యల ఫొటోలు విద్యాశాఖ సిబ్బంది ఫొటోల రూపంలో యాప్‌లో అప్‌లోడ్‌ చేశారు. ఈ కార్యక్రమంపై విధివిధానాలు ఇంజినీరింగ్‌ విభాగాల అధికారులకు అందాల్సి ఉంది.        
– జి.అప్పలకొండ, ఏఈ, ఏపీఈడబ్లూఐడీసీ

ప్రభుత్వ పాఠశాలలకు మంచిరోజులు
రాష్ట్ర సర్కారు విద్యాశాఖలో తీసుకుంటున్న చర్యలతో ప్రభుత్వ పాఠశాలలకు మంచిరోజులు వచ్చినట్లే. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయించిన రూ.1,500 కోట్లు ఖర్చు చేస్తే మన బడి ‘నాడు–నేడు’ కార్యక్రమం తప్పనిసరిగా విజయవంతం అవుతుంది. మౌలిక వసతులతోపాటు ఖాళీగా ఉన్న పోస్టుల్లో ఎప్పటికప్పుడు తాత్కాలికంగా  విద్యా వలంటీర్ల నియామకాలు చేపట్టాలి.            
– పి. వెంకటేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు, పీఆర్టీయూ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top