
పెళ్లికి ముస్తాబైన రామలింగేశ్వరుడు
యనమలకుదురులోని రామలింగేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి.
యనమలకుదురు(పెనమలూరు),న్యూస్‌లైన్ : యనమలకుదురులోని రామలింగేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. వచ్చే నెల ఒకటో తేదీ వరకు ఈ ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. తొలిరోజు బుధవారం శ్రీరామలింగేశ్వరస్వామి, పార్వతి అమ్మవారిని కల్యాణమూర్తులుగా అలంకరించారు. ఉత్సవ విగ్రహాలకు విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిపించి, పట్టు వస్త్రాలతో అలంకరించారు. రాత్రి విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవచనం, దీక్షాధారణ, అఖండస్థాపన, మృత్యంగ్రణము, అంకురార్పణ, మండపారాధన, అగ్నిప్రతిష్ఠాపన, ధ్వజావరోహణ, బలిహరణ తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
పూలతోరణాలతో అలంకరణ
మహాశివరాత్రిని పురస్కరించుకొని ఆలయాన్ని పూలతోరణాలతో అందంగా అలంకరిస్తున్నారు. ఇందుకోసం గ్రామ శివారులో పెంచుతున్న పూదోట నుంచి పెద్ద ఎత్తున బంతి పూలను ఆలయానికి తరలించారు. ఆలయానికి, దేవతామూర్తులకు అలంకరించేందుకు పూలదండలను తయారుచేస్తున్నారు. పార్వతీపరమేశ్వరుల కల్యాణాన్ని తిలకించేందుకు గురువారం పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు.
శివరాత్రి పుణ్యస్నానాలకు ఏర్పాట్లు పూర్తి
విజయవాడ : మహా శివరాత్రిని పురస్కరించుకుని కృష్ణానదిలో పుణ్యస్నానాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. వేలాదిగా భక్తులు తరలిరానుండటంతో తోపులాట జరగకుండా ఉండేందుకు స్నానఘాట్ల వద్ద పటిష్టంగా బారికేడ్లు నిర్మించారు. మరో వైపు జల్లు స్నానాలు చేసేందుకు కూడా అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు దుర్గగుడి అధికారులు తెలిపారు.
వైభవంగా శివరాత్రి ఉత్సవాలు
పెదకళ్లేపల్లి (మోపిదేవి) : స్థానిక దుర్గానాగేశ్వరస్వామి ఆలయంలో శివరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామికి బుధవారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రి శేషవాహనంపై స్వామిని ఊరేగించారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గురువారం కృష్ణానదిలో ఫుణ్యస్నానాలు చేసే భక్తులకు కల్పించే సౌకర్యాలను అవనిగడ్డ డీఎస్పీ హరిరాజేంద్రబాబు ఆలయ ఏసీ వి.వి.ఎస్.కె.ప్రసాద్, పోలీస్ అధికారులతో బుధవారం సమీక్ష జరిపారు. అనుమతి లేనిచోట్ల భక్తులు నదిలో దిగకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులు అధికారులకు సూచించారు.
భారీ పోలీస్ బందోబస్తు
మహాశివరాత్రికి పెద్ద ఎత్తున తరలివచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని భారీ పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నామని అవనిగడ్డ డీఎస్పీ హరిరాజేంద్రబాబు తెలిపారు. నలుగురు సీఐలు, 11 మంది ఎస్‌ఐలు, 20 మంది ఏఎస్‌ఐలు, 61 మంది కానిస్టేబుళ్లు, 53 మంది హోంగార్డులు, 13 మంది మహిళా హోంగార్డులు, స్క్వాడ్ బృందం 18 మందితో బందోబస్తు నిర్వహిస్తామని పేర్కొన్నారు. సర్పంచి అరజా వెంకటసుబ్బారావు, వీఆర్వో ఎ.వెంకటేశ్వరావు, పంచాయతీ కార్యదర్శి భాస్కరావు పాల్గొన్నారు.