రాష్ట్రంలో మత కల్లోలానికి టీడీపీ కుట్రలు : డిప్యూటీ సీఎం

Deputy CM Amjad Basha Issued a Press Release on Subsidizing the Pilgrims - Sakshi

సాక్షి, అమరావతి : మతాల మధ్య చిచ్చుపెట్టి తద్వారా రాష్ట్రంలో కల్లోలం రేపాలని టీడీపీ, దాని అనుకూల మీడియా ప్రయత్నిస్తోందని డిప్యూటీ సీఎం, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అంజాద్‌ బాషా ఆరోపించారు. పవిత్రయాత్రలకు రాయితీలు ఇవ్వడం దశాబ్దాలుగా ఉన్న ప్రభుత్వ విధానమంటూ.. ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి మతాన్ని అంటగడుతున్నారని ధ్వజమెత్తారు. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి మంగళవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఇందులో.. ‘రాష్ట్రంలో మత ఘర్షణలకు ప్రతి పక్ష తెలుగదేశం పార్టీ, కొన్ని శక్తులు కుట్ర పన్నుతున్నాయి. కులాలకు, మతాలకు, రాజకీయాలకు, వర్గాలకు అతీతంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌మోహన్‌రెడ్డి గారిని లక్ష్యంగా చేసుకుని టీడీపీ నాయకులు, దాని అనుకూల మీడియా సంస్థలు, సామాజిక మాధ్యమాల ముసుగులో విద్వేషకారులు రాష్ట్రంలో ఉన్న ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీసి అలజడి సృష్టించానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అన్ని మతాల వారిని సమానంగా చూసుకుంటూ ఆయా వర్గాల మేలుకోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుంటే, వాటిని కూడా వక్రీకరించి, అల్పబుద్ధితో గౌరవ ముఖ్యమంత్రిగారి మీద, ప్రభుత్వం మీద విష ప్రచారం చేస్తున్నారు.

ఈ కుయత్నాల్లో కొన్ని మీడియా సంస్థలు భాగస్వాములు కావడం దురదృష్టకరం. ఇలాంటి వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాం. పవిత్ర యాత్రలకోసం ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు ఇప్పుడు కొత్తగా అమలు చేస్తున్న కార్యక్రమం కాదు. కొన్ని దశాబ్దాలుగా ఈకార్యక్రమాన్ని ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. గత అక్టోబరు 30 జరిగిన మంత్రివర్గ సమావేశంలో పవిత్ర యాత్రలకు వెళ్తున్న క్రైస్తవ, మైనార్టీ సోదరులకు రాయితీలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాం.  హజ్‌, జెరూసలేంలకు వెళ్తున్న యాత్రికుల వార్షికాదాయం రూ.3 లక్షలలోపు ఉన్నవారికి ఇప్పుడు ఇస్తున్న సహాయాన్ని రూ.40వేల నుంచి రూ.60వేలకు, రూ. 3లక్షలకు పైబడి ఉన్నవారికి ఇప్పుడు ఇస్తున్న సహాయాన్ని రూ.20వేల నుంచి రూ.30వేలకూ పెంచుతూ రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయం నిర్ణయం తీసుకుంది. పై నిర్ణయాలకు సంబంధించి ఆయా ప్రభుత్వ విభాగాలు జీవోలు జారీచేస్తున్నాయి. ఈ జీవోలను పట్టుకుని ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి మతాలను అంటుగడుతూ చేస్తున్న ప్రచారం అత్యంత దుర్మార్గమైనది. రాష్ట్రంలో మతాలమధ్య చిచ్చు పెట్టే పన్నాగమిది. వీటిని ప్రజలు గమనిస్తున్నారన్న విషయాన్ని మరిచిపోవద్దు. ఈ ప్రభుత్వానికి అన్ని మతాలూ సమానమే. అందరి సంక్షేమం మా లక్ష్య’మంటూ ముగించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top