ప్రజలపై భారం మోపొద్దు: సీఎం జగన్

Do not Burden The Common Man, Says YS Jagan - Sakshi

రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే దిశగా చర్చలు

సాక్షి, తాడేపల్లి : కుదేలైన రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను మార్చేందుకు అందరు ఆర్ధిక క్రమశిక్షణ పాటించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. అస్తవ్యస్థంగా ఉన్న రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి చక్క దిద్దడానికి సృజనాత్మక ఆలోచన విధానాలతో రావాలని ఆయన కోరారు. ఆర్థిక, రెవెన్యూ శాఖలపై తాడేపల్లిలోని తన నివాసంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే దిశగా 15వ ఆర్ధిక సంఘం ముందు సమర్థవంతంగా ఆంధ్రప్రదేశ్ తన వాదన వినిపించాలని, రాష్ట్ర ఆర్ధిక స్థితిగతులను, రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్ధిక సమస్యలను వివరిస్తూ సమగ్రమైన నివేదిక తయారు చేసి ప్రత్యేక హోదా ఎందుకు అవసరమో కేంద్రానికి వివరించాలని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

ఆర్ధిక పరిస్థితిని మరింత మెరుగు పరిచేలా చర్యలు వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. అయితే సామాన్యునిపై భారం పడకుండా రాష్ట్ర ఆదాయ వనరుల పెంపునకు ప్రణాళికలు రూపొందించాల్సిందిగా అధికారులకు సూచనలు చేశారు. ఈ దిశగా హరిత పన్ను (గ్రీన్ టాక్స్), వ్యర్థ పదార్థాలపై పన్ను, ఎర్ర చందనం అమ్మకం, తక్కువ వడ్డీకే రుణాలు పొందడం, సరయిన ఇసుక విధానం అమలు  వంటి చర్యలు ద్వారా ఆదాయాన్ని పెంచే యోచన చేయాలన్నారు.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

దశలవారీగా మద్యపాన నిషేధం
ఎక్సైజ్ శాఖపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, కేవలం ప్రత్యేక ఆదాయ వనరులుగా చూడకూడదని, ప్రతి పేదవారిలోనూ ఆనందం వెల్లివిరిసేందుకు బెల్ట్ షాపులను సమూలంగా తొలగించాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ఆదేశించారు. అవసరమైన పక్షంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడిపి బెల్ట్ షాప్‌ల వ్యవస్థను నిర్ములించాలని సూచించారు. ఎక్కడయినా బెల్ట్ షాప్ కనిపిస్తే.. దానిపై చర్యలు తీసుకుంటూనే, దానికి మద్యం సరఫరా చేసిన వైన్ షాప్ లైసెన్స్ రద్దు చెయ్యాలని ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడ అక్రమాలు జరిగినా మరింత కఠినతరమైన నిబంధనలు అమలు చేయాలని, దశల వారి మద్యపాన నిషేధం అమలులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా చైతన్యం, అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు.

కాగా కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వ గ్యారంటీ పెట్టి, అప్పులు తీసుకుని, వాటిని దారి మళ్లించిన వైనాన్ని చూసి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నివ్వెరపోయారు.  ఎన్నికల ముందు గత ప్రభుత్వం రాష్ట్ర ఖజానాను రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసం ఇష్టానుసారంగా వాడేసుకున్న విషయం తెలిసిందే. ఈ సమీక్ష సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లాం, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సాంబశివరావు, పీవీ రమేష్, ముఖ్య కార్యదర్శి ఎస్‌ ఎస్‌ రావత్, ఆర్థిక శాఖ కార్యదర్శి ముద్దాడ రవిచంద్, ముఖ్యమంత్రి కార్యదర్శి ఆరోఖ్య రాజ్, అదనపు కార్యదర్శి కె.ధనంజయ రెడ్డి పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top