కడప గడపలో  కరువు దరువు

Crop Damage Survey In YSR Kadapa - Sakshi

సాక్షి ప్రతినిధి కడప: అతివృష్టి.. అనావృష్టి.. క్రమం తప్పకుండా కడప గడపలోనే తిష్టవేశాయి. వెరసి జిల్లా రైతాంగానికి వ్యవసాయం కడుభారంగా మారింది. జీవనోపాధి కోసం నగరాలకు వలసలు తెరపైకి వచ్చాయి. పదిమందికి పట్టెడన్నం పెట్టే రైతు నగరాల్లో కూలీలుగా, సెక్యూరిటీ గార్డులుగా జీవనం సాగిస్తున్నారు. ఆదిరించి అండగా నిలవాల్సిన ప్రభుత్వం ఉత్తుత్తి మాటలకు పరిమితమైంది. కరువు ప్రకటన చేస్తుంది..ఆపై ఏళ్లు గడుస్తున్నా పరిహారం ఊసే ఎత్తదు. ఇదే పరిస్థితిని నాలుగేళ్లుగా రైతులు ఎదుర్కొంటున్నారు.

పంట ఏదైనా సరే.. నష్టాలు చవిచూడాల్సిన పరిస్థితి రైతులకు ఎదురవుతోంది. ఆరుతడి పంటలు, పండ్లతోటలు, ఆకుతోటలు, చిరుధాన్యాలు, పూలతోటలు ఇలా ఏ పంటైనా సరే రైతులు అప్పుల ఊబిలోకి వెళ్తున్నారు. 2013–14 నుంచి ఇప్పటికీ ఇదే పరిస్థితి తలెత్తుతోంది. ఈమారు జూన్, జూలై, ఆగస్టు నెలల్లో   సరాసరిన 65 శాతం తక్కువగా వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా 51 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించడం మినహా ఎలాంటి సహాయక చర్యలు చేపట్టలేదని రైతన్నలు వాపోతున్నారు.

పేరుకుపోతున్న పరిహారం..
వరుస కరువులను చవిచూస్తున్న రైతులకు పరిహారం మాత్రం సకాలంలో దక్కలేదు. 2013 నుంచి ఇప్పటి వరకు నష్టపోయిన వ్యవసాయ, ఉద్యాన పంటలకు జిల్లాకు  ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద రూ.56.08 కోట్లు జిల్లాకు రావాల్సి ఉంది. వ్యవసాయ పంటలకు రూ.45.87 కోట్లు కాగా, ఉద్యానవన పంటలకు రూ.10.21 కోట్లు అందాల్సి ఉంది. 44 మండలాల్లోని 51వేల మందికిపైగా రైతులు నష్టపరిహారమైన ఇన్‌పుట్‌ సబ్సిడీ కోసం ఎదు చూస్తున్నారు. సకాలంలో చెల్లించి రైతులకు దన్నుగా నిలవాలనే దృక్పథం ప్రభుత్వంలో కన్పించడం లేదని పలువురు వాపోతున్నారు. వ్యవసాయం తప్ప మరోపని చేసేందుకు ఆసక్తి చూపని రైతన్న ఉద్యాన పంటలను సాగుచేస్తే అకాల వర్షాలు, ఈదురుగాలులు దెబ్బతీస్తున్నాయి. ఏటా ఆయా విపత్తుల వల్ల నిండా మునిగిపోతున్నారు.

సాయమందించాలనే మాటను ప్రభుత్వం ఎప్పుడో మరచిపోయిందని రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పంట నష్టం అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి పంపినా ఉలుకుపలుకు లేదని వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు పెదవి విరుస్తుండడం విశేషం.  జిల్లాలో 2013లో ఫిబ్రవరి నుంచి 2017 అక్టోబరు వరకు ప్రకృతి విపత్తులతో 4,293 హెక్టార్లలో ఉద్యాన పంటలు(తోటలు) దెబ్బతినగా 9,425 మంది రైతులు రూ.10.21 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీ మంజూరు చేయాలని ఉద్యానశాఖ జిల్లా అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కాగా ఇంత వరకు పైసా కూడా ప్రభుత్వం మంజూరు చేసి ఉంటే ఒట్టని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జూలై 31 వరకు సాగు చేసిన పంటలే పరిగణలోకి..
ఈనెల 8వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్‌ జిల్లాలోని 51 మండలాలను కరువు మండలాలుగా గుర్తించినట్లు ప్రకటిస్తూ జీఓ  నంబరు 6ను విడుదల చేసింది. ఆపై ఈ ఖరీఫ్‌కు సంబందించి జూలై 31వ తేదీ లోపు సాగైన పంటలకు మాత్రమే పరిహారంటూ కట్‌ఆఫ్‌ డేట్‌ను ప్రభుత్వం ప్రకటించడంతో రైతుల గుండెల్లో గునపం దించినట్లవుతోంది. కేవలం జూలై నెలాఖరులో ఏ రైతులైతే పంట సాగు చేసి ఉంటారో వారి పేర్లను మాత్రం పరిహారం కోసం నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆగస్టులో పంట సాగు చేసిన వారి నోట్లో మట్టిగొట్టేందుకు రంగం సిద్ధం చేసింది. సాధారణంగా ఖరీఫ్‌కు సంబంధించి జూన్‌లో ప్రారంభించి సెప్టెంబరు నెల వరకు వర్షాభావంతో పంటలు దెబ్బతినడం, వర్ష విరామం(వర్షాలు నెలల తరబడి పడకపోవడం)తో, దిగుబడిని ఆధారం చేసుకుని నష్ట అంచనాలు తయారు చేయడం సర్వసాధారణం.

కాగా ప్రభుత్వం ముందుగానే కరువు మండలలాను ప్రకటించింది. కట్‌ ఆఫ్‌డేట్‌ నిర్ణయించిన కారణంగా పెట్టుబడి రాయితీ (ఇన్‌పుట్‌ సబ్సిడీ)  సగం మందికి కూడా అందే అవకాశం లేకుండా పోతోందని పలువురు రైతులు మండిపడుతున్నారు. జూలై 31వ తేదీ వరకు పంటలను సాగు చేసిన వారిని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ఆదేశించడంతో ఆగస్టు నెలలో  పంట సాగు చేసి నష్టపోయిన రైతుల నోట్లో మట్టి కొట్టే చర్యలకు ప్రభుత్వం పూనుకోవడంపై రైతు సంఘాలు మండిపడుతున్నాయి.

6245 హెక్టార్ల పంట నమోదు చేయరంటా..
జిల్లాలో జూన్‌ నెలలో 69.2 మిల్లీ మీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 31.9 మిల్లీ మీటర్లు  కురిసింది. జూలై నెలలో 96.7 మిల్లీ మీటర్ల వాన పడాల్సి ఉండగా కేవలం 21.5 మిల్లీ మీటర్లు మాత్రమే పడింది. ఆగస్టులో 114 ఎంఎం కురవాల్సి ఉండగా ఇప్పటికే 36ఎంఎం పడింది. ఈ ఖరీఫ్‌ సీజన్‌కు సాధారణ సాగు 1,33,356 హెక్టార్లు కాగా, జూలై ఆఖరుకు 12,501 హెక్టార్లల్లో మాత్రమే పంటలు సాగుచేసినట్లు అధికారిక లెక్కలు కట్టారు.  ఆగస్టు మొదటి వారంలో కురిసిన వానలకు మెజార్టీ రైతులు పత్తి, జొన్న, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, ఇతర పంటలను కలిపి 6245 హెక్టార్లలో సాగు చేశారు. ఆగస్టులో సాగైన ఈ పంటల నమోదును చేపట్టేదిలేదని అధికారులు ఖరాఖండిగా చెబుతున్నారు.

ప్రభుత్వ వైఖరికి నిరసనగా కలెక్టరేట్‌ ఎదుట వైఎస్సార్‌సీపీ ధర్నా..
నాలుగేళ్లుగా ప్రభుత్వం రైతుల పట్ల ప్రభుత్వం నిరంకుశ వైఖరి అవలంభిస్తోంది. పరిహారం ఇవ్వకుండా కేవలం ప్రకటనలతో ముడిపెడుతూ కాలం వెళ్లబుచ్చుతోంది. ఈమారు కూడా కరువు మండలాలు ప్రకటన మినహా ఎలాంటి చేయూత కార్యక్రమాలు చేపట్టలేదు. ఈ నేపథ్యంలో రైతులకు బాసటగా సోమవారం కడప కలెక్టరేట్‌ ఎదుట వైఎస్సార్‌సీపీ ధర్నా చేపట్టనున్నట్లు కడప, రాజంపేట పార్లమెంటు అధ్యక్షులు కొత్తమద్ధి సురేష్‌బాబు, ఆకేపాటి అమర్‌నాథరెడ్డి తెలిపారు. రైతుల సమస్యల పరిష్కా రం కోసం వైఎస్సార్‌సీపీ అవిశ్రాంత పోరాటం చేస్తుందని  వారు వివరించారు. వైఎస్సార్‌సీపీ చేపట్టిన ధర్నాలో జిల్లాలోని రైతులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top