స్వగ్రామం చేరిన మృతదేహాలు

Dead Bodies Reached To Native Place In Palakollu West Godavari - Sakshi

సాక్షి, పాలకొల్లు (పశ్చిమ గోదావరి): గుంటూరు సమీపంలోని చిలకలూరిపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన తిరుమల నాగ వెంకటేశ్వరరావు, అతని భార్య సూర్య భవాని, కుమార్తె సోనాక్షి, కుమారుడు గీతేశ్వర్, బావమరిది కటికిరెడ్డి అనోద్‌కుమార్‌ల మృతదేహాలు అంబులెన్స్‌లో సోమవారం రాత్రి 11 గంటలకు స్వగ్రామం చేరుకున్నాయి. పాలకొల్లు మండలం సబ్బేవారిపేటలో ఇంటి వద్ద ఉదయం నుంచి మృతదేహాల కోసం ఎదురు చూసిన బంధువులు, మిత్రులు, స్థానికులకు మృతుల ముఖాలు చూపించకుండానే అంబులెన్సులు యడ్లబజారులోని హిందూ శ్మశాన వాటికకు తరలించారు. అనోద్‌కుమార్‌ తండ్రి శ్రీనివాసరావు మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు.

డాడీ.. అమ్మా భవాని..
ఎక్కడికి వెళ్లినా చెప్పి వెళ్లేవాడివి.. డాడీ ఇప్పుడే వస్తాననేవాడివి అంటూ అనోద్‌కుమార్‌ తండ్రి శ్రీనివాసరావు కుమారుడిని తలచుకుని కన్నీళ్లు పెట్టారు. అమ్మా భవాని... అమ్మా భవానీ అంటూ కుమార్తెను, మనవరాళ్లని అమ్మా సోనా అంటూ తలచుకుని ఏడుస్తుంటే  చూసేవారి హృదయాలు ద్రవించాయి.

విధి చిన్నచూపు..
స్వయంకృషితో ఎదిగి నలుగురికి ఆదర్శంగా నిలిచారు.. మూడు పదుల వయసు దాటక ముందే మృత్యుఒడికి చేరారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట సమీపంలో పాలకొల్లు మండలం సబ్బేవారిపేటకు చెందిన తిరుమల నాగ వెంకటేశ్వరరావు (వెంకట్‌) (30), భార్య సూర్యభవాని (28), కుమార్తె సోనాక్షి (7), కుమారుడు గీతేశ్వర్‌ (5)తో పాటు సూర్యభవాని తమ్ముడు కటికిరెడ్డి అనోద్‌కుమార్‌ మృతిచెందారన్న వార్తతో స్థానిక సబ్బేవారిపేట ప్రజలు ఉలిక్కిపడ్డారు. బంధు,మిత్రుల రోదనలతో ఆ ప్రాంతం నిండిపోయింది. మిత్రులంతా వెంకట్‌ అని ముద్దుగా పిలుచుకునే వెంకటేశ్వరరావు, మణికంఠ ఇరువురు అన్నదమ్ములు. తండ్రి పట్టాభిరామయ్య పండ్ల వ్యాపారం చేసేవారు.

తల్లి జానమ్మ, తల్లిదండ్రులు ఇద్దరూ సుమారు 15 ఏళ్ల క్రితం కాలం చేశారు. వెంకటేశ్వరరావు, మణికంఠలు అప్పటికి మైనర్లు. ఏ పనీ చేతకాని వయసు వారిది. తండ్రి నిర్వహించిన పండ్ల వ్యాపారాన్ని మేనమామల సూచనలు, సలహాలతో అన్నదమ్ములిద్దరు కొంతకాలం చేశారు. ఫొటోగ్రఫీ నేర్చుకుని పదేళ్ల క్రితం పట్టణంలోని మునిసిపల్‌ ఆఫీస్‌కు ఎదురుగా లక్ష్మీ శ్రీపట్టాభి పేరుతో ఫొటోగ్రఫీ, డిజిటల్‌ వర్క్స్‌ను ప్రారంభించారు. తండ్రి హయాంలో నిర్మించిన ఇంటిని చక్కగా రీమోడలింగ్‌ చేసుకున్నారు. స్డుడియో వర్కు మీద దూర ప్రాంతాలకు వెళ్లడానికి మారుతీ వ్యాన్‌ కూడా కొనుగోలు చేసుకున్నారు.

వారం రోజుల క్రితమే కృష్ణాజీ మల్టీఫ్లెక్స్‌ సమీపంలో శ్రీ గాయత్రి రెస్టారెంట్‌ను లాంచనంగా ప్రారంభించారు. వీరి ఎదుగుదలను విధి చిన్నచూపు చూసింది. రోడ్డు ప్రమాదం రూపంలో వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులను కబళించింది. ప్రమాద సమయంలో తమ్ముడు మణికంఠ వాహనం నడుపుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే వాహనంలోని బెలూన్‌లు తెరుచుకోవడంతో ఆయన మృత్యువు నుంచి తప్పించుకున్నారు. ఎప్పుడూ వారు వారి మారుతీవ్యాన్‌లో వెళ్లేవారు. అయితే దైవదర్శనం కోసం ఎక్కువమంది ప్రయాణించాల్సి ఉందని వెంకటేశ్వరరావు మిత్రుడికి చెందిన వాహనంలో వెళ్లి మృత్యువాత పడ్డారని స్థానికులు చెబుతున్నారు.

దేవుడు అన్యాయం చేశాడు
నేను పండ్ల వ్యాపారం చేస్తా. నాకు విలువైన సలహాలు, సూచనలు ఇచ్చేవాడు. వెంకట్‌ నా మేనమామ కొడుకు. చిన్నప్పట్నుంచి కష్టజీవి. స్వయంకృషితో పైకి వచ్చాడు. ఇలా కుటుంబం అంతా మరణిస్తారని ఊహించలేదు. సొంతంగా ఫొటోగ్రఫీ వర్క్‌ చేసుకుంటూ బీజీ అయ్యాడు. ఈ మధ్యనే హోటల్‌ పెట్టాలని లాంచనంగా జూన్‌ 26న ముహూర్తం చేశాడు. 
– పవన్, మృతుడు వెంకట్‌ బంధువు

చాలా మంచి కుటుంబం 
చాలా మంచి కుటుంబం అందరితోనూ కలిసిమెలసి ఉండేవారు. ఫొటో స్టూడియో నడుపుకుంటూ జీవిస్తున్నారు. ఎవరితోనూ విభేదాలు లేవు. వారి పిల్లల ఆటపాటలు, మాటలే గుర్తుకు వస్తున్నాయి. వీరంతా స్వామి దర్శనానికి వెళ్లి ప్రమాదానికి గురవ్వడం నమ్మలేకపోతున్నాం. రెండు రోజుల ముందు మా కళ్లెదురుగానే ఉన్న ఆ కుటుంబం ఇలా ప్రమాదానికి గురవ్వడం చాలా బాధగా ఉంది. ఒకే కుటుంబంలో అందరూ మృతి చెందడం కాలనీ వాసులను కలచి వేసింది.
- రాజన్‌ పండిట్, స్థానికుడు, సబ్బేవారిపేట

తీరని వేదన 
మృతుడు మా మేనమామగారి అబ్బాయి. సుమారు 12 ఏళ్ల క్రితమే తల్లిదండ్రులు మృతి చెందారు. అప్పటి నుంచి అన్నదమ్ములు ఇద్దరూ మేనమామ సంరక్షణలోనే ఉన్నారు. ఆయన కూతురినే పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు కుటుంబం అంతా మరణించడం బాధాకరం. ఈ ఘటన మాకు తీరని వేదనను మిగిల్చింది. 
– కుంపట్ల నాగ శ్రీనివాసు, మృతుని తండ్రి మేనల్లుడు

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top