కమిషన్‌ల కక్కుర్తి!

Doctors Not Write Generic Medicine In Prescriptions At Ongole - Sakshi

రోగులకు జనరిక్‌ మందులు రాయని డాక్టర్లు

ఫారెన్‌ ట్రిప్పులతో వైద్యులను బుట్టలో వేస్తున్న డ్రగ్‌ కంపెనీలు

ఎంసీఐ నిబంధనలన్నా లెక్క లేదు

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: వైద్యో నారాయనో హరిః.. అన్న నమ్మకం పోయి వైద్యుల వద్దకు వెళ్తే ప్రాణాలు హరీ మనక తప్పదనే రీతిలో వ్యవహరిస్తున్నారు కొందరు వైద్యులు. ప్రత్యక్ష దైవంగా భావించే వైద్యులే కమిషన్‌లకు కక్కుర్తిపడి పనికిరాని కంపెనీలకు చెందిన మందులను రోగులకు అంటగడుతూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. చివరకు కార్పొరేట్‌ వైద్యశాలల్లో సైతం పనికిరాని మందులను తమ సొంత మెడికల్‌ షాపుల్లో ఉంచి వాటినే ప్రిస్కిప్షన్‌లో రాస్తుండటంతో చేసేదిలేక ప్రజలు వీటినే వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీళ్లురాసే కంపెనీల మందులు బయట ఎక్కడా దొరక్కుండా జాగ్రత్త పడుతుండటంతో రోగులు అధిక ధరలకు వారి వద్దే కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొంది.  మంచి కంపెనీల మందుల కంటే నాసిరకం మందుల కంపెనీలు వైద్యులకు అధిక కమీషన్లు ఎరగా చూపి తమ వ్యాపారాలను పెంచుకుంటున్నారు.

రోగుల ప్రయోజనాలను పక్కన బెట్టి ధనార్జనే ధ్యేయంగా తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. చివరకు ల్యాబ్‌లు, స్కానింగ్‌ సెంటర్‌ల వద్ద కూడా కమీషన్లకు అలవాటు పడ్డారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. కొందరు వైద్యులు కనీస సౌకర్యాలు కూడా లేని ల్యాబ్‌లు, స్కానింగ్‌ సెంటర్‌లకు రోగులను పంపుతుండటంతో వ్యాధి నిర్ధారణ కూడా సరిగా చేయడం లేదనే ఆరోపణలు వినవస్తున్నాయి. దీంతో ఏదో ఒకటి రాసి వీరు పంపడం అది చూసి తూతూమంత్రంగా మందులు రాసివ్వడం కొందరు వైద్యులకు నిత్యకృత్యంగా మారింది. అసలు వ్యాధి నిర్ధారించలేక పోవడంతో జబ్బు తగ్గక రోగులు ఆసుపత్రుల చుట్టూ ఏళ్ల తరబడి తిరగాల్సి వస్తోంది. దీనికితోడు వైద్యులకు కమీషన్‌లు ఇవ్వాలనే కారణంతో ల్యాబ్‌లు, స్కానింగ్‌ సెంటర్ల నిర్వాహకులు ఆ భారాన్ని కూడా రోగులపై మోపుతుండటంతో ఆసుపత్రులకు వెళ్లాలంటే హడలిపోతున్నారు.

జనరిక్‌ మందుల ఊసే ఎత్తని వైద్యులు..
రోగులకు అయ్యే వైద్యం ఖర్చులో 60 శాతం వరకూ మందులే ఉంటాయి. అలాంటి మందుల భారాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జనరిక్‌ మందుల దుకాణాలను ప్రవేశపెట్టింది. ఈ మందులను రోగులకు అలావాటు చేసి ఆర్ధిక భారాన్ని తగ్గించాలని వైద్యులకూ సూచించింది. ఒంగోలు నగరంలో కూడా నాలుగైదు జనరిక్‌ మందుల దుకాణాలు ఉన్నప్పటికీ ఇక్కడి వైద్యులు మాత్రం వీటి ఊసే ఎత్తడం లేదు. జనరిక్‌ మందులను రాయడం వల్ల తమకు ఒరిగేదేమీ లేకపోవడంతో వాటిని రోగులకు రాయకపోగా ఎవరైనా అడిగినప్పటికీ అవి పని చేయవంటూ చెప్పడం చూస్తుంటే వీరు ఏ స్థాయికి దిగజారారో అర్ధం చేసుకోవచ్చు. కంపెనీ ప్రతినిధులు తమ మందులను రోగులకు రాయడంతో వైద్యులకు ఆరునెలలు లేదా ఏడాదికొకసారి కమీషన్లను వారి బంధువుల పేరుతో ఖాతాల్లో జమ చేస్తున్నారు.

రోగులకు నాసిరకం మందుల కంపెనీలను అంటగడుతూ ప్రతిఫలంగా కొందరు వైద్యులు ఫ్యామిలీలతో ఫారెన్‌ ట్రిప్పులకు వెళ్తుండటం చూస్తుంటే మందుల కంపెనీలు వైద్యులను బుట్టలో వేసుకున్నారని చెప్పకనే చెప్పవచ్చు. ఇంతే కాకుండా వైద్యులకు ప్రతి నెలా ఖరీదైన బహుమతులు కూడా అందిస్తున్నారనే ఆరోపణలు వినపడుతున్నాయి. మందుల కంపెనీల వద్ద కమీషన్‌లు తీసుకుని రోగులకు ఆ కంపెనీ మందులను అంటగట్టే సంస్కృతి అనైతికమని ఇలాంటి చర్యలను ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని ఎంసీఐ హెచ్చరికలు కూడా జారీ చేసింది. అయితే ఇవేమీ అవినీతి వైద్యుల చెవికెక్కడం లేదు. ఇప్పటికైనా వైద్యులు ఆలోచించి రోగుల ప్రాణాలతో చెలగాట మాడటం మానుకోవాలని పలువురు కోరుతున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top