ఇళ్ల పట్టాల పంపిణీ నిలుపుదల

Distribution of Housing Patta Was Stopped Until the local body elections are over - Sakshi

స్థానిక ఎన్నికలు పూర్తయ్యే వరకు నిలిపివేయాలన్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌

ఈనెల 7న ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చిన నేపథ్యంలో నిర్ణయం

సాక్షి, అమరావతి: పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు నిలుపుదల చేయాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఎన్‌.రమేశ్‌కుమార్‌ శనివారం కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఉగాది రోజు రాష్ట్ర వ్యాప్తంగా 26 లక్షలకు పైగా పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకి ప్రభుత్వం సమాయత్తమైన విషయం తెలిసిందే. దీనికోసం అధికారయంత్రాంగం చకచకా ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తనా నియావళి (కోడ్‌) ఈనెల 7న అమలులోకి వచ్చిన నేపథ్యంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని నిలుపుదల చేయాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశించింది.  

ఎన్నికల ప్రక్రియలోనే అధికారులు.. 
- ఇళ్ల స్థలాల పంపిణీ ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందని, కోడ్‌ నియావళి ప్రకారం ఈ కార్యక్రమాన్ని అనుమతించలేమని తమ ఆదేశాల్లో ఎన్నికల కమిషనర్‌ పేర్కొన్నారు.  
- ఈ విషయంపై హైకోర్టులోనూ కేసులు దాఖలు అయ్యాయని, ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు.  
- తమ పరిధిలో ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించి అన్ని చర్యలు నిలుపుదల చేయాలని కలెక్టర్లను ఆదేశించారు.  
ఎన్నికలు పూర్తయ్యే వరకు అధికారులందరినీ ఆ ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యం చేస్తున్నామన్నారు.  
జిల్లా కలెక్టర్లు, ఇతర జిల్లా స్థాయి ఎన్నికల అధికారులు, పరిశీలకులు తమ ఆదేశాలు తప్పనిసరిగా పాటించాలని రమేశ్‌కుమార్‌ పేర్కొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top