శుభ్రతే కోవిడ్‌-19కు మందు

COVID 19 Virus Alert In Chittoor - Sakshi

అప్రమత్తం అయిన  వైద్యశాఖ 

జాగ్రత్తలపై కరపత్రాలతో ప్రచారం  

‘శుభ్రరంగా ఉంటే నిబ్బరంగా బతికేయవచ్చు.’ అన్నారు మన పెద్దలు. వ్యక్తిగత శుభ్రతకు ప్రాముఖ్యతనిచ్చే వారు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటారనడంలో సందేహం లేదు. ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్‌ –19(కరోనా) వైరస్‌  సైతం చేతులను శుభ్రంగా ఉంచుకుంటే దూరంగా నెట్టేయవచ్చంటున్నారు వైద్యులు. జిల్లాలోనూ కరోనా వైరస్‌ సోకిందన్న ఉదంతాలతో ప్రజలు భయపడుతున్న తరుణంలో ఈ వ్యాధి వ్యాప్తి, లక్షణాలు, నివారణ చర్యలపై ప్రత్యేక కథనం. 

సాక్షి, చిత్తూరు: కోవిడ్‌–19 (కరోనా) వైరస్‌తో నేడు ప్రపంచం విలవిల్లాడుతోంది. ఈ వ్యాధి పేరు వింటేనే జనం వణుకుతున్నారు. అయితే వైద్యులు మాత్రం ఈ వ్యాధి శుభ్రతతోనే దూరం అవుతుందని చెబుతున్నారు. వ్యాధి వచ్చిన తరువాత చికిత్స తీసుకోవడం కంటే ముందే నివారణ చర్యలు పాటించడం మంచిదంటున్నారు.  

రాష్ట్రంలోనూ ప్రకంపనలు  
చైనాలో పుట్టిన కోవిడ్‌–19 (కరోనా) వైరస్‌ రాష్ట్రంలోనూ ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇటీవల తిరుపతి సమీపంలోని ఓ పరిశ్రమలో పనిపై విదేశం నుంచి వచ్చిన ఓ వ్యక్తికి కోవిడ్‌–19 వైర స్‌ ఉందన్న అనుమానంతో రుయాలో పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో నెగటివ్‌ రావడంతో జిల్లా ఊపిరి పీల్చుకుంది. అయితే వైద్య ఆరోగ్య శాఖాధికారులు మాత్రం జిల్లాలోని తిరుపతి, చిత్తూరు, మదనపల్లె, పుంగనూరు, పీలేరు, పుత్తూరు ఆస్పత్రుల్లో కరోనా ఐసోలేషన్‌ వార్డులను ఏర్పాటు చేశారు. వీటిపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై 322 బ్యానర్లు, 3.20 లక్షల కరపత్రాలు సిద్ధం చేసి, పీహెచ్‌సీ, సీహెచ్‌సీలకు అందజేశారు.   
వ్యాధి వ్యాప్తి ఇలా.. 
పక్షులు, క్షీరదాలు, గబ్బిలాలు, పాములు, పెంపుడు జంతువుల నుంచి వస్తుంది. వ్యాధి సోకినా వ్యక్తి దగ్గినా, తుమ్మినా గాలి ద్వారా నోటి తుంపర్ల బయటకు వచ్చి, మనుషుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. 

లక్షణాలివీ.. 
జలుబు, దగ్గు, తలనొప్పి, జ్వరం, గొంతు గరగర, ఛాతిలో నొప్పి, ఊపిరి పీల్చుకోవడం ఇబ్బందిగా ఉండడం. 

వ్యాధి నివారణకు జాగ్రత్తలివీ.. 

  • దగ్గు, తుమ్ములు, జలుబు తదితర లక్షణాలున్నవారికి దూరంగా ఉండాలి.   
  • జలుబు, దగ్గు, జ్వరంతో పాటు శ్వాస తీసుకోవడంతో ఇబ్బంది ఉంటే, వెంటనే మాస్కు ధరించి, ప్రభుత్సాస్పత్రికి వెళ్లి వైద్యులకు సంప్రదించాలి. 
  • తుమ్ములు, దగ్గు వచ్చిన్నప్పుడు చేతి రుమా లు అడ్డం పెట్టుకోవాలి. 
  • చేతులను తరుచు సబ్బుతో శుభ్రం చేసుకోవాలి.  
  • సాధ్యమైనంత వరకు దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి. చలిప్రదేశంలో తిరగకుండా ఉండాలి.  
  • విదేశాల నుంచి వచ్చిన వారు వైరస్‌ లక్షణాలున్నా లేకపోయిన కచ్చితంగా 28 రోజులపాటు వైద్యుల పరిశీలనలో ఉండాలి. వారు ఇతరులతో కలవకూడదు. 
  • వైద్య పరిశీలనలో ఉన్న వారి వద్దకు సందర్శకులకు అనుమతించకూడదు.  
  • అవసరమైతే తప్ప జనసామర్థ్యం ఉండే బహిరంగ ప్రదేశాల్లో తిరగకూడదు. తిరిగేటప్పుడు మాస్క్‌లు ధరించడం మంచిది.  

ప్రజలకు అవగాహన 
కరోనా వైరస్‌పై ప్రభుత్వం ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖ ద్వారా కరపత్రాలతో ప్రచారం చేస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆదేశాల మేర కు జాతీయ ఆరోగ్యమిషన్‌ చర్యలకు ఉపకరించింది. వ్యాధి బారిన పడకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించడం మంచిందని వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తోంది. ఈ వ్యాధికి సంబంధించి 0866–2410978, 1100, 1100, 1902 హెల్ప్‌లైన్‌ నంబర్లలో సంప్రదించాలని సూచిస్తోంది.  

ఉడికించిన మాంసమే మేలు 
ప్రస్తుతం హాఫ్‌ బాయిల్, తందూరి, తదితర ఆహార పదార్థాలు తీసుకోవడం ఫ్యాషన్‌గా మారింది. అది మంచి పద్ధతి కాదు. మాంసాన్ని బాగా ఉడికించి మాత్రమే తినాలి. వాటిపై ఈగలు వాల కుండా చూడాలి. ఇంట్లో వండేటప్పుడు వంటగదిలో ఆహార పదార్థాలపై పురుగులు పడకుండా చూడాలి. పూర్తిగా మంట పెట్టి, మాంసం పూర్తిగా ఉడికిన తర్వాత భుజించాలి.

కలుషిత ఆహారం తినొద్దు 
కోవిడ్‌ 19(కరోనా) వైరస్‌ నివారణకు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతే ముఖ్యమని వైద్యులు చెబుతున్నారు. 
నేటి ఆధునిక సమాజంలో నిత్యం తీరికలేని జీవితంతో ప్రజలు ఎలా పడితే అలా ఉంటున్నారు. ఏది పడితే అది, ఎక్కడంటే అక్కడ తింటున్నారు. ఇలా చేయడంతో రోగాలు త్వరగా వ్యాప్తి చెందుతున్నాయని వైద్యాధికారులు చెబుతున్నారు. కలుషిత ఆహారం, ఈగలు, దుమ్ము ధూళి చేరిన ఆహార పదార్థాలను తినడం కూడదని సూచిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన, కాళ్లకు చెప్పులు లేకుండా మరుగుదొడ్డికి వెళ్లకూడదని పేర్కొంటున్నారు. ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, వంట సరుకులు శుభ్రమైన నీటితో కడగాలని,  భోజనం వండేవారు, వడ్డించేవారు తినే ముందు తిన్న తర్వాత చేతులు శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు. 

పరిశుభ్రత పాటించాలి 
దగ్గేటప్పుడే, తుమ్మేటప్పుడు, చీదేటప్పుడు చేతిరుమాలు కచ్చితంగా అడ్డు పెట్టుకోవాలి.  చైనా నుంచి వచ్చిన వ్యక్తుల్లో ఎవరైనా మన సమీప ప్రాంతాలకు చెందిన వారైతే 28 రోజుల తర్వాత మీకు ఏదైనా జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంతో ఇబ్బందులుంటే వెంటనే స్థానిక ఆస్పత్రుల్లో కానీ హెల్ప్‌లైన్‌ నంబర్‌లో కానీ సంప్రదించాలి.  
– సుదర్శన్, కోవిడ్‌–19 నివారణ  జిల్లా నోడల్‌ అధికారి 

భయపడవద్దు 
ప్రజలు కోవిడ్‌–19 (కరోనా) గురించి అవనసరంగా భయపడవద్దు. తెలంగాణ, ఢిల్లీలో పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తిరుపతిలో అనుమానంతో చేరిన రోగికి నెగిటివ్‌ రిపోర్ట్స్‌ రావడంతో డిశ్చార్జి చేశాం. రద్దీ కూడళ్లల్లో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశాం. రుయాలో 20 బెడ్‌లతో వార్డును పెట్టాం. కొన్ని చానెల్స్‌ అవగాహన లేకుండ ప్రచారాలు చేస్తున్నాయి. వాటిని నమ్మవద్దు.  
– పెంచలయ్య, డీఎంహెచ్‌ఓ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top