కార్తీక పౌర్ణమికి తీరంలో సౌకర్యాలు కల్పించండి

Deputy Speaker Kona Raghupathi Conducted Meeting Over Karthika Pournami In Guntur  - Sakshi

సాక్షి, బాపట్లటౌన్‌(గుంటూరు): కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని తీరానికి చేరుకునే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి ఆదేశించారు. కార్తీకపౌర్ణమి ఏర్పాట్లపై ఆదివారం సాయంత్రం తీరంలోని హరితా రిసార్ట్‌ ఆవరణంలో అన్నిశాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్‌ మాట్లాడుతూ  సూర్యలంక తీరానికి సుమారు 3 లక్షల మేర పర్యాటకులు, భక్తులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. భక్తుల రాకపోకలకు, స్నానాలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.  

ప్లాస్టిక్‌ నివారణపై ప్రత్యేక దృష్టి 
కార్తీక పౌర్ణమి రోజున తీరంలో తాగు నీటి ప్యాకెట్లు వాడరాదన్నారు. ట్యాంకర్లు, డ్రమ్ముల సాయంతో తాగునీటి స్టాల్స్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. కార్తీకమాసంలో ప్రతి శని, ఆది, సోమవారాల్లో రోజుకు 40 వేల మందికిపైగా తీరానికి వస్తుంటారని, పారిశుద్ధ్యం మెరుగుకు మున్సిపాల్టీ పరిధిలోని రెండు ట్రాక్టర్లు, ఆటోలు, 50 మంది శానిటరీ సిబ్బందిని వినియోగించాలని చెప్పారు.  

ఏర్పాట్లపై కలెక్టర్‌ ఆరా 
తీరంలో దుస్తులు మార్చుకునేందుకు 150 తాత్కాలిక షెడ్లు, తీరం వెంబడి సామాన్లు భద్రపరుచుకునేందుకు 20 టెంట్లు ఏర్పాటు చేయాలని  మంచినీరు, విద్యుత్‌ సరఫరా సక్రంగా ఉండాలని సిబ్బందిని ఆదేశించారు. తీరంలో 100 మంది గజ ఈతగాళ్లు, 20 ఇంజన్‌ బోట్లను అందుబాటులో ఉంచాలన్నారు. పట్టణ, మండలంలోని వైద్యాధికారులు తీరం వెంబడి మెడికల్‌ క్యాంపును ఏర్పాటు చేసి 108, 104 వాహనాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్‌ శాఖను ఆదేశించారు. 15 బస్సులకు తగ్గకుండా తీరానికి సర్వీసులు నడపాలని ఆర్టీసీని అధికారులకు సూచించారు.  

పట్టణంలోని వివిధ కళాశాలల నుంచి 200 మంది ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ వలంటీర్ల సాయం తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సబ్‌ కలెక్టర్‌ దినేష్‌కుమార్, పంచాయతీ డీఈ బాపిరెడ్డి, సీఈవో చైతన్య, తహసీల్దార్‌ కే శ్రీనివాస్, ఎంపీడీవో ఏ రాధాకృష్ణ, డిప్యూటీ తహసీల్దార్‌ శ్రీచరణ్, సీఐలు కే శ్రీనివాసరెడ్డి, అశోక్‌కుమార్, ఎస్‌ఐలు ఎం సంధ్యారాణి, హజరత్తయ్య, ఆర్‌అండ్‌బీ డీఈ పీ లక్ష్మీనారాయణ, ఆర్టీసీ డీఎం పెద్దన్నశెట్టి, విద్యుత్‌ శాఖ ఈఈ హనుమయ్య, ఏఈలు పెరుగు శ్రీనివాసరావు, కిరణ్‌ పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top