ఖరీఫ్ సాగుకు అదను దాటిపోతున్నా వర్షం పడలేదు. విత్తడానికి సిద్ధం చేసుకున్న సబ్సిడీ విత్తన వేరుశనగకు ఊజీ సోకే ప్రమాదం కనిపించడంతో రైతులు విధిలేని పరిస్థితుల్లో వ్యాపారులకు విక్రయిస్తున్నారు.
మడకశిర రూరల్ : ఖరీఫ్ సాగుకు అదను దాటిపోతున్నా వర్షం పడలేదు. విత్తడానికి సిద్ధం చేసుకున్న సబ్సిడీ విత్తన వేరుశనగకు ఊజీ సోకే ప్రమాదం కనిపించడంతో రైతులు విధిలేని పరిస్థితుల్లో వ్యాపారులకు విక్రయిస్తున్నారు. మడకశిర మండలం తిరుమదేవరపల్లి, గౌడనహ ళ్ళి, ఆమిదాలగొంది, చందకచర్ల, హరేసముద్రం, మెళవాయి తదితర గ్రామాల రైతులు లక్ష్మీనరసప్ప, అంజినప్ప, తిప్పేనాయక్ తదితరులు అయినకాడికి అమ్ముకున్నారు. వేరుశనగ విత్తనాలు విక్రయించినా పెట్టుబడి కూడా రాలేదని వాపోయారు. అదను దాటిన తర్వాత వచ్చే వర్షానికి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేస్తే కనీసం పశుగ్రాసమైనా దొరుకుతుందన్నారు.
ప్రభుత్వం ఆదుకోవాలి
వర్షం రాకపోవడంతో వేరుశనగ పంట సాగుకు సిద్ధం చేసుకున్న 50 కేజీల విత్తనాలను వ్యాపారస్తులకు విక్రయిస్తున్నాం. ఈ ఏడాది జీవనం సాగించడం కష్టతరంగా ఉంది. ఖరీఫ్ సాగుకు అదను దాటిపోయింది. ఇప్పుడే పడే వర్షానికి వేరుశనగ సాగు చేస్తే దిగుబడి రాదు. ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి ఆదుకోవాలి.
- తిప్పేనాయక్, రైతు, టీడీ పల్లి
4 వరకు వేరుశనగ సాగు
ఆగస్టు 4వ తేదీ వరకు వేరుశనగ పంట సాగు చేసుకోవచ్చు. అప్పటికీ వర్షం రాకపోతే ఐదో తేదీ తర్వాత 50 శాతం సబ్సిడీపై ప్రత్యామ్నాయ పంటల సాగుకు విత్తనాలు పంపిణీ చేస్తాం. రైతులెవరూ ఆందోళన చెందవద్దు.
- పెన్నయ్య, వ్యవసాయాధికారి, మడకశిర