అవినీతిరహిత పాలనే లక్ష్యం : డిప్యూటీ సీఎం

Deputy Cm Amjad Basha On Zp Meeting In Kadapa - Sakshi

సాక్షి, కడప : రాష్ట్రంలో అవినీతి రహిత పాలన అందించడమే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యంగా సాగుతున్నారని, అందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సహకరించాలని డిప్యూటీ సీఎం ఎస్‌బి అంజద్‌బాషా పేర్కొన్నారు. కడపలోని జెడ్పీ సమావేశ మందిరంలో ఆదివారం జిల్లా పరిషత్తు సర్వసభ్య చివరి సమావేశం జరిగింది. జెడ్పీ చైర్మన్‌ గూడూరు రవి అధ్యక్షతన సీఈఓ నగేష్‌ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. సభ ప్రారంభంలో జిల్లాకు విశిష్ట సేవలు అందించిన మాజీ ఎంపీ దివంగత నేత వైఎస్‌ వివేకానందరెడ్డి మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు.

అనంతరం నూతనంగా ఎంపికైన వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులు సభకు పరిచయం చేసుకోవాలని చైర్మన్‌ కోరగా అందరం పాత వాళ్లమే కదా అన్నారు. ఇందులో ఎమ్మెల్సీలు వెన్నపూస గోపాల్‌రెడ్డి, శివనాధరెడ్డి సభకు పరిచయం చేసుకున్నారు. తర్వాత నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను జిల్లా పరిషత్తు చైర్మన్‌ గూడూరు రవి, వైస్‌ చైర్మన్‌ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, జిల్లా కలెక్టర్‌ హరికిరణ్, జేసీలు శివారెడ్డి, గౌతమిలు సన్మానించారు. అనంతరం సభనుద్దేశించి డిప్యూటీ సీఎం అంజద్‌బాషా మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ వైఎస్సార్‌సీపీకి బ్రహ్మరథం పట్టారని, 151 మంది ఎమ్మెల్యేలను, 23 మంది ఎంపీలను గెలిపించారని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టి 30 రోజులైందని చెప్పారు. రాష్ట్రంలో అవినీతి రహిత పాలన అందించడమే లక్ష్యంగా సాగుతున్నారని వివరించారు. అన్ని కార్యాలయాల్లో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారన్నారు. ఆయనకు ప్రజాపత్రినిధులు, అధికారులు సహాయ సహకారాలు అందించాలని కోరారు.

మేనిఫెస్టోలో పొందుపరిచిన నవతర్నాల్లో భాగంగా జులై 2 నుంచి వృద్ధులకు పెన్షన్, ఆశ, అంగన్‌వాడీల జీతాలను పెంచి అమలు చేయనున్నారని తెలిపారు. రాష్ట్రంలో నూతన పద్ధతి ద్వారా 50 ఇళ్లకు ఒక వలంటీరు చొప్పున 4 లక్షల మంది యువతి, యువకులను గ్రామ వలంటీర్లను ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. అలాగే రాష్ట్రంలో గ్రామ సెక్రటేరియట్‌ వ్యవస్థను ఏర్పాటు చేసి రెండు వేల జనాభా ఉన్న ప్రతి చోట ఒక సెక్రటరీని నియమించి నిరుద్యోగ వ్యవస్థను తొలగించనున్నారన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన ప్రతి ఒక్కరూ ఉన్నత విద్యను చదువుకోవాలనే ఉద్దశ్యంతో అమ్మ ఒడి పథకం ప్రవేశపెట్టినట్లు, ఆగస్టు 15న ఈ కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించనున్నట్లు తెలిపారు. 2019 కంటే ముందు అధికారంలో ఉన్న ప్రభుత్వం రైతులను పూర్తిగా విస్మరించిందన్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి రైతులను ఆదుకున్నారని వివరించారు. తండ్రి అడగుజాడల్లోనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రైతు బరోసా పథకం ద్వారా ప్రతి రైతుకు రూ. 12,500 అందించనున్నట్లు చెప్పారు. వీటితోపాటు నవరత్నాల్లోని అన్ని సంక్షేమ పథకాలను గ్రామవాంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి అందించన్నారన్నారు.

మంత్రులు, అధికారుల కార్యాలయాల్లో మేనిఫెస్టో టేబుల్‌పై ఉండాలని అన్నారు. ప్రభుత్వ విప్‌ కొరముట్ల శ్రీనివాస్‌ మాట్లాడుతూ జిల్లాను ప్రగతి పథకంలో నడిపించేందుకు అందరూ కృషి చేయాలని అన్నారు. గడిచిన 5 ఏళ్లలో అభివృద్ధి పడకేసిందని, ప్రభుత్వ పథకాల లబ్ధి కొందరికే చేకూరిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంతి జగన్‌ 30 రోజులపాలన స్పూర్తిదాయకంగా ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ చీప్‌విఫ్‌ శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ అధికారులు ప్రజల సమస్యల పట్ల త్వరితగతిన స్పందించాలని, జిల్లాలో మంచినీటి ఎద్దడి అధికంగా ఉందని దీనిపై అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. రాయచోటి విడిజన్‌లో విత్తనాల కొరత కొంత వేధిస్తోందని, 50 శాతం మేర మామిడి చెట్లు ఎండిపోయాయని, పరిశీలించి రైతులకు నష్టపరిహారం అందించాలని కలెక్టర్‌ను కోరారు.

అధికారులు బయటకు వెళ్లేటప్పుడు సమాచారాన్ని కార్యాలయంలో ఇచ్చి వెళ్లాలన్నారు. రైతులు కార్యాలయాల చుట్టూ తిరగకుండా చూడాలన్నారు. దీనికి స్పందించిన కలెక్టర్‌ సీఎం ఆదేశాల మేరకు ప్రతి సోమవారం స్పందన కార్యక్రమాన్ని త్వరలో అమలు చేస్తున్నామన్నారు.కలెక్టర్‌ హరికిరణ్‌ మాట్లాడుతూ జిల్లాకు చెందిన వ్యక్తి సీఎం కావడం మన జిల్లాకు ఎనలేని ప్రాధాన్యత సంతరించుకుందన్నారు. సమస్యలేమైనా ఉంటే తమకు తెలియజేయాలని, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు. జలశక్తి అభియాన్‌లో మన జిల్లాకు చోటు దక్కిందన్నారు. అధికారులంతా ఒక ఫ్యామిలీలాగా పనిచేయాలని,ఎమ్మెల్యేలు ప్రజలతో మమేకం కావాలని చెప్పారు. త్వరలో మున్సిపాలిటీలు, జెడ్పీ, ఎంపీపీల పాలకవర్గం ముగియనుందని, వారి స్థానాల్లో మీరంతా స్పెషల్‌ అపీసర్లు కానున్నారన్నారు. త్వరలో గ్రామవలంటీర్‌ వ్యవస్థ వస్తుందని, ప్రతి ప్రభుత్వ పథకం వారి ద్వారానే అమలవుతుందని వివరించారు. జులై 8వ తేదీ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించకుని పింఛన్లు పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top