రైతన్న దైన్యం | Sakshi
Sakshi News home page

రైతన్న దైన్యం

Published Tue, Mar 10 2015 1:57 AM

Dine raitanna

నెల్లూరు(అగ్రికల్చర్): కొనబోతే కొరివి..అమ్మబోతే అడవి..అన్నట్లు తయారైంది. రబీలో వరి పండించిన రైతుల పరిస్థితి. వరుస వైపరీత్యాలు..ఎరువులు, విత్తనాల సమస్యలు..రుణాలు రీషెడ్యూల్ కాక తలెత్తిన ఆర్థిక ఇబ్బందులు..ఇలా ఎన్నో అవరోధాలను అధిగమించి ఆరుగాలం శ్రమించి వరి పండించిన రైతు చివరకు ధర విషయంలోనూ దగాకు గురవుతున్నారు.

లేవీ సేకరణ నిబంధనలను ప్రభుత్వం మార్చేయడం..ధాన్యం కొనుగోలుకు మిల్లర్లు ముందుకు రాకపోవడం..ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు చాలాచోట్ల పూర్తిస్థాయిలో ప్రారంభం కాకపోవడంతో ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ఎక్కడా లభించడం లేదు. దిగుబడులు తగ్గిన నేపథ్యంలో కనీస మద్దతు ధరైనా లభిస్తే కొంతలో కొంతైనా గట్టెక్కవచ్చన్న అన్నదాత ఆశలు హరించుకుపోతున్నాయి.
 
దిష్టిబొమ్మల్లా కొనుగోలు కేంద్రాలు
జిల్లాలో పలు ప్రాంతాల్లో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా ఎక్కడా కొనుగోళ్లు జరగడం లేదు. పైగా సవాలక్ష నిబంధనలు పెట్టడంతో ప్రభుత్వం కేంద్రాల వైపు రైతులు మొగ్గుచూపడం లేదు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సొమ్మును రైతుకు నేరుగా ఇవ్వకుండా ఆన్‌లైన్‌లో బ్యాంకులో వేస్తున్నారు. బ్యాంకు అధికారులు ధాన్యం సొమ్మును పాత రుణాలకు జమ చేసుకుంటుండటంతో రైతులు పరిస్థితి దయనీయంగా తయారైంది. దీంతో కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చేందుకు రైతులు వెనకడుగు వేస్తున్నారు. వచ్చిన కాడికి చాలు అనుకుంటూ కళ్లాలోనే ధాన్యం తెగనమ్ముకుంటున్నారు. ఇదే అదునుగా మిల్లర్లు, ప్రైవేటు వ్యాపారులు తక్కువ ధరకు కొంటూ రైతులను నిలువునా దోచేస్తున్నారు.
 
అరకొరగా కొనుగోళ్లు
జిల్లాలో కొనుగోలు కేంద్రాల ద్వారా 1.219 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ధేశించగా ఇప్పటివరకు 15 కేంద్రాల ద్వారా 1,253 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేయగలిగారు. 109 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసినప్పటికి 94 కేంద్రాల్లో కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. ఇంకా చాలా చోట్ల కేంద్రాలే తెరచుకోలేదు.
 
లభించని మద్దతు ధర.. రైతులకు మద్దతు ధర దక్కెలా చర్యలు చేపడుతున్నట్లు ప్రభుత్వం ఆర్భాటం చేసింది. ఏ గ్రేడు క్వింటాలు రూ.1400, సాధారణ రకం రూ.1360 మద్దతు ధరగా ప్రకటించారు. 150 కొనుగోలు కేంద్రాలకుగానూ 15 మాత్రమే ప్రారంభమయ్యాయి. వాటిలోనూ కొనుగోళ్లు సాగడం లేదు. ఇదే అదనుగా దళారులు మద్దతు ధర కంటే తక్కువకు కొనుగోళ్లు చేస్తున్నారు.
 
అన్నీ సమస్యలే.. కొనుగోలు కేంద్రాలపై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడం లేదు. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్తే నాణ్యత పరీక్షల పేరుతో సవాలక్ష వంకలు పెడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. రైతులు ముందుగా నాణ్యత పరీక్షల కోసం రెండు, మూడు కేజీల ధాన్యాన్ని తీసుకువెళ్లాల్సి ఉంటుంది. అందులో తేమ శాతం, రాళ్లు, మట్టిగడ్డలు, చెత్త, తాలు, కల్తీగింజలు, తదితర కారణాలతో ధరను తగ్గిస్తున్నారు.

కొనుగోలు కేంద్రాలకు అవసరమైన తేమశాతం నిర్ణయించే మిషన్, కాటాలు, తూకం రాళ్లు, ప్యాడీ క్లీనర్లు, క్లాలీపర్స్, జల్లెడలు, గోతాలను అందుబాటులో ఉంచాలి. అయితే వీటిని కూడా రైతులే తీసుకొని రావాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు గ్రామాల నుంచి కేంద్రాలకు ధాన్యం తరలించేందుకు రవాణా, కూలీల ఖర్చులు రైతులే భరించాల్సి వస్తోంది. అలాగే బ్యాంకు ఖాతా వివరాలు, భూమి సర్వే నంబర్, విస్తీర్ణం వివరాలతో కూడిన అడంగల్, పట్టాదారు పాసుపుస్తకం, రుణ అర్హత కార్డు వంటి వాటి జెరాక్సు కాపీలు అందజేయాల్సి ఉంది. దీంతో రైతు మొగ్గుచూపడం లేదు. దళారులకు ధాన్యం అమ్మి నష్టపోతున్నాడు.

Advertisement
 
Advertisement
 
Advertisement