పట్టణంలోని శ్రీవేణుగోపాలస్వామి ఆలయ ఆవరణలో ఉన్న టీటీడీ కల్యాణ మండపంలో ఆదివారం బాల్య వివాహం ...
అడ్డుకున్న పోలీసులు
వారు వెళ్లిన తర్వాత యథాప్రకారం పెళ్లి
కార్వేటినగరం : పట్టణంలోని శ్రీవేణుగోపాలస్వామి ఆలయ ఆవరణలో ఉన్న టీటీడీ కల్యాణ మండపంలో ఆదివారం బాల్య వివాహం చేశారు. తమిళనాడు రాష్ట్రంలోని తిరువళ్లూరు జిల్లాకు చెందిన కే.ఎం.నారాయణ(26)కు శ్రీపొట్టిశ్రీరాములు జిల్లా వెంకటగిరి మండలం బాలసముద్రం గ్రామానికి చెందిన లీలావతి(16)కి కార్వేటినగరంలోని టీటీడీ కల్యాణ మండపంలో పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు అక్కడికి చేరుకున్నారు.
బాల్య వివాహం నేరమని తెలపడంతో ఆపేస్తున్నట్టు బంధువులు తెలపడంతో పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తరువాత టీటీడీ సిబ్బంది సూచనల మేరకు పెళ్లి కుమార్తె ఆధార్ కార్డులో పుట్టిన తేదీని మార్పించి ఆదివారం 2.30 గంటలకు నిర్ణయించిన ముహూర్తానికి గంట ముందే వివాహాన్ని జరిపించారు. వరుడు పోలీస్ శాఖలో పనిచేస్తున్నట్టు తెలిసింది. వరకట్నం కోసం బాల్యవివాహం చేసుకున్నట్లు సమాచారం. శ్రీవేణు గోపాలస్వామి ఆలయంలో పనిచేసే సిబ్బంది కూడా ఈ వివాహానికి సహకరించడం దారుణమని స్థానికులు వాపోయారు.
ఆలయంపై ఉన్నతస్థాయి అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే కింది స్థాయి సిబ్బంది ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. గతంలో కూడా ఇక్కడి కల్యాణ మండపంలో బాల్య వివాహం చేస్తుంటే ఐసీడీఎస్ అధికారిణి అడ్డుకున్నారు. కల్యాణ మండపాన్ని అద్దెకు ఇచ్చే సమయంలో అధికారులు వధూవరుల వయస్సు ధ్రువీకరణ పత్రాలను చూడడం లేదని తెలుస్తోంది. ఇప్పటికైనా టీటీడీ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.